పాఠ్యపుస్తకాలలో పాఠ్యాంశాల వారీగా ముద్రించిన ‘క్యూఆర్ కోడ్’
సాక్షి, ప్రత్తిపాడు(గుంటూరు జిల్లా): ఒక్క స్కాన్‌తో పాఠం మళ్లీమళ్లీ వినొచ్చు. దృశ్యరూపంగానూ వీక్షించొచ్చు. అవగతమయ్యే వరకు వినొచ్చు. చూడొచ్చు. అవును ప్రభుత్వం పాఠ్యాంశాల బోధనలో ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. పాఠ్యపుస్తకాలకు క్యూఆర్ కోడ్ హంగులు అద్దింది. దీనివల్ల పిల్లలు పాఠ్యాంశాలను ఇళ్ల వద్ద కూడా అర్థమయ్యేవరకూ వినొచ్చు. చూడొచ్చు.
గతంలో ఎన్నో ఇబ్బందులు
గతంలో విద్యార్థులు తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పిన పాఠం అర్థం కాకపోతే చాలా గందరగోళానికి గురయ్యేవారు. ఏం చేయాలో పాలుపోక లోలోన కుమిలిపోయేవారు. అర్థం కాలేదని అడిగితే టీచర్ ఏమంటారోనని భయపడేవారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం క్యూఆర్ కోడ్‌తో పాఠ్యపుస్తకాలను రూపొందించింది.
ఒక్కో పాఠానికి ఒక్కో కోడ్..
గుంటూరు జిల్లాలో 1,113 పాఠశాలలు ఉండగా 1,35,871 మంది విద్యార్థులు, పల్నాడు జిల్లాలో 1,631 పాఠశాలలు ఉండగా 2,12,025 మంది విద్యార్థులు, బాపట్ల జిల్లాలో 807 పాఠశాలలు ఉండగా 59,099 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికోసం సుమారు 25.56 లక్షలకుపైగా పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం దశలవారీగా అందించింది. గతంలో పాఠ్యపుస్తకం మొత్తానికి కలిపి ఒక్కటే క్యూ ఆర్ కోడ్ ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి పాఠం వద్ద క్యూ ఆర్ కోడ్‌ను ముద్రించింది. ఈ కోడ్‌ను స్మార్ట్‌ఫోన్‌తో స్కాన్ చేస్తే ఎంచక్కా డిజిటల్ పాఠాలను వినొచ్చు. చూడొచ్చు.
దీక్ష యాప్ లేకున్నా..
తొలుత గణితం, భౌతిక, సాంఘిక శాస్త్రాల పుస్తకాలపైనే క్యూఆర్ కోడ్‌లు ముద్రించారు. అప్పట్లో దీక్ష యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని విద్యార్థి లేదా ఉపాధ్యాయుడు అనే ఆప్షన్ ఇచ్చి ఆ తర్వాత క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే పాఠం వచ్చేది. ప్రస్తుతం ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు అన్ని పాఠ్యపుస్తకాలపైనా కోడ్‌ను ముద్రించారు. ఇప్పుడు దీక్ష యాప్ లేకున్నా నేరుగా గూగుల్ లెన్స్ ద్వారా కోడ్ స్కాన్ చేసి పాఠ్యాంశాలు వినవచ్చు.
ఎంతో ఉపయుక్తం
క్యూఆర్ కోడ్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. పునశ్చరణ సమయంలో బాగా ఉపయోగపడుతుంది. పిల్లలు సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. దృశ్యరూపంలో పాఠాలు వినడం వల్ల ఎక్కువ కాలం గుర్తుంటాయి.
– సీహెచ్ వెంకటరెడ్డి, ఉపాధ్యాయుడు, బీవీఆర్ జెడ్పీ హైస్కూల్, ప్రత్తిపాడు
కొత్తగా.. ఆసక్తిగా ఉంది
క్లాస్ రూంలో టీచర్ చెప్పిన పాఠం అర్థం కాని సమయంలో ఈ క్యూర్ కోడ్‌ను స్కాన్ చేసి మళ్లీ పాఠం వినవచ్చు. ఇది మాకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. వీడియో రూపంలో పాఠాలు వినడం కొత్తగా, ఆసక్తిగా ఉంది.
– గురుగూరి పూజ, 9వ తరగతి విద్యార్థిని, ప్రత్తిపాడు హైస్కూల్
Comments
Please login to add a commentAdd a comment