UNESCO Comments On Online Classes And Direct Teaching To Students, Details Inside - Sakshi
Sakshi News home page

Online Classes: స్కూళ్లను కాదని ఆన్‌లైన్‌కు వెళితే.. చదువుకు చెద!

Published Wed, Jan 19 2022 3:23 AM | Last Updated on Wed, Jan 19 2022 8:41 AM

UNESCO Comments about Direct teaching to Students - Sakshi

నిరంతరాయంగా పాఠశాలల మూసివేత వల్ల విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోంది. పేదలు, అణగారిన వర్గాల పిల్లలు చాలా నష్టపోతారు. అసమానతలు పెరిగి, సమాజంపై దుష్ప్రభావం పడుతోంది. పిల్లల్లో డ్రాపవుట్లకు దారితీస్తోంది. పాఠశాలలు తెరిచిన తరువాత బాలలకు సరైన సామర్థ్యాలు లేక స్కూళ్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపడంలేదు. చివరకు వారు బాల కార్మికులుగా మారే ప్రమాదం ఏర్పడుతోంది.
– యునెస్కో (యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌) నివేదిక 

సాక్షి, అమరావతి: కరోనా మూడో వేవ్‌ ఉన్నప్పటికి, విద్యార్థుల భవిష్యత్తు, అభ్యసన సామర్థ్యం దెబ్బతినకుండా విద్యా సంస్థలను తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా ప్రొటోకాల్‌కు అనుగుణంగా విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎటువంటి సమస్యలు రాకుండా పటిష్టమైన జాగ్రత్తలతో  విద్యాసంస్థల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (యునెస్కో) కూడా పాఠశాలలను తెరవాలనే  చెబుతోంది. విద్యా సంస్థలను తెరిచి, ప్రత్యక్ష బోధనే మేలని వెల్లడించింది.

పాఠశాలల మూసివేత వల్ల విద్యార్థులు, ముఖ్యంగా పేద, బడుగు బలహీనవర్గాల పిల్లలు తీవ్రంగా నష్టపోతారని తెలిపింది. ఉన్నత, పేద వర్గాలకు మధ్య అసమానతలు మరింత పెరుగుతాయని, ఇది సమాజంపై దుష్ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. కోవిడ్‌ కారణంగా గత రెండేళ్లుగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. దీని పర్యవసానాలపై యునెస్కో అంతర్జాతీయంగా అనేక కోణాల్లో అధ్యయనం చేసి, ఇటీవల ‘కోవిడ్‌–19 ఎడ్యుకేషన్‌ రెస్పాన్స్‌’ పేరిట నివేదికను విడుదల చేసింది. విద్యా సంస్థల మూసివేత వల్ల విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు.. అంతిమంగా సమాజానికి ఎంతటి నష్టమో వివరించింది.

ప్రత్యక్ష బోధన లేక సామర్థ్యాలు, నైపుణ్యాలకు దెబ్బ
పాఠశాలలు తెరచి ప్రత్యక్ష బోధన చేయడం వల్ల విద్యార్థులకు ఆశించిన మేరకు అభ్యాసన సామర్థ్యాలు లభిస్తాయి. పాఠశాలలు మూసివేస్తే వారిలో ఉన్న అభ్యసన సామర్థ్యాలను కూడా కోల్పోతున్నారు. సందేహాలు తీర్చే వారుండరు. వారిలోని లోపాలను సరిచేసే వారుండరు. దీంతో వెనుకబాటుకు గురవుతున్నారు.  గత రెండేళ్లలో పాఠశాలలు మూతపడి ఈ సమస్య చాలా పెరిగిందని అసర్‌ సర్వే కూడా తేటతెల్లం చేసింది. స్కూళ్ల మూసివేత వల్ల అట్టడుగు వర్గాల పిల్లలు మరింతగా నష్టపోతారని యునెస్కో తెలిపింది. పాఠశాలలకు వచ్చే పిల్లల్లో, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల పిల్లల్లో అత్యధికులు పేద వర్గాల వారే. వీరికి సరైన ఆహారమూ ఇళ్లలో అందదు. పాఠశాలలు తెరిస్తే మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం అందుతుంది. లేకపోతే ఆ ఆహారమూ లేక ఆకలితో అలమటిస్తారు. సరైన ఆహారం అందక శారీరక ఎదుగుదల కూడా దెబ్బతింటుంది.

డిజిటల్‌ పరికరాల లేమి
ఆన్‌లైన్‌ బోధనకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా శాఖ తగిన ఏర్పాట్లు చేస్తున్నా, ఈ స్కూళ్లలో చదివేది అత్యధికులు నిరుపేద విద్యార్థులే. వారికి డిజిటల్‌ పరికరాలు లేక ఆన్‌లైన్‌ బోధనను అందుకోలేకపోతున్నారు. మారుమూల, ఏజెన్సీ ప్రాంతాల పిల్లలు మరింత వెనుకబాటుకు లోనవుతున్నారు. వారి కోసం దూరదర్శన్, ఆలిండియా రేడియోల ద్వారా పాఠాలను ప్రసారం చేయిస్తున్నా, టీవీ లేని వారికి అవీ అందడంలేదు. పాఠాలు ప్రసారమయ్యే సమయాల్లో పిల్లలను టీవీలు, రేడియోల ముందు కూర్చోబెట్టి వాటిని నేర్చుకొనేలా చేసే అవకాశం పనులకు వెళ్లిపోయే ఆ పేద తల్లిదండ్రులకు ఉండడంలేదు.

డిజిటల్‌ పరికరాలు ఉన్న టీనేజ్‌ పిల్లలు కొన్ని సందర్భాల్లో ఇతర దురలవాట్లకు లోనయ్యే ప్రమాదమూ ఉంటోంది. వాటి ద్వారా పాఠాల అభ్యసనానికి బదులు ఇతర దుష్ప్రభావాలకు లోనవుతున్నారు. అదే స్కూళ్లు తెరిచి ఉన్నప్పుడు పిల్లల చదువు సంధ్యలను టీచర్లు పర్యవేక్షిస్తారు. పాఠశాలలు మూసివేత వల్ల వైరస్‌ భయంతో పెద్దలు పిల్లలను బయట కూడా తిరగనివ్వడంలేదు. పిల్లలు ఇళ్లలోనే మగ్గిపోయి, మానసికంగా అనారోగ్యం పాలవుతున్నారు. పిల్లల సంరక్షణ, ఆర్థిక సమస్యలు ఇతర కారణాలతో పెద్దల ఆరోగ్యమూ దెబ్బతింటోంది. ఇది ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోందని యునెస్కో అభిప్రాయపడింది. 

బాల్య వివాహాలు
పాఠశాలలు మూతపడి స్కూళ్లకు వెళ్లాల్సిన టీనేజ్‌ ఆడ పిల్లలు ఇళ్లకే పరిమితమై పోతుండడంతో తల్లిదండ్రులు వారికి పెళిŠల్‌ చేసే ఆలోచనలు చేస్తున్నారు. ఇది బాల్య వివాహాలకు దారితీస్తోంది. కొన్ని చోట్ల ఇళ్లకే పరిమితమై ఉండే బాలికలపై లైంగిక వేధింపులు కూడా జరుగుతున్నట్లు యునెస్కో వివరించింది.

ఉపాధ్యాయులకూ సమస్యే
పాఠశాలలు తెరిస్తే ఉపాధ్యాయులు నేరుగా బోధిస్తారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగు పరుస్తారు. పిల్లలతో నేరుగా సంభాషించి, వారిలోని లోపాలను అప్పటికప్పుడు సరిచేస్తారు. సందేహాలను  నివృత్తి చేస్తారు. అదే స్కూళ్లు మూతపడితే ఆన్‌లైన్లోనో, డిజిటల్‌ విధానం, వాట్సప్, ఇతర ప్రక్రియల ద్వారా బోధించాలి. విద్యార్ధులతో నేరుగా మాట్లాడలేరు. వారి సామర్థ్యాలను అంచనా వేయలేరు. మరోవైపు పాఠ్యాంశాలను ఆన్‌లైన్, డిజిటల్‌ ప్రక్రియల్లోకి మార్చడం కూడా టీచర్లకు సమస్యే. వీడియోలో రికార్డు చేసి బోధించడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. డిజిటల్‌ కంటెంట్‌లను విద్యార్థులకు సరిగా అందించలేక ఎక్కువ శాతం టీచర్లు నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు. ఆన్‌లైన్‌ బోధన వల్ల పరీక్షల నిర్వహణ, ఫలితాలు కూడా సరిగా ఉండవని యునెస్కో వెల్లడించింది. గత రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించినా కోవిడ్‌ కారణంగా సాధ్యం కాలేదు. అనివార్య పరిస్థితుల్లో పిల్లలందరినీ వారి సామర్థ్యాలు, ప్రతిభతో సంబంధం లేకుండా ఆల్‌పాస్‌గా ప్రకటించాల్సి వచ్చింది.

తల్లిదండ్రులపైనా తీవ్ర ఒత్తిడి
పాఠశాలల మూత వల్ల పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. పిల్లలకు ఆండ్రాయిడ్‌ ఫోన్లు, కంప్యూటర్లు వంటివి అందించడం పెద్ద సమస్యగా మారింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు వీటి కోసం అప్పుల పాలవుతున్నాయి. చాలామంది వీటిని సమకూర్చలేక పిల్లల చదువులపై ఆందోళనకు గురవుతున్నారు. పిల్లలకు ఆ పరికరాలు సమకూర్చినా, చదువులు ఎలా సాగుతున్నాయోనని పర్యవేక్షణ మరో సమస్య. వాటి వినియోగంలో పిల్లలు సరైన మార్గంలో వెళ్తున్నారో లేదో అర్థంకాక అయోమయంలో పడుతున్నారని యునెస్కో తెలిపింది.

పాఠశాలలకూ ఆన్‌లైన్‌ వనరులు సమకూర్చడం సమస్యే
పాఠశాల తరగతిలో బోధన జరిగితే స్కూళ్ల యాజమాన్యాలు ఉన్న వనరులతో మంచి ఫలితాలు సాధించే వీలుంటుంది. పాఠశాలలు మూసివేస్తే ఆన్‌లైన్‌ బోధనకు ఏర్పాట్లు చేయడం స్కూళ్లకూ సమస్యగా మారింది.  ఆన్‌లైన్‌ బోధనకు అనువుగా పోర్టళ్లు, కంటెంట్‌ను రూపొందించాలి. ఇవన్నీ యాజమాన్యాలకు తలకుమించిన భారం. వీడియో కంటెంట్‌లు, లైవ్‌ ఆన్‌లైన్‌ తరగతులు కొన్ని కార్పొరేట్‌ స్కూళ్లలో కూడా పరిమితంగానే అమలవుతున్నాయి. బడ్జెటరీ పాఠశాలల్లో అదీ ఉండడం లేదు.

ఏపీలో అనేక జాగ్రత్తలతో పాఠశాలలు
పాఠశాలల మూసివేత వల్ల అనేక నష్టాలు, పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరమయ్యే ప్రమాదం ఉండడంతో రాష్ట్రంలో పాఠశాలలను కొనసాగించడంపైనే ప్రభుత్వం దృష్టి సారించింది. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ çపూర్తిస్థాయి జాగ్రత్తలతో విద్యా సంస్థలను నిర్వహిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తిచేసింది. 15 ఏళ్లు పైబడిన పిల్లలకు కూడా యుద్ధప్రాతిపదికన టీకాలు వేస్తోంది. ప్రభుత్వ చర్యలతో సంక్రాంతి సెలవుల అనంతరం సోమవారం నుంచి ప్రారంభమైన స్కూళ్లకు తొలి రోజే 61 శాతం మంది పిల్లలు హాజరవడం విశేషం.

ఆన్‌లైన్‌ కంటే ఆఫ్‌లైన్‌ మేలు
మానసిక కోణంలో ఆలోచిస్తే విద్యార్ధులకు శిక్షణ, క్రమశిక్షణ చాలా అవసరం. పాఠశాలలు చదువు చెప్పే కేంద్రాలే కావు. పిల్లల్లో సమగ్రమైన అభివృద్ధికి, భావి పౌరులుగా తీర్చిదిద్దే సంస్థలు. పిల్లల్లోని ఎమోషన్సును  బేలెన్సు చేసేవి స్కూళ్లే. ఎక్కువ సమయం స్కూల్లోనే ఉంటారు కనుక అనేక అంశాలు నేర్చుకుంటారు. టీచర్‌ నేరుగా చెప్పడం ద్వారానే ఎక్కువగా నేర్చుకోగలుగుతారు. సాధ్యమైన మేరకు తరగతులు నిర్వహించడమే మంచిది. పిల్లలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలతో పాఠశాలలు నిర్వహించడమే మేలు.
 – డాక్టర్‌ ఎన్వీఎస్‌ సూర్యనారాయణ, సైకాలజిస్టు, విజయనగరం

 స్కూళ్లు మూస్తే నష్టం
స్కూళ్లు మూసివేయడం వల్ల గత రెండేళ్లుగా మా పిల్లలు చాలా నష్టపోయారు. ఆన్‌లైన్‌ బోధన వల్ల పాఠాలేవీ నేర్చుకోలేదు. వారి పరిస్థితి చూసి మాకే కష్టమనిపించింది. ఇప్పుడు కూడా స్కూళ్లు మూసివేస్తే మరింత నష్టపోతారు. కరోనా ఉన్నా మాస్కులు వేసి స్కూళ్లకు పంపిస్తున్నాం. ప్రభుత్వం కూడా జాగ్రత్తలు తీసుకొని పాఠశాలలు నడిపించడమే మంచిది.
– పెద్దిరెడ్డి (విద్యార్థి తండ్రి) పడమటి యాలేరు, ఆత్మకూరు మండలం, అనంతపురం జిల్లా

అన్నీ తెరిచే ఉన్నాయిగా..
సినిమా హాళ్లు, షాపులు, ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు, మార్కెట్లు అన్నీ తెరిచే ఉంటున్నాయి. పండగలు, జాతరలు, ఉత్సవాలూ వేలాది మందితో జరుగుతున్నాయి. వాటివల్ల రాని కరోనా సమస్య పాఠశాలలు తెరిస్తే వస్తుందా? రెండేళ్లుగా పాఠశాలలు సరిగా తెరవకపోవడం వల్ల పిల్లలు చాలా నష్టపోతున్నారు. ఇప్పటికీ స్కూళ్లు మూసే ఉంటే వారి భవిష్యత్తు దెబ్బతింటుంది. అన్ని జాగ్రత్తలు తీసుకొని స్కూళ్లలోనే పాఠాలు చెప్పాలి.
– శ్రీధర్, ప్రభుత్వ ఉద్యోగి, అనంతపురం

మరింత నష్టపోకూడదు
పిల్లలకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకొని స్కూళ్లు తెరవడమే మేలు. ఇప్పటికే రెండు విద్యా సంవత్సరాలు పిల్లలు నష్టపోయారు. వారు మరింత నష్టపోకుండా స్కూళ్లలోనే బోధన జరగాలి. పిల్లలకు వ్యాక్సిన్‌ వేస్తున్నందున ఎలాంటి ఇబ్బంది రాదు.
– ఓబుళపతి, వైఎస్సార్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement