క్రీడలకు ‘విభజన’ శాపం
- నిధుల మంజూరులో జాప్యం
- విడుదల కాని రూ.50.05 కోట్లు
- ప్రశ్నార్థకంగా 10 స్టేడియాల ఆధునికీకరణ
- కొత్త ప్రభుత్వం కరుణ కోసం నిరీక్షణ
నెల్లూరు(బృందావనం): జిల్లాలో క్రీడా ప్రగతికి రాష్ట్ర విభజన శాపంగా మారింది. కొత్త స్టేడియాల నిర్మాణం, పాత స్టేడియాల ఆధునికీకరణకు గ్రహణం పట్టింది. బాలారిష్టాలెన్నింటినో దాటుకుని పనుల దశకు వచ్చిన సమయంలో విభజన జరిగి, నిధులు మంజూరు నిలిచిపోయింది. మరోవైపు గత ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులకు కాలం చెల్లింది. దీంతో క్రీడారంగ అభివృద్ధి ప్రశ్నార్థకమవుతోందని క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో జిల్లాకు రూ.50.05 కోట్లు మంజూరయ్యాయి.
ఈ నిధులతో కొత్త స్టేడియాల నిర్మాణం, పాత స్టేడియాలను ఆధునికీక రిస్తామని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ప్రకటించింది. ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్సు కాంప్లెక్స్ ఆధునికీకరణకు రూ.14 కోట్లు, మాగుంటలే అవుట్‌లో టెన్నిస్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ. 6.95 కోట్లు, వెంకటగిరిలోని తారకరామ క్రీడాప్రాంగణం అభివృద్ధికి రూ.2.70 కోట్లు, గూ డూరు, ఉదయగిరిల్లో మినీస్టేడియాలకు ఫెన్సింగ్ నిర్మాణానికి రూ.55 లక్షలు మంజూరు చేశారు.
ఇక కొత్తగా మినీస్టేడియాల నిర్మాణానికి సంబంధించి అల్లీపురానికి రూ.3.60 కోట్లు, ఆత్మకూరుకు రూ.7.15 కోట్లు, పొదలకూరుకు రూ.2.60 కోట్లు, కోవూరుకు రూ.5.05 కోట్లు, కావలికి రూ.4.70 కోట్లు, సూళ్లూరుపేటకు రూ.2.75 కోట్లు కేటాయించారు. ఈ క్రమంలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం ప్రాంగణంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆధునికీకరణ, మాగుంట లేఅవుట్‌లో నూతన టెన్నిస్ కాంప్లెక్స్, అల్లీపురంలో మినీస్టేడియం నిర్మాణానికి మార్చి 2న అప్పటి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శంకుస్థాపన చేశారు. వెంటనే పనులు ప్రారంభించి 18 నెలల్లో పూర్తి చేయాలని అప్పట్లో ఆయన సభాముఖంగా అధికారులకు సూచించారు.
విభజనతో నిధులకు గ్రహణం
రాష్ట్ర విభజన నేపథ్యంలో పరిపాలన పరంగా తలెత్తిన సమస్యలతో గత ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు అమలుకు నోచుకోలేదు. దీంతో రూ.50.05 కోట్ల నిధుల విడుదలకు ఆటంకం ఏర్పడింది. నిధుల విడుదల కాక, ఆధునికీకరణ పనులు జరగక జిల్లాలో ప్రస్తుతం ఉన్న క్రీడాప్రాంగణాలు కళతప్పుతున్నాయి.కొత్త ప్రభుత్వమైనా స్పందించి గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను విడుదల చేసి క్రీడాభివృద్ధికి సహకరించాలని క్రీడాకారులు, క్రీడాభిమానులు కోరుతున్నారు.
త్వరలో నిధులు విడుదల:
ఆర్.కె.ఎతిరాజ్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి
నిధుల మంజూరుకు సంబంధించిన ప్రక్రియ జరుగుతోంది. త్వరలో విడుదల అవుతాయి. ఇప్పటికే జిల్లా క్రీడాప్రాధికార సంస్థ చైర్మన్, కలెక్టర్ శ్రీకాంత్ ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. సమీక్ష సమావేశం కూడా నిర్వహిం చారు. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు పరిస్థితి నివేదించాం. మరో పదిహేను రోజుల్లో నిధుల విడుదల జరిగి పనులు అప్పగించిన ఆంధ్రప్రదేశ్ మెడికల్ సొసైటీ ఫర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్‌ఐడీసీ) టెండర్ ఫ్లోట్ చేయనుంది. మరో 15 రోజు ల్లోగా సమగ్ర సమాచారం అందుతుంది.