మెహిదీపట్నంలోని ఓ కేంద్రంలో పరీక్షకు హాజరైన విద్యార్థులు..మరో సెంటర్‌లో నెంబర్ చూసుకుంటున్న విద్యార్థిని
సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారం నగరవ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు తెలుగు, సంస్కృతం, ఉర్దూ, హిందీ, అరబిక్ పేపర్–1 పరీక్షలు జరిగాయి. ఒక్క నిమిషం అలస్యమైన పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమన్న నిబంధన కారణంగా విద్యార్థులు ఉరుకులు పరుగులు తీసి సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. కొన్ని కళాశాల విద్యార్థులకు దూరప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించడంతో ఇబ్బందులకు గురయ్యారు.
మొదటి రోజు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి మొత్తం 4593 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. పరీక్షల నేపథ్యంలో అక్రమాలు చోటు చేసుకోకుండా పరీక్ష కేంద్రాలకు సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసివేశారు. హాల్ టికెట్లు నెట్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న వాటినీ అనుమతించారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 78,010 మంది విద్యార్థులకు గాను 75,418 మంది పరీక్షలకు హాజరయ్యారు. మిగిలిన 2592 మంది గైర్హాజరయ్యారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా పరిధిలో మొత్తం 60,117 మంది విద్యార్థులకు గాను 58,116 మంది హాజరయ్యారు. 2001 మంది గైర్హాజరయ్యారు. మొదటి రోజు ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ప్రాంతీయ ఇంటర్మీడియట్ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment