వనపర్తి: మహబూబ్ నగర్ జిల్లాలో అధికార టీఆర్‌ఎస్ పార్టీలో నేతల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆర్.లోక్‌నాథ్‌రెడ్డి మధ్య విభేదాలు మరో సారి బయటపడ్డాయి. సోమవారం జిల్లాకేంద్రంలోని జెడ్పీ సర్వసభ్య సమావేశం వేదికగా ఈ విభేదాలు బహిర్గతమయ్యాయి.
కాగా, కేంద్ర ప్రభుత్వం ఇటీవల రెండు విడతలుగా జిల్లాకు మంజూరు చేసిన 15వ ఆర్థిక సంఘం హెల్త్ సెక్టార్ గ్రాంట్స్ రూ.84 లక్షలు, రూ.2.10 కోట్ల నిధుల కేటాయించగా.. వాటిని వినియోగించే అంశంలో జెడ్పీ సమావేశంలో మంత్రి అధికారులు సూచనలు చేశారు. అయితే ‘మా ప్రమేయం లేకుండా పనుల గుర్తింపు, టెండర్ల ప్రక్రియ చేస్తే.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా మాకు జనం గౌరవం ఏముంటుంది. ఈ పాటిదానికి గ్రాంట్ జెడ్పీకి ఇవ్వటం దేనికి.. నేరుగా కలెక్టర్ ఖాతాలో జమ చేసి మీరే పనులు చేయిస్తే.. సరిపోతుంది కదా.’ అని జెడ్పీ చైర్మన్ ఆర్.లోక్‌నాథ్‌రెడ్డి నిలదీశారు.
దీంతో మంత్రి నిరంజన్ రెడ్డి స్పందిస్తూ ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిన బాధ్యత అందరిపై ఉంటుంది. ప్రభుత్వం నిధులతో పాటు ఇచ్చిన నిబంధనలను పాటించి నిధుల కేటాయింపులు, ఖర్చులు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇందుకు జెడ్పీ చైర్మన్ స్పందిస్తూ.. గ్రాంట్ విడుదలైన తర్వాత నాలుగుసార్లు నిధులను వెచ్చించే నిబంధనలను మార్చుతూ.. సర్క్యులర్ పంపించారు. ఎంత వరకు సమంజసం అంటూ.. అసహనం వ్యక్తం చేశారు.
అనంతరం, సమావేశంలో కూర్చోవాలా.. వెళ్లిపోనా.. అంటూ జెడ్పీ చైర్మన్‌పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ఆయన నిమ్మకుండిపోయారు. కలెక్టర్, అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈఓ, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆయాశాఖల జిల్లాఅధికారుల ఎదుట మంత్రి, జెడ్పీ చైర్మన్ విభేదించుకోవటం చూసి నివ్వెరపోయారు. కొద్దిసేపటికే.. మంత్రి సమావేశం నుంచి మరో కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉందంటూ.. వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment