ఆదాయం వస్తున్నా బీద అరుపులేల
► ఇందిరమ్మ’ లబ్ధిదారులగోడు పట్టదా
► ప్రభుత్వంపై పీసీసీ ఉపాధ్యక్షుడు
► నాదెండ్ల మనోహర్ ధ్వజం
తెనాలి : రాష్ట్ర విభజనతో ఏర్పడిన రూ.16 వేల కోట్ల రెవెన్యూ లోటును అధిగమించి, ఆదాయం పెరుగుతున్నా రాష్ట్రప్రభుత్వం, ప్రజల అవసరాలపై నిర్లక్ష్యంగా వ్యహరిస్తోందని పీసీసీ ఉపాధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ విమర్శించారు. దాయం పెరిగినా సంక్షేమానికి ప్రభుత్వం అరకొర కేటాయింపులు ఏమిటని ప్రశ్నించారు. తెనాలిలోని స్వగృహంలో గురువారం విలేకర్లతో మనోహర్ మాట్లాడారు. సేల్స్‌టాక్సు రూపేణా రూ.31,120 కోట్లు, వివిధ పన్నుల రూపంలో రూ.44, 423 కోట్లు ఆదాయం వచ్చిందని చెప్పారు. తెలంగాణకు రూ.40 వేల కోట్ల పన్ను ఆదాయం వస్తే, ఆంధ్రప్రదేశ్‌కు అదనంగా మరో 4,423 కోట్లు వచ్చిందన్నారు.
14వ ఆర్థిక సంఘ నిధులు మరో 21,200 కోట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రూ.5,300 కోట్లు సమకూరాయని, రెవెన్యూ లోటు రూ.16 వేల కోట్లు భర్తీ అయి రూ.1573 కోట్లు అదనంగా వచ్చినట్టు వివరించారు. ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులకు బిల్లుల బకాయిలు ఎందుకు చెల్లించటం లేదని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం కింద పదేళ్లలో 64 లక్షల గృహాలను నిర్మించినట్టు గుర్తు చేశారు.
టీడీపీ ప్రభుత్వం రాగానే అవకతవకలంటూ విచారణకు ఆదేశించి బిల్లులు నిలుపుదల చేసిందన్నారు. మరోవైపు కొత్తగా రూ.16,300 కోట్లతో ఆరు లక్షల గృహాలను నిర్మిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం బడ్జెట్‌లో ఇప్పటివరకు కేటాయించింది కేవలం రూ.1132 కోట్లు మాత్రమేనని గుర్తుచేశారు. భారీ ప్రాజెక్టును అరకొర నిధులతో ఎలా పూర్తిచేస్తారన్నారు. వైఎస్ హయాంలో పార్టీల కతీతంగా అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాల లబ్ధిని అందిస్తే, ఇప్పుడు ఇల్లు ఇవ్వాలంటే జన్మభూమి కార్యకర్తల సిఫార్సు చేయాలనే నిబంధనలు బాధ కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించారు.