అందరి చూపూ మాఫీ పైనే.. | Waiver everyone on see | Sakshi
Sakshi News home page

అందరి చూపూ మాఫీ పైనే..

Published Wed, Aug 20 2014 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 12:07 PM

అందరి చూపూ మాఫీ పైనే..

అందరి చూపూ మాఫీ పైనే..

విభజన తరువాత  ఏపీ తొలి బడ్జెట్ నేడే
     
ఎన్నికలకు ముందిచ్చిన హామీలకే భారీ మొత్తాలు కావాలి..
వ్యవసాయ, డ్వాక్రా రుణాల మాఫీ కోసమే 1.01 లక్ష కోట్లు కావాలి
రాష్ట్ర మొత్తం బడ్జెట్ రూ.1.11 లక్ష కోట్లుగా ఉండే అవకాశం
దీన్లో మాఫీకి కేవలం 5 శాతం నిధులు కేటాయించొచ్చంటున్న నిపుణులు
 

హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశపెడుతున్న బడ్జెట్‌లో రుణాల మాఫీకి ఎంత కేటాయిస్తారోనని లక్షలాది రైతులు, డ్వాక్రా మహిళలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. రైతులు, డ్వాక్రా సంఘాల రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదిక ప్రకారం రైతులు తీసుకున్న అన్ని రకాల వ్యవసాయ రుణాలు 87,612 కోట్ల రూపాయలు. డ్వాక్రా సంఘాల రుణాలు రూ. 14,204 కోట్లు. ఈ రుణాల మాఫీ కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో ఎన్ని వేల కోట్లు కేటాయిస్తుందనే అంశంపై రైతులు, మహిళలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందిచ్చిన హామీలపై నామమాత్రపు కేటాయింపులతో సరిపుచ్చాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. రుణాల మాఫీకి ప్రణాళిక పద్దులో రూ. 4 వేల కోట్లు, ప్రణాళికేతర పద్దులో రూ. 1,000 కోట్ల నామమాత్రపు కేటాయింపుతో రాష్ట్ర ప్రభుత్వం సరిపుచ్చవచ్చని సమాచారం. ఏదో కేటాయించామని చెప్పుకోవడానికి కేటాయింపులు చేస్తారే తప్ప, రుణ మాఫీని ఇప్పటికిప్పుడు అమలు చేయడానికి కాదని అధికారవర్గాలే చెబుతున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఆర్థిక మంత్రిగా యనమల రామకృష్ణుడుకు దక్కింది.

బుధవారం ఉదయం 11 గంటలకు ఆయన 2014-15 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను శాసన సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇదే సమయానికి శాసన మండలిలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతారు. అంతకుముందు ఉదయం 8 గంటలకే రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతుంది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు, కేంద్రం నుంచి నిధులు అధిక మొత్తంలో రాబట్టేందుకు వీలుగా అభివృద్ధికి, ఆస్తుల కల్పనకు ఆయువుపట్టు అయిన ప్రణాళిక వ్యయాన్ని ప్రభుత్వం ఈసారి భారీగా తగ్గించింది. ప్రణాళికేతర వ్యయాన్ని మాత్రం భారీగా పెంచింది. ఆస్తుల కల్పన వ్యయం కేవలం రూ. 7,000 కోట్లుగా పేర్కొంది. ఈసారి రూ. 1.11 లక్షల కోట్లకు పైగా బడ్జెట్‌ను రూపొందించారు. ఇందులో ప్రణాళిక వ్యయం (కేంద్ర పథకాల నిధులతో కలిపి) రూ. 26 వేల కోట్లకు పైగా ఉండగా ప్రణాళికేతర వ్యయం రూ. 85 వేల కోట్లకు పైగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే ఆదాయం రూ. 92 వేల కోట్లుగా అంచనా వేశారు. ఇందులో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం రూ. 38 వేల కోట్లుగా, కేంద్రం నుంచి పన్నుల వాటాతో పాటు ఇతర అన్ని రకాలుగా రూ. 54 వేల కోట్లు వస్తాయని అంచనా వేశారు. రెవెన్యూ వ్యయం రూ. 98 వేల కోట్లుగా చూపబోతున్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగతా పది నెలలకు రెవెన్యూ లోటు రూ. 15,691 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అయితే బడ్జెట్‌లో రెవెన్యూ లోటు రూ. 6,000 కోట్లుగా పేర్కొన్నారు. ద్రవ్య లోటు రూ. 12,000 కోట్లుగా ఉండనుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక గ్రాంటుగా రూ. 8 వేల కోట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రూ. 9 వేల కోట్లు వస్తాయని అంచనా వేశారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 18 వేల కోట్ల రూపాయలు అప్పు చేయనున్నారు. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లను ప్రణాళికేతర వ్యయంలోకి తీసుకు వచ్చారు.  నీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపును భారీగా తగ్గించేశారు. ఈ రంగానికి కేవలం రూ. 3,100 కోట్లు కేటాయించారు. అక్టోబర్ నుంచి వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పింఛన్లను పెంచుతున్నందున కేటాయింపులు పెంచారు. బడ్జెట్‌లో కాపుల సంక్షేమానికి రూ. 50 కోట్లు, బ్రాహ్మణుల సంక్షేమానికి రూ. 25 కోట్లు కేటాయించారు. ఆరోగ్యశ్రీ పథకానికి రూ. 500 కోట్లు కేటాయించారు. అన్న క్యాంటీన్లు, ఎన్టీఆర్ సుజల స్రవంతికి నామమాత్రంగా కేటాయించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతికి రూ. 5 కోట్లు మాత్రమే కేటాయించారు.  
 http://img.sakshi.net/images/cms/2014-08/41408482144_Unknown.jpg
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement