ఇల్లు శుభ్రంగా ఉంటేనే ఊరూ శుభ్రంగా ఉంటుంది. ఈ సూత్రాన్నే ఆ గ్రామస్తులు పాటించారు. వారికి అధికారుల సాయం అందింది. ఊరూవాడా కదిలింది....ఆ పల్లె కళకళలాడింది. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం నిజాలాపూర్ గ్రామం ఈ అద్భుతానికి వేదికగా నిలిచింది.
వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా నిజాలాపూర్ గ్రామ మహిళలు.. ఇటీవల గంగదేవిపల్లి, హాజిపల్లి గ్రామాలను సందర్శించి వచ్చారు. తమ గ్రామం కూడా వాటిలాగే పేరు తెచ్చుకోవాలని అనుకున్నారు. అనుకోవడమే ఆలశ్యం... శ్రమదానంతో ఊరంతా శుభ్రం చేసుకోవడం, మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఉద్యమంగా చేపట్టారు.
గ్రామంలో బుధవారం 200 మంది మహిళలు శ్రమదానం చేశారు. వీధులు, రోడ్లను శుభ్రం చేశారు. వీరికి పురుషులు కూడా కలిశారు. ఎవరి ఇంటి ముందు రోడ్లను వారే నిత్యం శుభ్రం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. శ్రమదానానికి రాని వారికి జరిమానా వేశారు. ఇకమీదట ప్రతినెలా 14వ తేదీన ఊరంతా శ్రమదాన దినంగా పాటించాలని నిర్ణయించారు.
పరిశుభ్రతకు పెద్దపీట వేసిన ఈ గ్రామానికి ప్రభుత్వం కూడా చేయూత నిచ్చింది. మరుగుదొడ్లు మంజూరు చేసింది. దీంతో గ్రామంలో ఒకే సారి 170 మరుగుదొడ్ల నిర్మాణం మొదలైంది. వీటి నిర్మాణం కోసం మహిళా సంఘాలు సిమెంట్ ఇటుకలను గ్రామంలోనే తయారు చేస్తున్నారు.