సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్‌లో ఈసారి ఎన్విరాన్‌మెంటల్, హ్యూమన్ వ్యాల్యూస్ అండ్ ఎథిక్స్ పరీక్షలు ఉండవు. అసైన్‌మెంట్ల ద్వారా ప్రక్రియ పూర్తి చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు చర్యలు చేపట్టింది. ఆయా సబ్జెక్టులకు సంబంధించి విద్యార్థులకు అసైన్‌మెంట్లు ఇచ్చి ఇంటి వద్ద వాటికి సమాధానాలు రాసి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇంటర్ బోర్డు రూపొందించిన అకడమిక్ కేలండర్‌లో ఈ మేరకు ప్రతిపాదించింది. ఇక మిగతా వాటికి ప్రతి సబ్జెక్టులో 70 శాతం సిలబస్‌తో, 100 మార్కులకు పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టింది. ఇక ప్రాక్టికల్స్ ఉండే బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో.. థియరీ పరీక్షలకు 70, ప్రాక్టికల్స్‌కు 30 మార్కులు ఉండేలా ప్రతిపాదించింది.
అదే విధంగా... ఈసారి ప్రాక్టికల్స్ పరీక్ష కేంద్రాలను పెంచుతోంది. మరోవైపు ప్రాక్టికల్స్‌కు ప్రశ్నపత్రాలను బోర్డు నుంచి పంపించకుండా, కాలేజీల్లో ప్రిన్సిపాళ్లు రూపొందించి పరీక్షలు నిర్వహించి మార్కులను బోర్డుకు పంపించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు రూపొందించిన అకడమిక్ కేలండర్‌పై ఈనెల 27వ తేదీన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో తుది నిర్ణయం
తీసుకోనున్నారు.
మూడు రకాలుగా తరగతులు
ఇంటర్మీడియట్‌లో ప్రత్యక్ష విద్యా బోధనను ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభించేందుకు బోర్డు చర్యలు చేపడుతోంది. ఇందుకోసం కాలేజీల వారీగా విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రణాళికలను రూపొందించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. ప్రస్తుతం ఒక్కో కాలేజీలో ఒక్కో రకంగా విద్యార్థుల సంఖ్య ఉంది. 404 ప్రభుత్వ కాలేజీలను చూస్తే వేయికి పైగా విద్యార్థులు కలిగిన కాలేజీలు 12 ఉన్నాయి. అందులో కొన్నింటిలో 2 వేల మంది వరకు విద్యార్థులు ఉన్నారు. ప్రైవేటు కాలేజీలు 1,600 వరకు ఉండగా, అందులో ఎక్కువ కాలేజీల్లో 500 మందికి పైగానే విద్యార్థులు ఉన్నారు. ఈ నేపథ్యంలో 1,000 మందికి పైగా విద్యార్థులు ఉన్న కాలేజీల్లో షిఫ్ట్ విధానంలో బోధన చేపట్టనున్నారు. బాగా తక్కువ విద్యార్థులు ఉన్న కాలేజీల్లో మామూలుగానే ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు తరగతులుంటాయి. అంతకంటే ఎక్కువ, వేయిలోపు విద్యార్థులున్న కాలేజీల్లో మాత్రం ఒక రోజు ఫస్టియర్, మరొక రోజు సెకండియర్ విద్యార్థులకు విద్యా బోధన చేపట్టే అవకాశం ఉంది.
పరీక్షల షెడ్యూల్‌లో మార్పులుంటాయా?
ఈసారి ఇంటర్ పరీక్షలను మే 3వ తేదీ నుంచి ప్రారంభించేలా బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ప్రధాన పరీక్షలు మే 19వ తేదీతో ముగిసేలా, పరీక్షలన్నీ మే 24వ తేదీవరకు ముగిసేలా ప్రతిపా దించింది. అయితే ఇప్పటికే టెన్త్ పరీక్షలను మే 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు నిర్వహించేలా విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇంటర్ పరీక్షలను మరో రెండు మూడ్రోజులు ప్రీపోన్ చేసే అవకాశముంది. లేదం టే టెన్త్ పరీక్షల షెడ్యూల్ మార్పు చేయాల్సి వస్తుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఇంటర్ విద్యార్థుల ప్రధాన పరీక్షలు మే 19వ తేదీతో ముగుస్తాయి కనుక టెన్త్ పరీక్షలు మే 20వ తేదీ నుంచి ప్రారంభిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. దీనిపై 27వ తేదీన విద్యాశాఖ మంత్రి అధ్యక్షతన జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment