ఇంటర్ విద్యార్థులు (ఫైల్)
తూర్పుగోదావరి, రాయవరం (మండపేట): 2018 –19 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియేట్ పరీక్ష ఫీజు గడువు సమీపిస్తోంది. మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండడంతో విద్యార్థులు అప్రమత్తమవ్వాలని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు ఆదేశిస్తున్నారు. ఇంటర్మీడియేట్ కోర్సుకు పరీక్ష ఫీజును చెల్లించాలంటూ ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
మరో నాలుగు రోజులే..
ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ చదువుతున్న విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు మరో నాలుగు రోజులే మిగిలి ఉన్నాయి. ఈ నెల 5వ తేదీ ఫీజు కట్టేందుకు తుది గడువుగా నిర్ణయిస్తూ అధికారులు నిర్ణయిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆర్‌ఐవో కార్యాలయానికి, కళాశాలలకు ఉత్తర్వులు జారీ చేశారు. నిర్ణీత గడువు దాటిన తర్వాత జాప్యమయ్యే కొద్దీ అపరాధ రుసుం మోత మోగనుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎంత వీలైతే అంత త్వరగా పరీక్ష ఫీజును చెల్లిస్తే మంచిదన్న అభిప్రాయం జూనియర్ కళాశాలల వర్గాల్లో వ్యక్తం అవుతోంది. 2019 జనవరి 22 వరకు ఆఖరి గడువు ఉన్నా అపరాధ రుసుం మాత్రం రూ.5 వేలు కట్టాల్సి ఉంటుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ముందస్తుగానే ఫీజు చెల్లించి ఉత్కంఠకు లోను కాకుండా సాఫీగా పరీక్షలకు సన్నద్ధం కావాలని నిపుణులు సూచిస్తున్నారు.
జిల్లాలో పరిస్థితి
జిల్లాలో మొత్తం 312 జూనియర్ కళాశాలలున్నాయి. ఇందులో ఆదర్శ కళాశాలలు నాలుగు, సాంఘిక, ట్రైబల్, ఏపీ రెసిడెన్షియల్ కళాశాలలు 25, ఎయిడెడ్ 16, ప్రభుత్వ కళాశాలలు 43 ఉండగా, వివిధ ప్రభుత్వ యాజమాన్యాల్లో 49 కళాశాలలున్నాయి. ప్రైవేటు కళాశాలలు 179 ఉన్నాయి. వీటిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 54,031 మంది, ద్వితియ సంవత్సరం 50,765 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. రానున్న మార్చిలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు (ఐపీఈ) రాయాలంటే దరఖాస్తుతో పాటు పరీక్ష ఫీజును తప్పని
సరిగా చెల్లించాలి.
అపరాధ రుసుం ఇలా..
ఒకవేళ విద్యార్థులు నిర్ణీత గడువు నవంబరు 5వ తేదీ లోపు చెల్లించకుంటే, ఈ నెల 14 వరకూ రూ.120 అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. నవంబర్ 26 వరకు రూ.500, డిసెంబర్ ఆరు వరకూ రూ.1000, డిసెంబరు 20 వరకు రూ.2 వేలు, డిసెంబరు 31 నాటికి రూ.3 వేలు అపరాధ రుసుం చెల్లించాలి. 2019 జనవరి 22 నాటికి ఆఖరి అవకాశంగా రూ.5 వేల గరిష్ట ఫైన్‌తో పరీక్ష ఫీజును ఆయా యాజమాన్యాలు తీసుకోవచ్చు.
గడువులోపు చెల్లించాలి
పరీక్ష ఫీజును గడువులోగా చెల్లించాలని ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు ఆదేశాలు ఇచ్చాం. పరీక్ష ఫీజు సకాలంలో చెల్లించే విధంగా విద్యార్థులను చైతన్యం చేయాలని సూచించాం. కేవలం పరీక్ష ఫీజు మాత్రమే వసూలు చేయాలి.– టేకి వెంకటేశ్వరరావు, ఆర్‌ఐవో,ఇంటర్‌బోర్డు, రాజమహేంద్రవరం
ఫీజుల వివరాలు
ఫస్టియర్ పరీక్ష దరఖాస్తు ఫీజు రూ.10, సాధారణ కోర్సులకు రూ.480, ఒకేషనల్ కోర్సులకు రూ.660, బ్రిడ్జి కోర్సులకు రూ.125, బ్రిడ్జి కోర్సుల్లో బైపీసీ తీసుకుని గణితం ప్రాక్టికల్స్ ఉన్న వారికి రూ.125 చొప్పున ఫీజు చెల్లించాలి. సెకండియర్ విద్యార్థుల దరఖాస్తు ఫీజు రూ.10, ప్రాక్టికల్స్ ఫీజుతో కలుపుకొని సాధారణ కోర్సులకు రూ.660, ఫస్టియర్‌లో పేపర్లు రాసేందుకు రూ.480, మొదటి, రెండు సంవత్సరాలత్లో సబ్జెక్టులున్న వారికి ప్రాక్టికల్స్‌తో కలిపి రూ.1140, సెకండియర్ ఒకేషనల్ విద్యార్థులకు రూ.660 వంతున ఫీజుగా ఇంటర్‌బోర్డు నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment