-దేవరకద్ర మార్కెట్‌లో
క్వింటా గరిష్ట ధర రూ. 2, 400
జనం కళ్ల వెంట నీళ్లు తెప్పించిన ఉల్లి ఘాటు తగ్గుముఖం పడుతోంది. వారం రోజులుగా ధరలు అందుబాటులోకి వస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా దేవకద్ర ఉల్లి మార్కెట్ లో గత వారం వేలంలో పలికిన ధరకన్నా.. ఈ వారం కొద్ది మేర తగ్గింది. బుధవారం మార్కెట్ లో జరిగిన వేలంలో గరిష్టంగా క్వింటాల్ ఉల్లిధర 2,400 పలుకగా.. కనిష్టంగా.. రూ 1,100 గా ఉంది. సీజన్ ప్రారంభంలో 4000 రూపాయలు ఉన్న ఉల్లి.. రెండు వారాలుగా తగ్గుముఖం పట్టింది. వర్షాలు కురవడం వల్ల మార్కెట్ కు వచ్చిన ఉల్లి పచ్చిగా ఉన్నా.. వ్యాపారులు కొనుగోలు చేశారు.
కాగా.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరలు తగ్గడం వల్లనే ఉల్లి ధర తగ్గుదల కనిపించిందని వ్యాపారులు అంటున్నారు. బుధవారం మార్కెట్‌కు దాదాపు వేయి బస్తాల ఉల్లి అమ్మాకానికి వచ్చింది. నిల్వ చేసుకోడానికి కావలసిన ఉల్లి రాక పోవడంతో కొనుగోలు దారులు ధరలు పెంచడానికి ఇష్టపడలేదు. బయట వ్యాపారులు స్థానిక వ్యాపారుల మధ్య కొంత వరకు పోటీగా వేలం సాగినా ధర మాత్రం అంతంత మాత్రమే దక్కింది.