Sramadanam
-
శ్రమో నమః
వందల కోట్ల చేతులు ప్రపంచమనే ఈ మహాయంత్రాన్ని పని చేయిస్తున్నాయి. పని అంటే కర్మ. కాలగతిలో కర్మ శబ్దం ఆ ప్రాథమికార్థపు నేల విడిచి విధిలిఖితమనే తాత్వికార్థపు గగనసీమను తాకింది. మనుగడకు అవసరమైన సాధారణ కర్మల స్థాయిని దాటి మతపరమైన తంతులతో సహా ఇతరేతర అర్థాలకు విస్తరించింది. కర్మలో శ్రమ ఉంటుంది, శ్రమలో కర్మ ఉంటుంది. రెండూ అన్యోన్యాశ్రితాలు. మళ్ళీ ప్రపంచాన్నే ఒక యాంత్రిక మహాశకటమనుకుంటే, దానిని ముందుకు నడిపించేది కోట్లాది జనాల శ్రమ ఇంధనమే. పుట్టిన ప్రతిజీవీ అంతో ఇంతో కర్మయోగే. అందరికీ వందనం. వేదం కర్మవాదమే. అందులో కర్మ గురించిన ఉగ్గడింపే ఆద్యంతం వ్యాపించి ఉంటుంది. వేదకాలపు కర్మభావనలో హెచ్చుతగ్గుల వింగడింపు లేదు; దేవతలు, మనుషులన్న తారతమ్యం లేదు. సూర్యచంద్రులు, ఉషస్సు, అగ్ని సహా అందరూ క్రమం తప్పకుండా తమ విధ్యుక్త కర్మలను నిర్వహించవలసిందే. ఇంద్రుడు కర్మ చేతనే గొప్పవాడయ్యాడంటుంది వేదం. అతని చేతి వేళ్ళు అనేక వేల కర్మలను చేస్తూ ఉంటాయి. ఆహార పచనం, దేవతలకు హవ్యాన్ని అందించడంతో సహా అగ్ని బహువిధ కర్మదక్షుడు. అగ్నిని అనేక విధాలుగా వినియోగంలోకి తెచ్చిన కార్మిక నిపుణులు అంగిరసులు. సర్వకర్మకుశలురైన పుత్రపౌత్రులు కావాలని వేదజనం కోరుకుంటారు. కర్మనిరతిని ప్రకృతితో ముడిపెట్టి వేదం అందంగా చెబుతుంది. ‘‘మనుషుల్లారా! నిద్రలేవండి, చీకట్లు తొలిగాయి, మన దేహాలకు ప్రాణం వచ్చింది, ఉష ఉదయించి సూర్యుని రాకను ప్రకటించింది, అన్నం సమృద్ధిగా దొరికే చోటుకి వెడదాం పదండి’’ అని ఒక ఋక్కు చెబుతుంది. ఉష ఉదయించి మీ మీ వృత్తి వ్యాపారాల వైపు మిమ్మల్ని జాగృతం చేస్తోందని మరో ఋక్కు అంటుంది. ‘‘జాలరి పగ్గం, సాలెల మగ్గం, శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి, సహస్ర వృత్తుల సమస్త చిహ్నా’’ల స్మరణ ఆధునిక మహాకావ్యంలోనే కాదు; కవిత్వానికే ఆదిమమైన వేదంలోనూ కనిపిస్తుంది. త్వష్ట నిపుణుడైన లోహకార్మికుడు... స్వర్ణమయమై, వేయి అంచులు కలిగిన వజ్రాయుధాన్ని నిర్మించి ఇంద్రునికి ఇచ్చాడు. దేవతలతో సమానమైన గౌరవాన్ని పొందాడు. ఋభులనే అన్నదమ్ములు మానవులైనా లోహవిద్యలో త్వష్టను మించిన ప్రావీణ్యం చూపి దేవతలయ్యారు. మరుత్తులనే దేవతలు ప్రవాహానికి అడ్డుపడిన ఓ పర్వతాన్ని బద్దలుకొట్టి నీటికి దారి చేశారు. అశ్వినులు మనువుకి విత్తనాలిచ్చి వ్యవసాయం చేయించారు; వైద్యం చేసి ఎంతోమందికి ఆరోగ్యాన్ని, ఆయుష్షును ఇచ్చారు. క్షురకుడు కేశఖండన చేసినట్లుగా ఉష చీకట్లను ఉత్తరిస్తోందని ఒక ఋక్కు అంటుంది. శ్రమ ఉచ్చమా, న్యూనమా అని చూడకుండా; శ్రామికుల మధ్య హెచ్చుతగ్గుల తేడా తేకుండా శ్రమను మాత్రమే గౌరవించిన దశ అది. ఇంద్రాదులు సమాజానికి ఏదో ఒక మేలు చేసే సేవకులు కనుకనే దేవతలయ్యారు. వేదకాలంలో అలాంటి సేవకులను పన్నెండుగురిని గుర్తించి పన్నిద్దరు ఆయగార్లు అన్నారు. శారీరక శ్రమను తక్కువ చేసి మేధోశ్రమను ఆకాశానికి ఎత్తడం ఆనాటికి లేదు. తిథివారనక్షత్రాలు చూసే వ్యక్తి కన్నా మృతపశువుల చర్మాన్ని ఒలిచే చర్మకారునికి ఎక్కువ ప్రతిఫలం ముట్టిన కాలం అది. కర్మ, కర్మఫలం రెండూ ఆనాడు సాముదాయికమే. చెరువుల వంటి నిర్మాణాలలో రాజు, రాజుగారి భార్యా కూడా మట్టితట్టలు మోసిన ఉదాహరణలు పురాచరిత్రలో కనిపిస్తాయి. అది పోయి చాకిరొకరిది, సౌఖ్యమొకరిదైన తర్వాతే పరిస్థితి తలకిందులైందని పండితులంటారు. అందరూ అన్నిరకాల పనులూ చేయడం పోయి వృత్తి విభజన రావడంతోనే వృత్తుల మధ్య, వ్యక్తుల మధ్య చిన్నా పెద్దా తారతమ్యాలూ పొటమరించాయి. ఇష్టపూర్వక కర్మ నిర్బంధకర్మగా మారి దుఃఖదాయిని అయింది. అప్పుడు కూడా వృత్తి నైపుణ్యంలో ఆనందాన్ని, తృప్తిని అనుభవించే అవకాశం ఎంతోకొంత ఉండేది. వృత్తిదారులు పారిశ్రామిక యంత్రంలోని పరికరాలుగా మారిపోవడంతోనే అదీ పోయింది. ఈ మార్పును కొడవటిగంటి కుటుంబరావు ఒక కథలో అద్భుతంగా చిత్రీకరిస్తారు. ప్రకృతి సమవర్తి. శ్రుతిమించిన అసమానతలను ఆట్టే కాలం సహించదు, ఎప్పటికైనా కత్తెర వేసి సమతుల్యతను తెస్తుంది. అడుగంటిన శ్రమ విలువను, గౌరవాన్ని, తగిన ప్రతిఫలాన్ని ఉద్ధరించే ప్రయత్నం ఆధునిక కాలంలోనే మళ్ళీ ఊపందుకుంది. ‘శ్రమ నిష్ఫలమై, జన నిష్ఠురమై నూతిని గోతిని వెదికే కార్మిక వీరుల కన్నుల నిండా కణకణమండే విలాపాగ్నులకు, గలగల తొణికే విషాదాశ్రులకు ఖరీదు కట్టే షరాబులు’ ఉద్భవించారు. ఏ ఒకడి ఆస్తిహక్కైనా శ్రమపునాది మీదే ఆధారపడుతుందని జాన్ లాక్ అనే ఆర్థికవేత్త నొక్కిచెప్పి శ్రమకు తిరిగి పట్టం కట్టాడు. ఆడమ్ స్మిత్ అనే మరో ఆర్థికవేత్త విలువకు మూలం శ్రమేనన్నాడు. దాని ఆధారంగా డేవిడ్ రికార్డో అనే మరో ఆర్థికవేత్త శ్రమవిలువ సిద్ధాంతాన్ని ముందుకుతెచ్చాడు. కార్ల్ మార్క్స్ తాత్వికతకు అదే సారవంతమైన వనరు అయింది. శ్రమ విలువను తిరిగి గుర్తించడమే జరిగింది కానీ శ్రామికుని బతుకు బండి ఇంకా పూర్తిగా పట్టాలకెక్కలేదు. ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ అన్న కవి ఆకాంక్ష నెరవేరే రోజు ముందుకు జరుగుతూనే ఉంది. అయినా మనిషి నిత్య ఆశాజీవి కదా! -
అటవీశాఖ కార్యాలయంలో శ్రమదానం
సిరిసిల్ల క్రైం: జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో బుదవారం అధికారులు, సిబ్బంది శ్రమదానం చేశారు. కార్యాలయంలోని చెత్తను, పిచ్చి మొక్కలను తొలగించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుష్మారావు మాట్లాడుతూ స్వచ్ఛభారత్‌లో భాగంగా కార్యాలయ ఆవరణలో ఉన్న చెత్తను పనికి రాని వాటిని తొలగించామని తెలిపారు. కార్యాలయం ఎదుట అనధికారికంగా కొందరు టీస్టాల్స్తో పాటు పలు వ్యాపారాలు చేసి వాటి వల్ల వచ్చే వ్యర్థాలను వదిలివేయడంలో పరిసర ప్రాంతాలు పాడవుతున్నాయన్నారు. మురుగుకాల్వలో టీగ్లాస్లతోపాటు పలు వ్యర్థాలు ఉండి దుర్గంధంతో దోమల బెడద అధికమైందన్నారు. వీటిని తొలగించాలని మున్సిపల్ అధికారులకు తెలిపినా సిబ్బంది నిర్లక్ష్యం చేశారన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. అలాగే కార్యాలయంలో గార్డెనింగ్ చేయాలన్న కోణంలో పైఅధికారులు మౌఖిక ఆదేశాల మేరకు పనులు జరుగుతున్నాయని అన్నారు. -
గంగదేవి పల్లి స్పూర్తితో
ఇల్లు శుభ్రంగా ఉంటేనే ఊరూ శుభ్రంగా ఉంటుంది. ఈ సూత్రాన్నే ఆ గ్రామస్తులు పాటించారు. వారికి అధికారుల సాయం అందింది. ఊరూవాడా కదిలింది....ఆ పల్లె కళకళలాడింది. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం నిజాలాపూర్ గ్రామం ఈ అద్భుతానికి వేదికగా నిలిచింది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా నిజాలాపూర్ గ్రామ మహిళలు.. ఇటీవల గంగదేవిపల్లి, హాజిపల్లి గ్రామాలను సందర్శించి వచ్చారు. తమ గ్రామం కూడా వాటిలాగే పేరు తెచ్చుకోవాలని అనుకున్నారు. అనుకోవడమే ఆలశ్యం... శ్రమదానంతో ఊరంతా శుభ్రం చేసుకోవడం, మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఉద్యమంగా చేపట్టారు. గ్రామంలో బుధవారం 200 మంది మహిళలు శ్రమదానం చేశారు. వీధులు, రోడ్లను శుభ్రం చేశారు. వీరికి పురుషులు కూడా కలిశారు. ఎవరి ఇంటి ముందు రోడ్లను వారే నిత్యం శుభ్రం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. శ్రమదానానికి రాని వారికి జరిమానా వేశారు. ఇకమీదట ప్రతినెలా 14వ తేదీన ఊరంతా శ్రమదాన దినంగా పాటించాలని నిర్ణయించారు. పరిశుభ్రతకు పెద్దపీట వేసిన ఈ గ్రామానికి ప్రభుత్వం కూడా చేయూత నిచ్చింది. మరుగుదొడ్లు మంజూరు చేసింది. దీంతో గ్రామంలో ఒకే సారి 170 మరుగుదొడ్ల నిర్మాణం మొదలైంది. వీటి నిర్మాణం కోసం మహిళా సంఘాలు సిమెంట్ ఇటుకలను గ్రామంలోనే తయారు చేస్తున్నారు. -
2న మహా శ్రమదానం
ఎస్సీ రైల్వే జీఎం శ్రీవాస్తవ వెల్లడి సాక్షి,సిటీబ్యూరో: ప్రయాణికులకు అత్యుత్తమ సదుపాయాలు అందజేయడమే దక్షిణ మధ్య రైల్వే లక్ష్యమని జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ తెలిపారు. ఇరువై నాలుగు గంటల పాటు స్టేషన్లను పరిశుభ్రంగా ఉంచేందుకు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ తరహాలో అన్ని స్టేషన్లను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్టు పేర్కొన్నారు. ‘స్వచ్ఛభారత్ మిషన్’లో భాగంగా అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి రోజున దక్షిణమధ్య రైల్వే జోన్ అంతటా మహాశ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. సోమవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రైల్వే అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది,స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాలను కలుపుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జోన్ పరిధిలోని అన్ని రైల్వేస్టేషన్లు, ట్రాక్‌లు, అధికారుల నివాస స్థలాలు, కాలనీలు శుభ్రం చేస్తామన్నారు. పరిశుభ్రత విషయంలో ఉల్లంఘనలకు పాల్పడే ప్రయాణికుల పై రూ.500 చొప్పున జరిమానా విధిస్తామన్నారు. రైళ్లలో పరిశుభ్రత కోసం ప్రవేశపెట్టిన బయోటాయిలెట్ వ్యవస్థ ఎంతో ప్రయోజనకరంగా ఉందని, ఇప్పటి వరకు 383 బోగీలలో 1183 బయోటాయిలెట్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దసరా,దీపావళి సందర్భంగా ఈ ఏడాది 299 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని చెప్పారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల నుంచి విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి, కాకినాడ, మచిలీపట్నం, గౌహతి, గోండియా,తదితర ప్రాంతాలకు ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయన్నారు. రిజర్వేషన్లతో నిమిత్తం లేకుండా ప్రయాణికులు అప్పటికప్పుడు బయలుదేరి వెళ్లేందుకు ప్రవేశపెట్టిన జనసాధారణ్ రైళ్లకు అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. ప్రయాణికుల భద్రత కోసం, దొంగతనాలు, నేరాలను అరికట్టేందుకు అక్టోబర్ 2వ తేదీ నుంచి హెల్ప్‌లైన్ 1322 ను అందుబాటులోకి తేనున్నట్లు జీఎం శ్రీవాస్తవ చెప్పారు.