సమైక్య బంద్ సంపూర్ణం
=ఆగిన ఆర్టీసీ బస్సులు
= వాయిదాపడిన పరీక్షలు
సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ పిలుపుమేరకు శుక్రవారం జిల్లావ్యాప్తంగా బంద్ జరిగింది. అనేకచోట్ల జనజీవనం స్తంభించింది. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక, తెలుగుదేశం పార్టీలు కూడా బంద్ నిర్వహించాయి. సమైక్యవాదులు బస్ డిపోల ముందు బైఠాయించడంతో ఎక్కడి బస్సులు అక్కడ నిలిచిపోయాయి. జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. జిల్లాలోని విద్యాసంస్థలు, బ్యాంకులు, వర్తక, వాణిజ్య దుకాణాలు, హోటళ్లు, పెట్రోల్ బంక్‌లు, గ్యాస్ కంపెనీలు, మునిసిపల్ కార్యాలయాలు పూర్తిగా మూతపడ్డాయి.
ఆర్టీసీ బస్సులు సాయంత్రం వరకు తిరగకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ‘బంద్ కారణంగా ఈరోజు పాఠశాలకు సెలవు’ అని బోర్డులు పెట్టి మరీ సహకరించాయి. విజయవాడలో ఎన్జీవోలు తెల్లవారుజాము నుంచే బస్టాండ్ ఎదుట బైఠాయించి బస్సులు బయటికి రాకుండా అడ్డుకున్నారు. తెలుగు ప్రజలను ఏ ప్రాతిపదికన విభజిస్తున్నారో చెప్పకుండా అడ్డగోలుగా నిర్ణయం తీసుకోవడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ విమర్శించారు.
తెలుగుజాతి ముక్కలు కాకుండా చూడటానికి చిత్తశుద్ధితో పని చేస్తున్న ఏకైక నేత వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని చెప్పారు. బంటుమిల్లి చౌరస్తాలో వ ంటావార్పు నిర్వహించారు. పెడనలో 216 జాతీయ రహదారిపై బైఠాయించారు. కంచికచర్లలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. టీడీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
కలిదిండి సెంటరులో వైఎస్సార్‌సీపీ నాయకులు టైర్లు అంటించి నిరసన తెలియజేశారు. జగ్గయ్యపేటలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు, సమైక్యవాదులు తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి కార్యాలయాన్ని మూసివేయించి అక్కడే ధర్నా చేశారు. సమైక్యాంధ్ర పరిరక్షణ, విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ విధానం రద్దు కోరుతూ హనుమాన్‌జంక్షన్‌లో శుక్రవారం ఆందోళన చేశారు. బంద్ వల్ల ఆర్టీసీకి రూ.90 లక్షల మేర నష్టం ఏర్పడిందని అధికారులు తెలిపారు.
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో...
పెనమలూరు మండలంలో సమన్వయకర్తలు తాతినేని పద్మావతి, పడమట సురేష్‌బాబు, పామర్రులో ఉప్పులేటి కల్పన, తిరువూరు నియోజకవర్గంలో బండ్రపల్లి వల్లభాయ్, నూజివీడులో మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, నందిగామలో డాక్టర్ మొండితోక జగన్‌మోహన్‌రావు, కైకలూరులో దూలం నాగేశ్వరరావు, మైలవరంలో జోగి రమేష్, యువ నేత జ్యేష్ఠ శ్రీనాధ్, అవనిగడ్డలో సింహాద్రి రమేష్‌బాబుల ఆధ్వర్యంలో రాస్తారోకోలు, బంద్ కార్యక్రమాలు నిర్వహించారు. జగ్గయ్యపేటలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తన్నీరు నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు షేక్ మదార్‌సాహెబ్ ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు.