యశ్వంత్, జాహ్నవి, వరుణ్
సాక్షి, వరంగల్/నెట్‌వర్క్: ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ఫలితాలు విద్యార్థుల్లో కలకలం రేపుతున్నాయి. దాదాపు 50 శాతం మంది ఫెయిలవడంతో కలవరపడుతున్నారు. ఫెయిల్ అయినందుకు ఇంట్లో ఏమంటారో.. ఊళ్లో చులకనగా చూస్తారేమో.. ఇలా ఎన్నో ఆలోచనలు విద్యార్థుల మెదళ్లను తొలిచేస్తున్నాయి.
దీంతో మనస్తాపానికి లోనై ఉసురు తీసుకోవాలని తలపోస్తున్నారు. శుక్రవారం వివిధ ప్రాం తాల్లో ముగ్గురు విద్యార్థులు బలవన్మరణం పొంద గా, పలుచోట్ల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పరీక్ష తప్పిన విద్యార్థులు కలవరపడకుండా.. రాబోయే పరీక్షలకు సిద్ధం కావాలని నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులు విద్యార్థులకు మనోధైర్యం కల్పించాలని సూచిస్తున్నారు.
చురుకైన విద్యార్థి తప్పాడు
నిజామాబాద్ అర్బన్: నగరంలోని అర్సపల్లిలో ఇంటర్ విద్యార్థి యశ్వంత్ (17) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఎంపీసీ సెకండియర్ చదువుతున్నాడు. మొదటి సంవత్సరం పరీక్షల్లో మూడు సబ్జెక్టులు తప్పాడు. దీంతో మనస్తాపానికి గురైన యశ్వంత్ రాత్రి 8.30 సమయంలో ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఎప్పటిలాగే యశ్వంత్ టీవీ చూడ టంగానీ, సెల్‌ఫోన్‌తో కాలక్షేపం గానీ చేస్తుంటాడని అతడి తల్లి భావించింది.
కొద్దిసేపటి తర్వాత ఆమె తలుపు తీసేందుకు వెళ్లగా గడియవేసి ఉంది. పిలిచినా స్పందన రాలేదు. అనుమానం వచ్చిన ఆమె పొరుగువారితో కలిసి తలుపులు బద్దలు కొట్టగా యశ్వంత్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. అయితే యశ్వంత్ చదువులో చురుకైన విద్యార్థి అని, పదో తరగతిలోనూ 9.0 గ్రేడ్ మార్కులు వచ్చాయని కుటుంబ సభ్యులు తెలిపారు. యశ్వంత్ మరణంపై పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వరంలో నిజామాబాద్‌లో ఆందోళన నిర్వహించారు.
రైలుకు ఎదురుగా వెళ్లి..
నల్లగొండ క్రైం: నల్లగొండ పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన వాలుగొండ హరికృష్ణ కూతురు జాహ్నవి (16) ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. మ్యాథ్స్ పరీక్షలో ఫెయిల్ అయింది. అందులో 75 మార్కులకుగాను 13 మార్కులు వచ్చాయి. వేల రూపాయలు ఫీజులు కట్టి చదివిస్తే ఇలా ఫెయిల్ అయితే ఎలా? అని తండ్రి మందలించారు.
గురువారం రాత్రంతా జాహ్నవి బాధపడడం గమనించిన కుటుంబ సభ్యులు.. ఇకనైనా బాగా చదువుకో అని ధైర్యం చెప్పారు. శుక్రవారం ఉదయం 5 గంటలకు జాహ్నవి ఇంట్లో నుంచి రైల్వే స్టేషన్ వద్దకు వెళ్లింది. రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. రైల్వే ఎస్సై కోటేశ్వర్‌రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. జాహ్నవి మ్యాథ్స్ మినహా మిగిలిన సబ్జెక్టుల్లో 56 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించింది.
భూపాలపల్లి జిల్లాలో...
చిట్యాల: భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో కొల్లూరి వరుణ్ (19) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చల్లగరిగ గ్రామానికి చెందిన బాబు–పూలమ్మ దంపతుల కుమారుడు వరుణ్ హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సీఈసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఫస్టియర్ ఫలితాల్లో ఫెయిలవడంతో మనస్తాపానికి గుర య్యాడు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఫిజిక్స్‌లో ఫెయిలయ్యానని..
కమలాపూర్: ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యాననే బాధతో ఓ విద్యార్థిని హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. దామెర మండలం పసరగొండకు చెందిన దామెర లత (17) కమలాపూర్‌లోని తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్లో ఉంటూ బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఫస్టియర్‌లో ఫిజిక్స్‌లో లతకు 14 మార్కులు వచ్చాయి. దీంతో ఆమె శుక్రవారం మధ్యాహ్నం హాస్టల్ భవనం పైకెక్కి కిందకు దూకింది.
తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక పీహెచ్‌సీకి, అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించామని ప్రిన్సిపాల్ డాక్టర్ జి.అనిత తెలిపారు. లతకు ప్రాణాపాయం లేదని, ప్రస్తుతం క్షేమంగా ఉందని వైద్యులు చెప్పారన్నారు. లత హాస్టల్ భవనం పైకెక్కి కిందికి దూకేందుకు సిద్ధమైన తరుణంలో లహరి, సోమేశ్వరి అనే విద్యార్థినులు చూసి దూకొద్దని హెచ్చరించారు. అయినా వినకుండా లత కిందికి దూకగా ఆ విద్యార్థినులు తమ రెండు చేతులను అడ్డుపెట్టి ఆమెను ఒడిసిపట్టేందుకు యత్నించారు. అయినా లత తమ చేతుల్లో నుంచి కిందకు పడిపోయిందని వారు చెప్పారు.
కుషాయిగూడలో అదృశ్యం
కుషాయిగూడ: ఇంటర్ తప్పడంతో ఓ విద్యార్థి కనిపించకుండా పోయిన ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ప్రకాశం జిల్లా ఇంకోలుకు చెందిన ఆరే తరుణ్ (17)కుషాయిగూడలోని బంధువుల ఇంట్లో ఉంటూ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. పరీక్షల్లో ఫెయిలవడంతో గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు.
పరీక్షలనూ జయించొచ్చు
ఆన్‌లైన్ చదువుల వల్ల ప్రతి విద్యార్థి చేతికి సెల్‌ఫోన్ వచ్చింది. ఈ క్రమంలో సోషల్ మీడియాకు బాగా అలవాటుపడ్డారు. అయితే రెగ్యులర్‌గా కళాశాలలు లేకపోవడంతో ఒక్కసారిగా గతంలో ఉన్న పాత వాతావరణానికి అలవాటుపడేందుకు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇదే సమయంలో పరీక్షలు నిర్వహించడంతో అనుకున్నమేర ప్రదర్శన చేయలేకపోయారు. అయితే కరోనా తెచ్చిన ఈ విభిన్న వాతావరణం నుంచి బయటపడేందుకు ప్రణాళిక రూపొందించుకుని కసరత్తు చేయాలి. పరీక్షలు జయించడమనేది పెద్ద లెక్క కాదు.
–అనూష వినయత, రైజ్‌అప్ ఫౌండేషన్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్
ప్రిపరేషన్ సమయం ఇవ్వలేదు
కోవిడ్ నేపథ్యంలో ఇంటర్ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాస్‌లు అంతంత మాత్రమే జరిగాయి. స్మార్ట్‌ఫోన్లు లేని వారికి అసలే అందలేదు. టెన్త్ నుంచి ఇంటర్‌లో అడుగిడాక ప్రత్యక్ష బోధనే జరగలేదు. వారికి ఇంటర్ సబ్జెక్టులపై ప్రాథమిక అవగాహన రాలేదు. కోవిడ్‌తో పరీక్షలు నిర్వహించకుండా సెకండియర్‌కు ప్రమోట్ చేశారు. దీంతో పరీక్షలు ఉండవనే భావన విద్యార్థుల్లో ఏర్పడింది. హడావుడిగా ఫస్టియర్ పరీక్షలు నిర్వహించారు. సిలబస్ తగ్గించినా ప్రిపరేషన్‌కు సయయం ఇవ్వలేదు.
–బాబురావు, రిటైర్డ్ లెక్చరర్, హనుమకొండ ప్రభుత్వ కళాశాల
Comments
Please login to add a commentAdd a comment