అతనో మారుమూల పల్లె వాసి..బతుకుతెరువు కోసం పొట్ట చేతబట్టుకునిముంబైకి వలస వెళ్లాడు. కూలీగా మొదలుపెట్టి కాంట్రాక్టు పనులు చేసే స్థాయికి ఎదిగాడు. సుమారు 35 ఏళ్లుగా అక్కడే జీవిస్తున్న ఆయన.. సొంత గ్రామానికి క్రమం తప్పకుండా రాకపోకలు కొనసాగిస్తున్నాడు. తనకు పుట్టిన కుమారుడు అక్కడే పెరిగి పెద్దయినామానుకోలేదు. తండ్రి పేరును నిలబెట్టాలనే ఉద్దేశంతో సొంతూరులో ఏదైనా వ్యాపారం పెట్టాలని సంకల్పించాడు. వినూత్న ఆలోచనతో అమెరికా, దక్షిణ ఆఫ్రికా మేకల పెంపకానికి శ్రీకారం చుట్టాడు. మూడేళ్లలో చీజ్ ఉత్పత్తి లక్ష్య సాధన దిశగా ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇది..మహబూబ్‌నగర్ జిల్లా గండేడ్ మండలం సాలార్‌నగర్ గ్రామానికి చెందిన జగదీశ్ ఖలాల్ సక్సెస్ స్టోరీ.
30 నుంచి 300కు పైగా..
మేకలు పెంచాలన్న ఆలోచన రాగానే సాలార్‌నగర్‌లో తనకున్న ఏడు ఎకరాల వ్యవసాయ భూమిలో ఖలాల్ మొదట మామిడి, టేకు వంటి వివిధ రకాల మొక్కలు నాటాడు. ఆ తర్వాత మేకల ఉత్పత్తికి ప్రత్యేక షెడ్డు వేశాడు. అత్యధిక మాంసంతో పాటు పాలు ఇచ్చే అమెరికాకు చెందిన సానెన్, దక్షిణాఫ్రికాకు చెందిన బోయర్ జాతి మేకలను దిగుమతి చేసుకున్నాడు. 30 మేకలు, ఒక పొట్టేలుతో షెడ్డు ప్రారంభించాడు. మూడేళ్లలోనే జీవాల సంఖ్య 300కు పైగా పెరిగింది.
పాలు అధికంగా ఇచ్చే సానెన్ రకానికి చెందిన మేక ఒక ఈతలో రెండు నుంచి మూడు పిల్లలకు జన్మనిస్తుంది. పిల్ల మేక మూడు నెలల్లోనే 30 కేజీల వరకు బరువు పెరుగుతుంది. ఒక్కో మేక మూడు నుంచి నాలుగు లీటర్ల పాలు ఇస్తుంది. అత్యధికంగా మాంసాన్ని ఇచ్చే బోయర్ రకానికి చెందిన మేక కొంచెం పొట్టిగా ఉండి వెడల్పుగా పెరుగుతుంది. ఇది 14 నెలల్లో రెండు ఈతల్లో రెండు చొప్పున నాలుగు పిల్లలకు జన్మనిస్తుంది. ఒక్కో మేక రోజుకు రెండు లీటర్ల వరకు పాలు ఇస్తుంది.
ప్రత్యేక షెడ్.. దాణా..
మేకల కోసం ప్రత్యేకంగా షెడ్ ఏర్పాటు చేశారు. మేకలకు ఏ విధమైన హానీ జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నేలపై పెంచకుండా మూడు, నాలుగడుగుల ఎత్తులో రంధ్రాలతో కూడిన ఫ్లోర్‌ను ఏర్పాటు చేశారు. రోగాలు సోకకుండా అత్యంత శుభ్రమైన వాతావరణం ఉండేలా చూస్తున్నారు. హైదరాబాద్ నుంచి వెటర్నరీ వైద్యుల బృందం క్రమం తప్పకుండా వాటిని పర్యవేక్షిస్తోంది. దాణా కోసం మొక్కజొన్న పచ్చి మేతను టన్నుల లెక్కన బిహార్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.
ప్రతిరోజూ ఉదయం అన్ని రకాల పోషçకాలతో కూడిన దాణాను ఆహారంగా ఇస్తున్నారు. శుభ్రమైన నీటిని అందిస్తున్నారు. మధ్యాహ్నం సొంతంగా తయారుచేసిన జొన్న, మొక్కజొన్న కుడితి లాంటిది ఇస్తున్నారు. ఇలా రోజుకు మూడు పూటలు.. ఒక్కో మేకకు మొత్తంగా నాలుగు నుంచి ఆరు కిలోల దాణాను అందిస్తున్నారు. ఒక్క ఆవు పోషకంతో ఇలాంటి 10 మేకలను పెంచుకోవచ్చని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు.
సానెన్ మేక పాలతో నాణ్యమైన చీజ్..
ఈ మేకల పాలకు అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువగా ఉంది. వీటి పాలను చీజ్ తయారు చేసేందుకు, ఔషధాల్లో వినియోగిస్తున్నారు. ప్రధానంగా సానెన్ రకానికి చెందిన మేకల పాలతో అత్యంత నాణ్యమైన చీజ్ తయారుచేసే అవకాశం ఉండడంతో ఇటీవలి కాలంలో ఈ జాతి పెంపకంపై దృష్టి పెరిగినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఒక్కో మేక రెండు లీటర్ల చొప్పున పాలు ఇస్తున్నాయి. ఈ పాలను హైదరాబాద్‌కు తరలిస్తే లీటర్‌కు రూ.200 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. కానీ ప్రస్తుతం పాలు పెద్ద మొత్తంలో లేకపోవడంతో స్థానిక పాలకేంద్రాల్లో లీటర్‌కు రూ.100 చొప్పున విక్రయిస్తున్నట్లు షెడ్డు కాపలాదారు ఆంజనేయులు చెప్పాడు.
బోయర్ విత్తన మేకపోతు రూ.3 లక్షలు
బోయర్ జాతి మేక సుమారు 70 కిలోల నుంచి క్వింటా వరకు మాంసాన్ని ఇస్తుంది. అదే మేకపోతు అయితే 1.5 క్వింటా వరకు మాంసం ఇస్తుందని అంచనా. బోయర్ విత్తన మేకపోతు ధర రూ.3 లక్షల వరకు ఉన్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
వెయ్యి లీటర్ల పాల ఉత్పత్తే లక్ష్యంగా..
మొత్తం వెయ్యి లీటర్ల పాలు ఉత్పత్తి చేస్తే.. అక్కడే చీజ్ మేకింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఇజ్రాయెల్‌కు చెందిన కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఆ షెడ్డును కంపెనీయే తీసుకుని చీజ్ మేకింగ్ యూనిట్ నెలకొల్పేందుకు సిద్ధంగా ఉందని జగదీశ్ ఖలాల్ తెలిపాడు.
ఈ లెక్కన మేకల సంఖ్య కనీసం వెయ్యికి పెరగాల్సి ఉంటుందని, దీంతో వచ్చే మూడేళ్లలో వెయ్యి మేకల ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పాడు. వెయ్యి మేకలకు సరిపడా అన్ని రకాల ఏర్పాట్లతో షెడ్ నిర్మాణం చేస్తున్నామని, ఇలాంటిది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదని పేర్కొన్నాడు.
- సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment