భద్రాచలం, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో....పోలవరం ముంపు ప్రాంతంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎటువైపు అనే విషయమై ఇంకా స్పష్టత లేకున్నప్పటికీ ఉద్యోగుల పంపకాల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో ముంపు పరిధిలోకి వచ్చే 211 గ్రామాల పరిధిలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల జాబితాలు సిద్ధమవుతున్నాయి. వీరికి సంబంధించిన మొత్తం నివేదికలను అందజేయాలని జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అదేశించడంతోఆయా శాఖల అధికారులు నివేదికల తయారీలో నిమగ్నమయ్యారు.
ముంపు పరిధిలోకి వచ్చే గ్రామాలను జూన్ 2 తరువాత జిల్లా నుంచి వేరుచేసి అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేస్తారు. అప్పటి నుంచి అయా గ్రామాల్లో పాలన, ఇతర వ్యవహారాలు, ప్రభుత్వ పరంగా అందే సేవలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అందుతాయి. విలీనం తరువాత ఆయాగ్రామాలను కలిపే మండలాల నుంచే పరిపాలన మొత్తం సాగుతుంది. కానీ ముంపు ప్రాంతాలలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రజానీకంతో పాటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వెళ్తారా..? లేకుంటే తెలంగాణ రాష్ట్రంలోకి వస్తారా..? అనే దానిపై సందిగ్ధత నెలకొంది.
ఉద్యోగ సంఘాలకు కూడా ఈ విషయమై ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవటంతో క్షేత్ర స్థాయిలో పనిచేసే ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగుల పంపకాలపై మార్గదర్శకాలు ప్రభుత్వం నుంచి వస్తేనే కానీ దీనిపై స్పష్టత వచ్చే పరిస్థితి లేదని ఐటీడీఏలోని ఓ ఉన్నతాధికారి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఇదిలా ఉండగా ఉద్యోగుల పంపకాలపై మార్గదర్శకాలు ఎలా ఉన్నప్పటికీ ముంపు పరిధిలో ఎంత మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు... అక్కడి ప్రభుత్వ ఆస్తులేంటి అనే దానిపై ఆయా శాఖల ఆధ్వర్యంలో సమగ్ర నివేదికలు సిద్ధమవుతున్నాయి.
వైద్యశాఖ నుంచి 520 పోస్టులు ఆంధ్రలోకి....
ముంపు పరిధిలోకి వచ్చే 211 గ్రామాల్లో వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలో ఉన్న ఆస్పత్రుల్లో, క్షేత్ర స్థాయిలో పనిచేసే అన్ని కేడర్‌లు కలుపుకొని మొత్తం 520 పోస్టులు అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వెళ్లనున్నాయి. అంటే ఈ పోస్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా అదే ప్రాంతంలో పనిచేయాల్సి ఉంటుంది. గౌరిదేవిపేట, కూటూరు, రేఖపల్లి, జీడిగుప్ప, కుక్కునూరు, అమరవరం, వేలేరుపాడు, కొయిదా ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు..., అదే విధంగా చింతూరు, కూనవరం, బూర్గంపాడు క మ్యూనిటీ న్యూట్రిషన్ సెంటర్‌లు..., చింతూరు, కూనవరం, బూర్గంపాడు సివిల్ ఆస్పత్రులను జిల్లా నుంచి వేరు చేసి అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపనున్నారు. 23 మంది వైద్యులు, 45 మంది ఏఎన్‌ఎమ్‌లు, 204 మంది ఆశకార్యకర్తలు ఇలా అన్ని కేడర్‌లలో గల ఉద్యోగులు 520 మంది జూన్ 2 తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పనిచేయాల్సి ఉంటుంది.
విద్యాశాఖ నుంచి 714 మంది ఉద్యోగులు...
ముంపు ప్రాంతాల్లో వివిధ యాజమాన్యాల కింద(గిరిజన సంక్షేమం, జిల్లా మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలలు) ఉన్న పాఠశాలల్లో అటెండర్ నుంచి హెచ్‌ఎం, ఎంఈవోలతో సహా మొత్తం 714 మంది ఉద్యోగులు వేరు కానున్నారు. వీరిలో మండల, జిల్లా పరిషత్ నుంచి 185 పాఠశాలలకు చెందిన 489 మంది, గిరిజన సంక్షేమశాఖ పరిధిలో ఉన్న 51 విద్యా సంస్థల నుంచి 225 మంది ఉన్నారు. ఇలా ముంపు పరిధిలో ఉన్న దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల నుంచి వేరు చేయబోయే ఉద్యోగుల జాబితా సిద్ధమవుతోంది. ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనను నివృత్తి చేయకుండానే ముంపు ప్రాంతాల్లో పనిచేస్తున్న తమను వేరు చేస్తున్నట్లుగా నివేదికలను తయారు చేయటం పట్ల ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆందోళనలకు సిద్ధం....
ముంపు పరిధిలో పనిచేసే అన్ని కేడర్‌ల ఉద్యోగులకు ఆప్షన్ సౌకర్యం కల్పించి వారు ఇష్టమొచ్చిన రాష్ట్రంలో పనిచేసేలా అవకాశం ఇవ్వాలని ఈ ప్రాంత ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయమై జిల్లా కలెక్టర్‌కు వివిధ సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రాలను అందజేశారు. ముంపు పరిధిలో పనిచేసే వారంతా దాదాపు గిరిజన ఉద్యోగులే అయినందున వారికి ఆప్షన్‌లు ఇచ్చి తీరాలని, లేకుంటే న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని గిరిజన ఉద్యోగులు ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు.
అటా...ఇటా...?
Published Wed, May 14 2014 4:29 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement