‘డాబుసరి’ పాలన | chandra babu fail on election promises | Sakshi
Sakshi News home page

‘డాబుసరి’ పాలన

Published Mon, Dec 8 2014 12:36 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

‘డాబుసరి’ పాలన - Sakshi

‘డాబుసరి’ పాలన

చంద్రబాబు సీఎంగా పగ్గాలు చేపట్టి నేటికి 6 నెలలు
మే 20 తేదీ నుంచే అజమాయిషీ
రాజధానిపై ఆత్రం.. ఏకపక్ష నిర్ణయం
ఎన్నికల హామీల అమలులో వైఫల్యం
{పజా సమస్యల పరిష్కారంలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు
సమీక్షలు, హైటెక్ మాటలతో సరి
శ్వేత పత్రాలు విడుదల, కన్సల్టెంట్ల నియామకంలో ముందుకు
విభజన హామీలపై కేంద్రానికి ప్రతిపాదనలతో సరి..
నిధులు తేవటంలో విఫలం
విలాసాలకే పెద్ద పీట.. సీఎం, సీఎస్
కార్యాలయాలకు రూ. 45 కోట్లు ఖర్చు

 
హైదరాబాద్:  రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు పగ్గాలు చేపట్టి సోమవారం తో ఆరు నెలలు పూర్తవుతుంది. సాంకేతికంగా చంద్రబాబు జూన్ 8వ తేదీ నుంచి అధికార పగ్గాలు చేపట్టారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 15న వెలువడినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనకు అపాయింటెడ్ డేగా జూన్ 2ని నిర్ణయించడంతో అప్పటివరకు ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయలేదు. అయితే, అధికార పార్టీ అధినేతగా, కాబోయే ముఖ్యమంత్రిగా మే 20వ తేదీ నుంచే ఆయన ఆజమాయిషీ చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత మంచి ముహూర్తం చూసుకొని జూన్ 8న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు చంద్రబాబు ఒక్క అంశంలోనూ స్పష్టమైన వైఖరిని కనబరచలేదు. అత్యంత ప్రధానమైన రాజధాని విషయంలో ఆత్రం ప్రదర్శించారు. ఎన్నికల హామీల అమలులో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. రాజధాని, విదేశీ పర్యటనలు, కార్యాలయాలను సుందరంగా తీర్చిదిద్దుకోవడం, ప్రత్యేక విమానాల్లో చక్కర్లు కొట్టడంలో అత్యుత్సాహం చూపుతున్నారు. మిషన్లు, కన్సల్టెంట్లు, సలహాదారుల నియామకం, సమీక్షల మీద సమీక్షలు, హైటెక్ మాటల్లో ముందున్నారు. మొత్తంగా చూస్తే ‘డాబుసరి’ పాలనే తప్ప.. ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టలేదన్న విషయం సుస్పష్టంగా కనిపిస్తోంది.
 సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారమే అట్టహాసంగా జరిగింది. ప్రమాణ స్వీకారం సందర్భంగా తొలి 5 సంతకాలంటూ ఆర్భాటం చేశారు. వీటిలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు మినహా మరేదీ అమలులోకి రాలేదు. రుణ మాఫీ విషయంలో గత 6 నెల లుగా చంద్రబాబు సర్కారు రైతులు, డ్వాక్రా మహిళలను వంచిస్తున్న తీరు కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. చివరికి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆందోళనలు చేపట్టడంతో దిగివచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీపై ఈ నెల 4న విధివిధానాలు ప్రకటించింది. నూతన రాష్ట్రానికి అత్యంత ప్రధానమైన రాజధాని ప్రాంతం ఎంపిక విషయంలో నిపుణులు, ప్రజాప్రతినిధులను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలను మూటగట్టుకున్నారు.

సారవంతమైన, ఏడాదికి మూడు పంటలిచ్చే భూములను రాజధానికి ఎంపిక చేయడంపై అనేక వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. నూతన రాజధాని నిర్మాణానికి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కేపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అధారిటీ ఏర్పాటుకు ముసాయిదా బిల్లును కూడా మంత్రివర్గం ఆమోదించింది. రాజధాని నిర్మాణంలో సహకారాన్ని  కోరేందుకు, పెట్టుబడులను ఆహ్వానించడానికి చంద్రబాబు, ఆయన బృందం సింగపూర్, జపాన్‌లలో పర్యటించి వచ్చింది. హుద్‌హుద్ తుఫాను సమయంలో చంద్రబాబు విశాఖపట్టణంలోనే మకాం వేసి అంతా వన్‌మేన్ షో నడిపించారు. అయితే కేవలం విశాఖపట్టణంలోని బాధితులకే సకాలంలో సహాయం సకాలంలో అందించారు తప్ప శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల బాధితులను పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలపై ప్రతిపాదనలను బాబు సర్కారు ఢిల్లీకి పంపినప్పటికీ, వాటికి సంబంధించిన నిధులను రాబట్టడంలో మాత్రం విఫలమైంది. పేదల కోసమం టూ పెద్ద పెద్ద మాటలు చెప్పిన చంద్రబాబు.. ఈ ఆరు నెలల్లో పేదలకు కొత్తగా ఒక్క ఇంటిని కూడా మంజూరు చేయకపోగా, గత ప్రభుత్వం మంజూరు చేసిందనే పేరుతో 7.95 లక్షల గృహాలను మాత్రం రద్దు చేశారు. ఏడు రంగాలకు చెందిన మిషన్ల పేరుతో ఏకంగా 30 మంది కన్సల్టెంట్లను, పలువురు సలహాదారులను నియమించి, లక్షల్లో వేతనాలు చెల్లిస్తున్నారు. వీటి ఫలితమేమిటన్నది ఇప్పటికీ తేలలేదు. గత ప్రభుత్వాన్ని తప్పుపట్టే ఉద్దేశంతో రంగాలవారీగా శ్వేతపత్రాలను ప్రకటించారు.

సమీక్షలతోనే సరి..

ఆరు నెలల చంద్రబాబు పాలన చూస్తే సమీక్షలతోనే సాగదీస్తున్నారన్న విమర్శలు అధికారవర్గాల్లోనే ఉన్నాయి. బాబు ప్రతి వారం గంటల తరబడి సమీక్షలు చేస్తున్నారు. వారం తిరగకుండానే మళ్లీ అవే అంశాలపై సమీక్షలు చేస్తూ చెప్పిందే మళ్లీ మళ్లీ చెబుతున్నారు. దీంతో ఉన్నతాధికారులందరూ విసుగెత్తిపోతున్నారు. తమ సమయమంతా సమీక్షలకే సరిపోతోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సమీక్షలు పత్రికల్లో వార్తలకు, ఏదో చేస్తున్నామన్న భావన కల్పించడానికే పనికొస్తున్నాయి తప్ప, ఒక్కటీ ఫలితమివ్వలేదని ఉన్నతాధికారులే వ్యాఖ్యానిస్తున్నారు.

అంతా అనుత్పాదక వ్యయమే..!

ప్రభుత్వ ధనాన్ని ఉత్పాదకతకు వెచ్చించాల్సి ఉండగా.. అందుకు పూర్తి విరుద్ధంగా విలాసాల కోసమే పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఒక పక్క ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి డబ్బుల్లేవంటూ ప్రజల నుంచి చందాలు వసూలు చేస్తోంది. మరోపక్క భారీ రెవెన్యూ లోటు ఉందని కేంద్రాన్ని నిధులడుగుతోంది. విలాసాల కోసం మాత్రం భారీమొత్తంలో ఖర్చు చేస్తోంది. సచివాలయంలో ముఖ్యమంత్రి ఆఫీసు, క్యాంపు కార్యాలయాలను సుందరంగా తీర్చిదిద్దడానికే ఏకంగా రూ.45 కోట్లు నీళ్లలా ఖర్చు చేసేశారు. తొలుత సచివాలయంలోని సౌత్ హెచ్ బ్లాకులో సీఎం కార్యాలయం కోసం రూ. 10 కోట్లు ఖర్చు చేశారు. తర్వాత అక్కడ వాస్తు బాగోలేదన్న కారణంతో సీఎం కార్యాలయాన్ని ఎల్ బ్లాకుకు మార్చారు. ఇందులో రెండు అంతస్తుల్లో సీఎం, సీఎస్ కార్యాలయాలను సుందరంగా తీర్చిదిద్దడానికి రూ.15 కోట్లు ఖర్చు చేశారు. సీఎం కార్యాలయంలో ఫర్నీచర్ కోసం మరో రూ.10 కోట్లు వెచ్చించారు. ప్రధాన మంత్రి కార్యాలయం కూడా చంద్రబాబు కార్యాలయం ముందు తీసిపోయేలా ఉందని ఉన్నతాధికారులువ్యాఖ్యానిస్తున్నారు. ఇంతేకాకుండా సీఎం సొంత గృహానికి, లేక్‌వ్యూ అతిథి గృహంలో క్యాంపు కార్యాలయానికి మరో రూ. 10 కోట్లు ఖర్చు చేశారు. మరో పక్క రాష్ట్రంలో జిల్లాలకు, బెంగుళూరు, ఢిల్లీ వెళ్లినా ఆఖరికి సింగపూర్ వెళ్లినా చంద్రబాబు రెగ్యులర్ విమానాల్లో అడుగుపెట్టడానికి ఇష్టపడటంలేదు. ప్రత్యేక విమానాల్లోనే ప్రయాణం చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లా లు, ఢీల్లీ, బెంగూళూరులకే ఈ 6 నెలల్లో చంద్రబాబు 40 సార్లు ప్రత్యేక విమానంలో వెళ్లారు. ఎక్కువగా కృష్ణపట్నం పోర్టుకు చెందిన లగ్జరీ విమానంలోనే ప్రయాణిస్తున్నారు. ఈ విమానానికి గంటకు రూ.4 లక్షలు ఖర్చవుతుంది. ఇలా అనుత్పాదక రంగాలపై నిధులు ఖర్చు చేయడాన్ని అధికారులు తప్పుపడుతోంది.
 
కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితేమిటి?

 అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరిస్తామని బాబు హామీ ఇచ్చారు. గద్దెనెక్కాక ఈ విషయాన్నే పట్టించుకోవడంలేదు. వీరికి ఈ నెల 31 వరకు మాత్రం సర్వీసును పొడిగించింది. ఆ తర్వాత పరిస్థితేమిటన్నది అగమ్యగోచరంగా మారింది.
 
హామీల అమలు ఖర్చు  ఆరు నెలల్లో రూ.433 కోట్లే
 
ఎన్నికల ముందు తనకు తోచిన విధంగా ప్రజలకు హామీలు గుప్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఆరు నెలల కాలంలో వాటి అమలుకు ఖర్చు పెట్టిందెంతో తెలుసా? కేవలం రూ.433 కోట్లు. ఇదే తీరు కొనసాగితే బాబు ఇచ్చిన హామీలు పూర్తయ్యేందుకు దాదాపు 1,000 ఏళ్లు పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికలకు ముందు పార్టీ అధ్యక్షుడి హోదాలో చంద్రబాబు 52 పేజీల  మేనిఫెస్టోను విడుదల చేశారు.  ప్రతి పేజీలో పదికి తక్కువ కాకుండా హామీలు గుప్పించారు. అలా ఆ పార్టీ ఇచ్చిన హామీలను ఇచ్చినట్టే అమలు చేయాలంటే కేవలం రైతు, డ్వాక్రా రుణాల మాఫీకే లక్ష కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణానికి కనీసం మరో రెండు లక్షల కోట్లు అవసరం. హైదరాబాద్ లాంటి రాజధానిని కొత్తగా నిర్మించుకోవాలంటే ఐదు లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని గతంలో చంద్రబాబే చెప్పారు.  మిగతా హామీలకు మరో లక్ష కోట్లకు పైబడే అవసరం అవుతాయని అంచనా. ఇలా బాబు తానిచ్చిన హామీలన్నిటినీ అమలు చేయాలంటే మొత్తం నాలుగు లక్షల కోట్లకు పైగానే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటి రాష్ట్ర మొత్తం బడ్జెట్‌ను బట్టి చూస్తే నాలుగేళ్ల పూర్తి బడ్జెట్‌ను ఇందుకోసమే వినియోగించాలన్న మాట. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం చేస్తున్న మొత్తం ఖర్చులో ఒక్కటిన్నర శాతం కూడా హామీల అమలుకు వినియోగించడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ ఏడవ తేదీ నాటికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ అంశాల కింద మొత్తం రూ.34,034 కోట్లను ఖర్చు పెట్టింది. అయితే పింఛన్ల పథకానికి తప్ప ప్రభుత్వం మరే హామీ అమలుకు ఖజానా నుంచి రూపాయి ఖర్చు పెట్టడానికి ముందుకు రాలేదు. పింఛన్ల పథకానికీ గత ప్రభుత్వాలు చెల్లించిన మొత్తాలకు అదనంగా చంద్రబాబు సర్కార్ అదనంగా చెల్లించింది కేవలం రూ.433 కోట్లు మాత్రమే.
 
బాబు వచ్చారు.. జాబులే లేవు


 బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అందరికీ ఉద్యోగా లు ఇచ్చే సంగతి అటుంచితే.. సాధారణంగా ఏటా ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలూ ఆపేయాలంటూ ప్రభుత్వం లేఖ రాసింది. లక్షల సంఖ్యలో ఖాళీల భర్తీ కోసం ఎదురు చూస్తు న్న నిరుద్యోగులకు ప్రభుత్వ ఆదేశాలు అశనిపాతమే అయ్యాయి. గ్రూప్-1, 2, 4 ఉగ్యోగాల భర్తీ ఎప్పుడు చేపట్టేదీ ప్రకటిం చాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
 
 ఉద్యోగులకూ మొండిచేయే..!

 అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు పదో పీఆర్సీ సిఫార్సులను యధాతథంగా అమలు చేస్తానని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా, వేతన సవరణ గురిం చి పట్టించుకోలేదు. మండుతున్న ధరలను తట్టుకోలేక అల్లాడుతున్న సగటు ఉద్యోగికి ఊరట కలిగించే చర్యలను చేపట్టలేదు. కొత్త వేతనాలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో, ఏ తేదీ నుంచి ఆర్థిక లబ్ధి చేకూరస్తారనే విషయాన్నయినా స్పష్టంగా చెప్పాలన్న ఉద్యోగుల వినతినీ పట్టించుకోలేదు. వారానికి 5 రోజుల పని విధానం ప్రవేశపెడతానన్న ఎన్నికల హామీనీ చంద్రబాబు  పట్టించుకోలేదు. ఉద్యోగులు, పెన్షనర్లకు పేరుకైతే హెల్త్‌కార్డులు ఇచ్చారు కానీ.. వైద్యం అందించడానికి చర్యలు తీసుకోలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement