జిల్లాకు రాని పుస్తకాలు
15,60,090 అవసరం
ఇప్పటివరకు రాని వైనం
గతేడాది ఇదే సమయూనికి 70 శాతం చేరిక
విద్యారణ్యపురి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ ఏడాది కూడా పాఠ్యపుస్తకాలు సకాలంలో అందే పరిస్థితులు కనిపించడం లేదు. గతేడాది తొందరగా వచ్చినా.. ఏటా పాఠ్యపుస్తకాలు అందడం ఆలస్యం అవుతూనే ఉంది. వేసవి సెలవులు ముగిసిన అనంతరం జూన్ 12న పాఠశాలలు తెరుచుకుంటారుు. అంటే జూన్ మాసంలో పుస్తకాలు విద్యార్థులకు అందించాలి. కానీ, ఇప్పటివరకు జిల్లాకే చేరుకోలేదు. కనీసం ముద్రణ కూడా కాలేదని సమాచారం. విద్యార్థులకు పుస్తకాలు అందాలంటే రాష్ట్ర ప్రభుత్వ గోదాముల నుంచి జిల్లా అధికారులకు, ఈ అధికారుల నుంచి మండల గోడౌన్‌లకు.. అక్కడి నుంచి ఉపాధ్యాయులకు.. వీరు విద్యార్థులకు పంపిణీ చేయూలి. ఇదంతా జరగాలంటే మార్చిలోనే పుస్తకాలు జిల్లాకు చేరుకుని ఉండాలి. కానీ, రాలేదు.
పుస్తకాలు అందడం అనుమానమే..
కాగా, జిల్లాలో తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియం ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థుల కోసం 183 టైటిల్ పుస్తకాలు, 17,16,099 పాఠ్యపుస్తకాలు కావాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇందులో 15,60,090 పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేయడానికి, మిగితావి అమ్మకాల కోసం ప్రతిపాదించారు. గతేడాది 26 లక్షల పాఠ్యపుస్తకాలు ప్రతిపాదించగా.. ఇందులో గత ఏప్రిల్ 1 వరకు 70 శాతం పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుకున్నారుు. ఏప్రిల్ 23 తేదీ వరకు విద్యార్థులకు పంపిణీ అయ్యూరుు. కానీ, ఈ ఏడాది ఏప్రిల్ 1 వచ్చినా పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుకోలేదు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగినా అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు పంపలేదని సమాచారం. 2014 సెప్టంబర్‌లో ఉన్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగానే పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తారని తెలుస్తోంది. గతేడాది జిల్లాకు వచ్చిన పాఠ్యపుస్తకాల్లో వివిధ టైటిల్స్ కలిపి 2 లక్షల పాఠ్యపుస్తకాలు జిల్లాకేంద్రంలోని విద్యాశాఖ డిపోలోనే మిగిలి ఉన్నారుు. ఇవి అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం పేరిట ఉన్నారుు. ఈ పుస్తకాలు కూడా పనికిరావు. జూన్ నాటికి పాఠ్యపుస్తకాలు అందేలా చూడాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
ప్రైవేటు విద్యార్థులకు కూడా శాపం
జిల్లాలో 1,637 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి అందు లో 1వ తరగతి నుంచి పదో తరగతి వరకు 3,19,250 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠ్య పుస్తకాలు మార్కెట్‌లోకి వస్తేనే ఆయా విద్యార్థులు కూడా పాఠ్యపుస్తకాలు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది.
ఆలస్యానికి కారణాలు..
తెలంగాణ రాష్ట్రానికి అనుగుణంగా సిలబస్‌ను మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకటి నుంచి పదో తరగతి వరకు పాఠ్యాంశాలలో తెలంగాణ గురించి, మహనీయుల చరిత్ర అంశాలను చేర్చాలని చూస్తోంది. తెలంగాణ రాష్ర్టం పేరిట పాఠ్యపుస్తకాలను ముద్రించాల్సి ఉంది. మార్పుల కోసం సంబంధిత కమిటీ నివేదిక అందజేసినా ప్రభుత్వం ఆమోద ముద్ర వేయలేదు. ఆమోదం తర్వాతే ముద్రణ ప్రారంభమవుతుంది.
పాఠ్య పుస్తకాలేవీ?
Published Thu, Apr 2 2015 12:42 AM | Last Updated on Sat, Sep 2 2017 11:42 PM
Advertisement
Advertisement