ఏపీ: మళ్లీ బడికి పంపేందుకు సమగ్ర సర్వే | Programs of AP Education Department without interruption to education of children | Sakshi
Sakshi News home page

ఏపీ: మళ్లీ బడికి పంపేందుకు సమగ్ర సర్వే

Published Wed, Jun 23 2021 3:26 AM | Last Updated on Wed, Jun 23 2021 7:59 AM

Programs of AP Education Department without interruption to education of children - Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌ ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో చదువులకు దూరమైన బాలికలు, అణగారిన వర్గాలకు చెందిన పిల్లలను తిరిగి చదువుల బాట పట్టించేలా ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. పాఠశాలలు మూతపడడంతో వీరంతా కొద్ది నెలలుగా చదువులకు దూరమై ఇళ్లకే పరిమితమయ్యారు. ఆన్‌లైన్‌లో పాఠ్యాంశాలను అందించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినా స్మార్ట్‌ ఫోన్లు, ఇతర సాధనాలు లేని వారు వాటిని అందిపుచ్చుకోలేకపోతున్నారు. ఫలితంగా ఇది డ్రాపవుట్లకు దారి తీస్తోంది. పాఠశాల స్థాయి చదువులు కూడా పూర్తి చేయలేని పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దీన్ని నివారించి పిల్లల చదువులను తిరిగి గాడిలో పెట్టేందుకు వీలుగా సర్వే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇందుకు అనుగుణంగా అన్ని జిల్లాల విద్యాధికారులు, సమగ్ర శిక్ష ప్రాజెక్టు కోఆర్డినేటర్లు, అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లకు సమగ్ర శిక్ష రాష్ట్ర పథకం సంచాలకురాలు కె.వెట్రిసెల్వి సూచనలు జారీ చేశారు. ఈమేరకు సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొదలైన సర్వే జూలై 5వ తేదీ వరకు కొనసాగనుంది.

5 – 16 ఏళ్ల పిల్లలను బడి బాట పట్టించేలా..
ఈ సర్వే ద్వారా 5 – 16 ఏళ్ల లోపు వయసున్న అణగారిన వర్గాలు, ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీలకు చెందిన పిల్లలు, బాలికలను గుర్తించనున్నారు. స్కూళ్లలో చేరని వారు.. మధ్యలోనే చదువులు మానేసిన వారిని గుర్తించి తిరిగి బడి బాట పట్టించనున్నారు. గ్రామ విద్యా సంక్షేమ సహాయకుడు, క్లస్టర్‌ రిసోర్సు పర్సన్‌ (సీఆర్‌పీ), ఇన్‌క్యూజివ్‌ ఎడ్యుకేషన్‌ రిసోర్సు పర్సన్‌ (ఐఈఆర్‌పీ), పార్ట్‌టైమ్‌ ఇన్‌స్ట్రక్టర్లు సర్వేలో పాల్గొని గ్రామాల వారీగా జాబితా రూపొందించనున్నారు. తల్లిదండ్రుల పేర్లు, పిల్లల ఆధార్‌ నెంబర్లు, చదివిన తరగతి, మొబైల్‌ నెంబర్లను సేకరించి సమగ్ర శిక్ష నిర్దేశించిన ఫార్మాట్‌లో జాబితా రూపొందించి ప్రభుత్వానికి సమర్పించనున్నారు. డీఈవోలు సహా ఇతర అధికారులు పర్యేవేక్షించి సకాలంలో సర్వే నివేదిక ప్రభుత్వానికి చేరేలా చర్యలు తీసుకోవాలని సమగ్ర శిక్ష ఎస్పీడీ సూచించారు. 

కరోనాలో విద్యాశాఖ కార్యక్రమాలు ఇలా
– విద్యామృతం: టెన్త్‌ విద్యార్థులకు దూరదర్శన్‌ ద్వారా టీవీ పాఠాలు
– విద్యా కలశం: టెన్త్‌ విద్యార్థులకు రేడియో పాఠాలు
– విద్యా వారధి: తదుపరి తరగతికి ప్రమోట్‌ అయ్యే విద్యార్థులు సామర్థ్యాలు పూర్తిగా అలవరచుకునేలా 
బ్రిడ్జి కోర్సులు
– ఉపాధ్యాయ శిక్షణ: వెబ్‌నార్ల ద్వారా ఇంగ్లీష్‌లో ప్రావీణ్యంపై రాష్ట్రంలోని 1.50 లక్షల మంది టీచర్లకు శిక్షణ
– స్టూడెంట్‌ హెల్ప్‌లైన్‌: పాఠ్యాంశాలకు సంబంధించి విద్యార్థుల సందేహాలు తొలగించేందుకు కాల్‌ సెంటర్‌ ఏర్పాటు. 200 మందికిపైగా నిపుణులైన టీచర్లతో ఈ కార్యక్రమం.
– వాట్సాప్‌ గ్రూపులు: వాట్సాప్‌ గ్రూపుల ద్వారా మోడల్‌ ప్రశ్న పత్రాలు పంపి విద్యార్థులతో చేయించడం
– ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌ టీచింగ్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌ రూపకల్పనపై పోటీలు
–  8 – 10 విద్యార్థుల కోసం ఆన్‌లైన్‌ డ్రాయింగ్‌ పోటీలు
– అభ్యాస యాప్‌ ద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థులతో అభ్యాసన ప్రక్రియల నిర్వహణ
– ‘నేషనల్‌ హెడ్‌ ఇనిషియేటివ్‌ ఫర్‌ స్కూల్‌ హెడ్స్‌ టీచర్స్‌ హోలిస్టిక్‌ అఛీవ్‌మెంట్‌’ (నిష్టా) ద్వారా ఇంటిగ్రేటెడ్‌ టీచర్‌ ట్రైనింగ్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement