ఇంగ్లిష్‌పై బెండపూడి జెండా | East Godavari District Bendapudi Zilla Parishad High Schools Students | Sakshi
Sakshi News home page

ఇంగ్లిష్‌పై బెండపూడి జెండా

Published Sun, Apr 24 2022 2:38 AM | Last Updated on Sun, Apr 24 2022 3:25 PM

East Godavari District Bendapudi Zilla Parishad High Schools Students - Sakshi

బెండపూడి జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: అది కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఒక మేజర్‌ గ్రామ పంచాయతీ. పది వేల జనాభాతో నాలుగైదు శివారు పల్లెలు కలిగిన ఆ పంచాయతీలో వ్యవసాయం, కూలి నాలీ, చిన్నా, చితకా వ్యాపారాలతో పొట్టపోసుకునే వారే ఎక్కువ. తూర్పుగోదావరి జిల్లాలోని ఈ గ్రామ పంచాయతీ పేరు బెండపూడి. ఇక్కడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులు చూపుతున్న భాషా నైపుణ్యం వల్ల ఇప్పుడు ఈ గ్రామం పేరు సామాజిక మాధ్యమాల్లో మారుమోగిపోతోంది. వ్యవసాయం తప్ప అక్షరం ముక్క తెలియని కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు అమెరికా సంయుక్త రాష్ట్రాల విద్యార్థులతో ఆన్‌లైన్‌లో ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడేస్తున్నారంటే ఆశ్చర్యం వేస్తోంది.   

ఇది ఎలా సాధ్యమైందంటే.. 
రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో తెలుగుతో పాటు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రోత్సహిస్తూ ప్రత్యేకంగా డ్రైవ్‌ నిర్వహిస్తోంది. లెర్నింగ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రాం (లిప్‌) అనే 100 రోజుల వినూత్న కార్యక్రమాన్ని విద్యా శాఖ ఆధ్వర్యంలో చేపట్టింది. ఐదు నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు ఇంగ్లిష్, తెలుగు, హిందీ... ఈ మూడు భాషలపై పట్టు సాధించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ ‘లిప్‌’ కార్యక్రమానికి బెండపూడిలో ఉపాధ్యాయుడు జీవీఎస్‌ ప్రసాద్‌ వినూత్న ఆలోచనలు కూడా జోడించి అమెరికా సంయుక్త రాష్ట్రాల విద్యార్థులతో డిబేట్‌లలో పాల్గొనేలా విద్యార్థులను తీర్చి దిద్దారు. దీంతో వారిలో ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపైంది. ‘హలో వుయ్‌ స్పీక్‌ ఇంగ్లిష్‌ వెరీ వెల్‌ విత్‌ ఎవ్రీవన్‌’ అంటూ అనర్గళంగా మాట్లాడుతున్న ఈ పాఠశాల విద్యార్థులను చూసి కార్పొరేట్‌ పాఠశాలలు విస్తుపోవాల్సిందే. ఈ విద్యార్థులు ఆంగ్లబాషను అమెరికాలో వాడుక భాష స్టైల్‌లో చాలా సాదాసీదాగా మాట్లాడేస్తున్నారు. కార్పొరేట్‌ పాఠశాలల విద్యార్థులను తలదన్నే రీతిలో అమెరికన్‌ విద్యార్థులతో వారాంతాల్లో డిబేట్లలో చురుగ్గా పాల్గొంటున్నారు. 

రోజూ ఐదు పదాలు.. 
► బెండపూడి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 483 మంది విద్యార్థులున్నారు. ఇక్కడ లాంగ్వేజ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రాం గతేడాది నవంబరు 10న ప్రారంభించి, మార్చి 31 వరకు నిర్వహించారు. తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు రోజుకు ఐదు ఇంగ్లిష్‌ పదాల చొప్పున నేర్పించారు. ఆ పదాలకు తెలుగు, హిందీ ఆర్థాలు నేర్పారు. ఇలా వంద రోజుల్లో 1,500 పదాలు నేర్చుకునే విధంగా ఒక ఫార్మాట్‌ రూపొందించి అమలు చేశారు.  
► ‘లెర్న్‌ ఏ వర్డ్‌ ఏ డే’ అనే మరో 100 రోజుల కార్యక్రమంలో ఇంగ్లిష్‌ పదాలు నేర్చుకుంటున్నారు. ప్రతి రోజు ఉదయం స్కూల్‌ అసెంబ్లీలో తొలి 10, 15 నిమిషాలు ఈ పదాలపై ఉపాధ్యాయులు తర్ఫీదు ఇస్తున్నారు.  తర్వాత తరగతి గదిలో వాటిని బోర్డుపై రాయించి, ఎలా పలకాలో వివరిస్తున్నారు. 
► ప్రతి 15 రోజులకు ఒకసారి పరీక్ష పెట్టే వారు. ఇంగ్లిష్, తెలుగు, హిందీ భాషలకు 10 మార్కుల చొప్పున మొత్తం 30 మార్కులకు ఆ పరీక్ష ఉండేది. తద్వారా ఆంగ్లంపై ఎంత వరకు పట్టు సాధించారనేది మదింపు చేసుకుంటూ చివరలో గ్రాండ్‌ టెస్ట్‌ నిర్వహించారు. ఈ టెస్టులో బెండపూడి విద్యార్థులు 60–84 శాతం మార్కులు సాధించి రాష్ట్రంలో బి కేటగిరీలో ఫోర్‌ స్టార్‌ రేటింగ్‌ను సొంతం చేసుకున్నారు. 

ఆమెరికన్‌ విద్యార్థులతో ఆన్‌లైన్‌ డిబేట్లు  
► ఆంగ్ల భాషపై బాగా ఆసక్తి ఉన్న విద్యార్థులను ఎంపిక చేసుకుని, వారు అమెరికన్‌ ఫొనెటిక్‌ (ఉచ్ఛారణ) సౌండ్స్‌పై దృష్టి సారించేలా చూశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ‘నేటివ్‌ స్పీకర్స్‌ క్లబ్‌’ను ఏర్పాటు చేశారు. ఇందుకు పెనుగొండ లోవరాజు చారిటబుల్‌ ట్రస్ట్, పెనుగొండ చిట్టబ్బాయి చారిటబుల్‌ ట్రస్ట్‌ల తోడ్పాటు తీసుకున్నారు.  
► అమెరికా సంయుక్త రాష్ట్రాలైన అట్లాంటా, జార్జియాల్లోని వివిధ పాఠశాల విద్యార్థులు, వారి స్నేహితులతో ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు ఆన్‌లైన్‌లో బెండపూడి విద్యార్థులు పలు అంశాలపై డిబేట్లు నిర్వహిస్తున్నారు. 
► ఈ పాఠశాలలో ప్రస్తుతం 50 శాతం మంది విద్యార్ధులు అమెరికన్‌ స్లాంగ్‌లో అద్భుతంగా మాట్లాడుతున్నారు. తమ పిల్లలు అనర్గళంగా మాట్లాడుతుండటం చూసి తల్లిదండ్రులు మురిసి పోతున్నారు. ఉపాధ్యాయులు జీవీ ప్రసాద్, సీహెచ్‌వీ సుబ్బారావు, ఎం.శ్రీదేవి సమన్వయంతో పని చేయడం వల్ల ఈ విజయం తమ పాఠశాల సొంతమైందని ప్రధానోపాధ్యాయుడు జి.రామకృష్ణారావు సంతోషం వ్యక్తం చేశారు. 

ఇప్పుడు మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది 
మా స్కూల్లో ఇంగ్లిష్‌ భాష నేర్చుకోవడంపై ప్రత్యేకంగా ఎల్‌ఐపీ ప్రోగ్రాం నిర్వహించారు. కొత్త ఇంగ్లిష్‌ పదాలు నేర్చుకోవడం దినచర్యగా మారింది. దీంతో వాడుక భాషలో ఇంగ్లిష్‌ పదాలపై పట్టు సాధించా. మా ఇంగ్లిష్‌ టీచర్‌ జీవీ ప్రసాద్‌ సహకారంతో ఆన్‌లైన్లో అమెరికాలోని విద్యార్థులతో డిబేట్‌లో పాల్గొంటున్నాము. ఇప్పుడు ఏ స్థాయిలో వారితోనైనా ఇంగ్లిష్‌లో చక్కగా మాట్లాడగలుగుతాననే ఆత్మవిశ్వాసం పెరిగింది. 
    – ఆర్‌.తేజస్విని, ఎనిమిదో తరగతి, జెడ్పీ హైస్కూల్, బెండపూడి 

ప్రతి రోజు ఇంగ్లిష్‌పై ప్రత్యేక శ్రద్ధ 
మా పాఠశాలలో తెలుగు, ఇంగ్లిష్, హిందీ పదాలు రోజుకు ఐదు చొప్పున ప్రతి రోజూ ఉదయం అసెంబ్లీలో టీచర్లు చెప్పించారు. తరగతి గదిలో వాటిని మరోసారి మాతో ప్రాక్టీస్‌ చేయిస్తున్నారు. లాంగ్వేజ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రాం మాకు బాగా ఉపకరించింది. తొలుత స్నేహితులతో  ఇంగ్లిష్‌లో మాట్లాడటం అలవాటు చేసుకున్నాం. ఇప్పుడు ఎవరితోనైనా చక్కగా మాట్లాడుతున్నాం.        
– కె.రీష్మ, పి.అనూష, పదవ తరగతి, జెడ్పీ హైస్కూల్, బెండపూడి

విజన్‌ ఉన్న ప్రభుత్వం 
ప్రభుత్వం పాఠశాలల బాగు కోసం ఎంతో చేస్తోంది. పిల్లలకు మంచి భవిష్యత్‌ కోసం ముందు చూపుతో వ్యవహరిస్తోంది. మౌలిక సదుపాయాలు అన్నీ కల్పించింది. ఆంగ్ల భాష అభ్యసించడం ద్వారా విద్యార్థులకు బంగారు భవిష్యత్‌ లభిస్తుంది. అందుకే ప్రత్యేక శ్రద్ధ పెట్టి అమెరికన్‌ స్లాంగ్‌ను మా విద్యార్థులకు నేర్పించాం. తొలుత ఎంపిక చేసిన విద్యార్థులతో ‘నేటివ్‌ స్పీకర్స్‌ క్లబ్‌’ ఏర్పాటు చేసి ఈ ప్రగతి సాధించాం. 
    – జీవీ ప్రసాద్, ఇంగ్లిష్‌ అధ్యాపకుడు, బెండపూడి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement