కేంద్ర సాయం కోసం పంపిన వివరాలు ఇవ్వండి | Give the details of who sent for help | Sakshi
Sakshi News home page

కేంద్ర సాయం కోసం పంపిన వివరాలు ఇవ్వండి

Published Wed, Dec 3 2014 1:59 AM | Last Updated on Mon, Aug 13 2018 4:11 PM

కేంద్ర సాయం కోసం పంపిన వివరాలు ఇవ్వండి - Sakshi

కేంద్ర సాయం కోసం పంపిన వివరాలు ఇవ్వండి

ఆదాయాన్ని అక్కడే ఖర్చు చేయాలి
అంచనాల కమిటీ సభ్యులు చెవిరెడ్డి డిమాండ్


 తిరుపతి: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ అభివృద్ధి, రాజధాని ఇతరత్ర నిర్మాణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం కోసం పంపిన వివరాలను ఇవ్వాలని చంద్రగిరి ఎమ్మెల్యే, అసెంబ్లీ అంచనాల కమిటీ సభ్యులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కోరారు. హైదరాబాద్‌లోని ఏపీ అసెంబ్లీ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ అంచనాల కమిటీ ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో మంగళవారం రివ్యూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రం సహాయం కోసం నివేదికలు పంపామని ప్రభుత్వం నిత్యం చెబుతోందన్నారు. ఏయే శాఖల, ప్రాజెక్ట్‌ల కోసం ఎంత నిధులు అవసరమని కేంద్రానికి పంపారో ఆ నివేదిక కాపీలను అందజేయాలని ఆర్థిక శాఖను కోరారు. రాష్ట్రం విడిపోవడం వల్ల ప్రభుత్వం అప్పుల్లో ఉందని , ఆదాయం లేదని చెబుతున్నారే తప్ప వాటిని గణాంకాలలో చూపాలని చెప్పారు.

అయితే ఏపీ నుంచి వచ్చే ఆదాయం గురించి ఎక్కడా మాట్లాడక పోవడంపై ఆయన ప్రశ్నించారు. రెవెన్యూ నుంచి ఎంత ఆదాయం వస్తుందో అంచనా వేశారా? అని నిలదీశారు. ఇలా అన్ని శాఖల నుంచి ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం గురించి గణాంకాలు లెక్క వేసి వివరాలు ఇవ్వాలని కోరారు. విభజనకు ముందు ఆర్థిక పరిస్థితులు, నూతన రాష్ర్ట స్థితిగతులపై ఆయన గణాంకాలతో సహా నివేదిస్తూ వివరణ కోరారు. దీనిపై సీనియర్ ఐఏఎస్‌లైన ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌కల్లం, సెక్రటరీ ప్రేమ్‌చంద్రారెడ్డి మాట్లాడుతూ ఈ గణాంకాల వివరాలను అందజేస్తామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడంతో కేంద్రం రూ.14,500 కోట్ల సాయం ఇస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. దీనిపై స్పందించిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆర్టీఏ వసూలు చేసే ఆదాయాల్లో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తుందన్నారు. ఈ నిధులను గ్రామీణ ప్రాంతాల్లో వినియోగించకుండా పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ ఖర్చు చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు.

గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ఆదాయాన్ని అక్కడ అభివృద్ధికి ఎందుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అనేక గ్రామాలకు సక్రమమైన రోడ్లు, మరుగుదొడ్లు, శ్మశాన వాటికలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం పల్లెల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. హైదరాబాద్ నుంచి విడిపోయాక ఏపీలో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ టక్కర్ నళిని, ఇతర కమిటీ సభ్యులు, అనేక మంది ఐఏఎస్ అధికారులు, ఆడిట్, అకౌంట్ అధికారులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement