ఆర్టీసీ ఇంకా ఉమ్మడిగానేనా!
- విస్మయం వ్యక్తం చేసిన కేంద్ర ఉపరితల రవాణాశాఖ
- పరస్పర సంప్రదింపులతో కొలిక్కి తేవాలని సీఎస్‌లకు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగి ఏడు నెలలు దాటిపోయినా ఆర్టీసీ ఇంకా ఉమ్మడిగా ఉండడం పట్ల కేంద్ర ఉపరితల రవాణా శాఖ విస్మయం వ్యక్తం చేసింది. ఆర్టీసీని రెండు కార్పొరేషన్లుగా విభజించే అవకాశమున్నా.. ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించింది. వెంటనే ఇరు రాష్ట్రాల అధికారులు పరస్పరం చర్చించుకొని ప్రత్యేక రవాణా సంస్థలను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా సూచించింది.
తెలంగాణ, ఏపీల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు రాజీవ్ శర్మ, ఐవైఆర్ కృష్ణారావు, ఆర్టీసీ ఉన్నతాధికారులు శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ కార్యదర్శితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన తర్వాత ఆర్టీసీలో పరిణామాలు, ఆస్తులు, అప్పుల విభజన కసరత్తు, ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలు తదితర అంశాలపై సీఎస్‌లు తమ నివేదికలను సమర్పించారు.
చట్టం ప్రకారమే..
పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణలో ఉన్న ఆస్తులన్నీ తెలంగాణ రాష్ట్రానికే చెందుతాయని స్పష్టంగా ఉందని సీఎస్ రాజీవ్ శర్మ పేర్కొన్నారు. ఆ విధంగానే విభజన జరగాలని తాము కోరుతున్నట్టు నివేదికలో వివరించారు. ఉద్యోగుల విభజనను కమలనాథన్ కమిటీతో సంబంధం లేకుండా పూర్తి చేయాలన్నారు. ఏపీ మాత్రం తమ నివేదికలో హైదరాబాద్‌లోని ఆస్తులను కూడా జనాభా ప్రాతిపదికన పంచాలని కోరింది.
అయితే ఆర్టీసీ విభజన వ్యవహారంలో కేంద్ర రవాణా కార్యదర్శి ఘాటుగానే స్పందించారు. ఆస్తులు, అప్పుల పంపకాలపై కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక అందాక తదుపరి చర్యలు చేపడతామని... కానీ అప్పటివరకు ఆర్టీసీని విభజించకుండా ఉంచడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఆస్తులు, అప్పుల పంపిణీ, ఉద్యోగుల కేటాయింపు తదితర అంశాలన్నీ మార్గదర్శకాల ప్రకారం వాటంతట అవే జరుగుతాయని... పాలనాపరంగా గందరగోళం లేకుండా ఆర్టీసీని విభజించుకోవచ్చని పేర్కొన్నారు.
వెంటనే ఇరు రాష్ట్రాల అధికారులు చర్చించుకొని మార్గదర్శకాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత మరోదఫా సమావేశమై ఇతర అంశాలపై చర్చించుకోవచ్చన్నారు. కాగా.. మరో మూడు నాలుగు నెలల్లో ఆర్టీసీ విభజన పూర్తికావచ్చని సీఎస్ రాజీవ్‌శర్మ భేటీ అనంతరం విలేకరులతో చెప్పారు.
ఎప్పుడో జరగాల్సింది..
ఆర్టీసీ ఎండీగా ఏపీకి చెందిన అధికారి ఉన్నందున కేంద్రం సూచించిన ప్రకారం తెలంగాణకు ప్రత్యేకంగా జేఎండీ పోస్టును గత మే నెలలో ఏర్పాటు చేశారు. ఆర్టీసీని రెండుగా విభజించి ఎండీ ఆధ్వర్యంలో ఏపీఎస్ ఆర్టీసీ... జేఎండీ ఆధ్వర్యంలో టీఎస్‌ఆర్టీసీ విధులు నిర్వహించాలనేది దీని ఉద్దేశం. ఈ మేరకు తెలంగాణకు చెందిన రమణారావును జేఎండీగా నియమించినా... టీఎస్‌ఆర్టీసీని ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. ఈ తరుణంలో తాజాగా కేంద్రం వేసిన మొట్టికాయతో ఆ తంతును పూర్తి చేయక తప్పని పరిస్థితి నెలకొంది.