దేశ స్వాతంత్య్రోద్యమంలో ఉన్నత పదవులే కాదు, ఉన్నదంతా ధారపోసిన మహానుభావులున్నారు. ఈ పోరాట స్ఫూర్తిలోంచే విలువలతో కూడిన రాజకీయం ఆవిర్భవించింది. ప్రజాసేవే లక్ష్యంగా...పైసాకి కూడా వెతుక్కునే గొప్ప నాయకులను భారతావని అందించింది. ఇవన్నీ చెబితే ఈ తరం నమ్ముతుందా? అవేవో పుక్కిట పురాణాలు అనుకుంటారు ప్రజలు. నేటితరం రాజకీయాలు వ్యవస్థను అలా తయారు చేశాయంటారు సీనియర్ నేత డీకే సమరసింహారెడ్డి.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల నుంచి తిరుగులేని నేతగా సుదీర్ఘకాలం గెలిచిన శాసనసభ్యుడాయన. హోం, రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్ సహా కీలక మంత్రి పదవుల్లో సమర్థత నిరూపించుకున్న వ్యక్తి ఆయన. అసెంబ్లీ సమావేశాల ఉన్నతిలో ఆయన పాత్ర స్పష్టంగా కన్పిస్తుంది. రాష్ట్ర ఎన్నికల వేళ ఆయనను కలిసినప్పుడు ఎన్నో విషయాలు నెమరువేసుకున్నారు. అందులోంచి కొన్ని ఆయన మాటల్లోనే...
రాజకీయాల్లో దూషణలు..అసభ్య పదజాలం.?
ఒకరిపై ఒకరు దూషణలు.. అసభ్య పద ప్రయోగం..అనుచిత వ్యాఖ్యలు... ఇవీ నేటి రాజకీయాల్లో కనిపించేవి..బాధేస్తుంది..జాలేస్తోంది. అరే.. విధానపరమైన విమర్శలు చేస్తే తప్పేంటి? దీన్ని నేతలు ఎందుకు స్వీకరించడం లేదు. ప్రతి విమర్శలు గాడి తప్పుతున్నాయి. సిద్ధాంతపరమైన విమర్శలే రాజకీయాల్లో ఉండాలి. కానీ వ్యక్తిగత విమర్శనావాదం వచ్చేసింది. ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదు. నేతలు ధన రాజకీయాల వైపే వెళ్తున్నారు. తేలికగా డబ్బు సంపాదిస్తున్నారు. దాన్ని ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారు.
సభా మర్యాద ముఖ్యం..
చట్టసభలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఎన్నికయ్యే ప్రతీ ఎమ్మెల్యే దాన్ని గుర్తించాలి. చట్టసభల విలువలు కాపాడే ప్రయత్నం చేయాలి. మేం అసెంబ్లీకి వెళ్తు న్నామంటే దృష్టంతా దానిపైనే ఉండేది. మంత్రిగా సమాధా నంచెప్పాల్సివస్తే..ముందే విద్యార్థిలా ప్రిపేర్ అయ్యేవారం, చాలామంది మంత్రులు అసెంబ్లీలో అధికారులపై ఆధారపడకుండానే సమాధానమిచ్చే వారు. తమ శాఖలపై అంత కమాండ్ ఉండేది.
అసెంబ్లీ నియమాలు..ఏ అంశాన్ని ఏ రూల్ కింద లేవనెత్తాలి... వాకౌట్ ఎప్పుడు చేయాలి? ఇవన్నీ పార్లమెంటరీ నిబంధనలు చదివినప్పుడే తెలుస్తాయి. దీనికోసం ఎన్నో పుస్తకాలు చదివేవారం. అసెంబ్లీలో చిన్నమాట తప్పుగా మాట్లాడినా పెద్ద వివాదమయ్యేది. మాట్లాడేప్పుడు అది గుర్తుండేది. కానీ ఇప్పుడేంటి? దారుణమైన భాష మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారో ప్రజలు లైవ్‌లో చూస్తున్నారు. ఎమ్మెల్యేలు ముందుగా నైతిక విలువలు నేర్చుకోవాలి.
ఎవరెటో చెప్పలేని స్థితి
ఓ నాయకుడు ఫలానా పార్టీ అని చెప్పడం కష్టంగా ఉంది. ఎప్పుడు మారతాడో తెలియదు. ఎందుకు మారతాడో అసలే తెలియదు. వ్యక్తిగత అవసరాల కోసం పార్టీలు మారుతున్నారని అందరికీ తెలుసు. పైకి మాత్రం ప్రజాభీష్టమంటారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమంటారు. రాజకీయాలు ఇంత దిగజారుతాయని ఎప్పుడూ ఊహించలేదు. ఇదో దురదృష్టకర పరిణామమే. నేతల్లో విలువలు పెరగాలి. ఎన్నికల్లో పార్టీలిచ్చే హామీలు వినసొంపుగా ఉంటున్నాయి. కానీ వాటి అమలే ప్రశ్నార్థ్థకంగా ఉంటు న్నాయి.
ఎవరు ఏమిచ్చినా..తిరిగి ఏదో రూపంలో ప్రజల నుంచే రాబడతారనేది అందరూ గుర్తించాలి. తెలంగాణ అభివృద్ధి చెందిందా అంటే... చెందిందనే చెబుతాను. కాకపోతే జరగాల్సిన అభివృద్ధి జరగలేదనేదే నా వాదన. గాడి తప్పిన వ్యవస్థను దారిలో పెట్టగలిగే సామర్థ్యం ప్రజలకే ఉంది. అది ప్రజాస్వామ్యం ప్రజలకిచ్చిన ఓటు హక్కు. ఇప్పటికైనా ప్రజలు రాజకీయ విలువలకు ప్రాధాన్యమిచ్చే నేతలనే గుర్తించి, చట్ట సభలకు పంపాలి.
బ్యూరోక్రాట్స్ సాగిల పడటమేంటి?
ప్రజాస్వామ్య పరిరక్షణలో ఐఏఎస్, ఐసీఎస్‌లది కీలక పాత్ర. వారు దీన్ని మరిచిపోయారేమో అన్పిస్తోంది. సుదీర్ఘ అనుభవంతో చెబుతున్నా. బ్యూరోక్రాట్స్ ఇంత సాగిలపడటం ఈ మధ్య కాలంలోనే చూస్తున్నాను. దశాబ్దకాలంగా ఇది మరింత దిగజారింది. బ్యూరోక్రాట్స్ సరిగ్గా పనిచేస్తే, రాజకీయ వ్యవస్థ ఇంత భ్రషు్టపడుతుందా? కట్టడి చేయగల సామర్థ్యం వాళ్లకు మాత్రమే ఉంది. నేతలు ఐదేళ్లే అధికారంలో ఉంటారు.
అధికారులు సుదీర్ఘ కాలం సర్విస్ చేస్తారు. ఇది తెలిసీ నాయకులకు ఎందుకు సాగిలపడుతున్నారు..? మా అప్పుడు ఇలా లేదు. మేం చెప్పేదాంట్లో తప్పుంటే అభ్యంతరం చెప్పేవారు. ఖర్మ కాకపోతే... ఓ ఐఏఎస్ అధికారి ఎమ్మెల్యే చెప్పినట్టు వినడమేంటి? అయితే ఈ మధ్య కాలంలో యువ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు నిక్కచ్చిగా ఉంటున్నారు. వాళ్లలో ఆశయం కన్పిస్తోంది. ఇది శుభ పరిణామమే.
-వనం దుర్గా ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment