రియల్.. కుదేల్!
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలవుతోంది. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఈ రంగాన్ని కోలుకోలేకుండా చేస్తున్నాయి. ‘తెలంగాణ’ ప్రకటన రిజిస్ట్రేషన్ల నమోదుపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రత్యేక రాష్ట్ర ప్రక్రియపై సందిగ్ధతకు తెరపడకపోవడం.. కొనుగోలుదారులు వేచిచూసే ధోరణి అవలంబిస్తుండటంతో రియల్టర్లు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం అనంతరం రాష్ట్రంలో అనిశ్చితి నెలకొంది.
ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా సంభవించిన ఆర్థిక మాంద్యం కూడా స్థిరాస్తి రంగాన్ని ప్రభావితం చేసింది. మాంద్యం నుంచి తేరుకునేలోపే ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం ఊపందుకుంది. దాదాపు మూడేళ్లపాటు తీవ్రస్థాయిలో సాగిన ఉద్యమంతో స్థిరాస్తి రంగం నడ్డి విరిగింది. ఏడాది క్రితం ఉద్యమంలో కాసింత విరామం రావడంతో రియల్ జోరందుకుంది. ఈ జోష్‌కు కొనసాగింపుగా బడా డెవలపర్లు కూడా చకచకా తమ ప్రాజెక్టులను పూర్తి చేశారు. రియల్ ఎస్టేట్ సంస్థలు ఇబ్బడిముబ్బడిగా వెంచర్లను వేసేసి ప్లాట్లను అమ్మేశారు. దీంతో స్థిరాస్తి వ్యాపారానికి మంచి రోజులొచ్చాయని అంతా భావించారు. అంతలోనే కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో రియల్టీ కుప్పకూలింది. అప్పటివరకు స్థలాలు కొనేందుకు ఒప్పందం కుదుర్చుకున్న వారు సైతం వెనక్కి తగ్గారు. అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ల కొనుగోలుకు ముందుకొచ్చేవారు కరువయ్యారు.
బ్యాంకు రుణాలతో భారీ ప్రాజెక్టులను నిర్మించిన వారు ఆఖరుకు ‘నిర్మాణ వ్యయానికే ఫ్లాట్లు’ అని ఆఫర్లు ఇస్తున్నా స్పందన లేకుండా పోయింది. నగర శివార్లలో ప్లాట్ల క్రయ విక్రయాలు కాస్తో కూస్తో జరుగుతున్నాయంటే అది కూడా నాగార్జునసాగర్ మార్గంలోనే. ఆదిబట్ల ప్రాంతంలో ఐటీ రంగం విస్తృతి చెందుతుండటం, ఇబ్రహీంపట్నంలో పరిశ్రమల తాకిడి పెరగడంతో ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు రియల్టర్లు ఆసక్తి చూపుతున్నారు. అదే తరుణంలో కృష్ణా జలాలు కూడా పుష్కలంగా ఉండటం, ఐటీఐఆర్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదముద్ర వేయడంతో భవిష్యత్తులో ఈ ప్రాంతంలో నగరీకరణ శరవేగంగా జరుగుతుందని అంచనా వేస్తున్నారు.
రిజిస్ట్రేషన్లలో భారీ తేడా!
రియల్ బూమ్ కారణంగా శివార్లలో స్థలాల ధరలు ఆసాధారణంగా పెరిగాయి. దీంతో ఈ స్థలాలను విక్రయించేందుకు కొంతమంది అనివార్యంగా సాహసించినప్పటికీ, కొనుగోలుదారులు మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో వెనకడుగు వేస్తున్నారు. కొన్నాళ్లు వేచి చూసిన తర్వాత స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టడం మంచిదనే భావనకొచ్చారు. మరోవైపు నగర పరిసర ప్రాంతాల్లో భూముల విలువలు భారీగా పడిపోయాయి. కొనేవారి సంఖ్య తగ్గిపోవడంతో ధరలు దిగివస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జిల్లాలో గత మూడు నెలల కాలంలో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ తగ్గిపోయింది.
జిల్లా వ్యాప్తంగా ఆగస్టు - ఆక్టోబర్ వరకు రూ.488.66 కోట్లను రిజిస్ట్రేషన్ల రూపంలో సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించగా.. వాటిలో రూ.359.91 కోట్లు మాత్రమే సేకరించింది. అంటే నిర్దేశిత లక్ష్యంలో కేవలం 73.46 శాతమే సాధించిందన్నమాట. వాస్తవానికి గత ఏడాది ఇదే సమయంలో కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 200 శాతానికి పైగా కూడా దస్తావేజులు రిజిష్టర్ అయ్యాయి. ఈసారి మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై స్పష్టత వచ్చిన అనంతరమే రియల్ రంగంలో నెలకొన్న అనిశ్చితి తొలిగే అవకాశముంది.
షాబాద్ మండలం నాగర్‌గూడలో తెలంగాణ ప్రకటనకు ముందు ఎకరా రూ.40లక్షలు పలకగా, ప్రస్తుతం హైవే పక్కన ఉన్న భూములు రూ.20 లక్షలు, మారుమూల ప్రాంతంలో రూ.15లక్షలు పలుకుతున్నాయి.
కీసర సబ్ రిజిస్ట్రార్ పరిధిలో గత ఏడాది ఆగస్టు నుంచి ఆక్టోబర్ వరకు రూ.7.18 కోట్లు లక్ష్యంకాగా, దానికంటే రూ.14 లక్షల ఆదాయం ఆదనంగా లభించింది. ఈ ఏడాది రూ.10.70 లక్షలు టార్గెట్ కాగా, రూ.5.17 లక్షలు మాత్రమే సమకూరింది. అంటే దాదాపు 50శాతం రాబడి పడిపోయింది.