బిల్లు తెచ్చిన తంటాభవితపై బెంగ
- ఎన్నికలపై అయోమయం
- తెలంగాణ బిల్లు ఆమోద ఫలితం
- కాంగ్రెస్‌లో రాజీనామాల పర్వం
- టీడీపీ శ్రేణుల్లో అయోమయం
- వైఎస్సార్‌సీపీకి ‘సమైక్య’ బలం
కేంద్రంలోని యూపీఏ సర్కార్ అనుకున్నంత పనిచేసింది.. తెలుగు రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా నిలువునా చీల్చింది.. ఈ చర్యపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది.. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల ముందుకు వెళ్లడం ఎలా? రానున్న ఎన్నికలను ఎదుర్కోవడం ఎలా? అనే సంశయం కాంగ్రెస్, టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది.
సాక్షి, మచిలీపట్నం : రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో ఆమోదించడంతో ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలను ఎదుర్కొనేందుకు జిల్లాలోని కాంగ్రెస్, టీడీపీ నేతలు సిద్ధంగా లేరు. రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను పూర్తిచేసే మిషతో మరో ఆరు నెలలపాటు అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలన్న ప్రతిపాదనను అధికార పార్టీ తెరపైకి తెచ్చింది. అదే జరిగితే షెడ్యుల్ ప్రకారం లోక్‌సభ ఎన్నికలను నిర్వహించి, అసెంబ్లీ ఎన్నికలకు మరికొంత గడువు ఇచ్చే అవకాశం ఉందని జిల్లాలోని అధికార కాంగ్రెస్, టీడీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. సమైక్యాంధ్ర కోసం పోరాడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజాభిమానం తమకు అండగా ఉంటుందన్న ధీమా వ్యక్తం చేస్తోంది.
అధికారులు సిద్ధం!
ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధమేనా? అనే ప్రశ్న ఎన్నికల కమిషన్, రాజకీయ పార్టీలు, ప్రజలను వెంటాడుతోంది. అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుపుతామని ఎలక్షన్ కమిషన్ ప్రకటిస్తున్నప్పటికీ తాజా పరిణామాల నేపథ్యంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా జరిగే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. మరోపక్క ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, ఎస్పీ జె.ప్రభాకరరావు ఇతర ముఖ్య అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ పలు పర్యాయాలు వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి ఎన్నికలు సజావుగా నిర్వహించేలా సూచనలు చేశారు. కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల తుది జాబితా ఖరారు, ఎన్నికల బదిలీల ప్రక్రియను పూర్తి చేశారు. మార్చి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని చెబుతున్నారు.
‘రిక్త హస్త’మేనా..!
తొలి నుంచి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విభజనకు అత్యుత్సాహం చూపడంతో జిల్లాలో ఆ పార్టీకి నూకలు చెల్లినట్టేనని నేతలు కలవరపడుతున్నారు. ఎంపీ లగడపాటి రాజగోపాల్ సమైక్యవాదిగా వేసిన ఎత్తులు అనుకూలించలేదు. లోక్‌సభలో పెప్పర్ స్ప్రే చేసిన లగడపాటి తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. తనకు పరిస్థితి అనుకూలించకపోవడంతో రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్టు ప్రకటించిన లగడపాటి ఎంతవరకు మాటపై నిలబడతారో వేచి చూడాల్సిందే. జిల్లాలో ఏకైక మంత్రి కొలుసు పార్థసారధి తాను సమైక్యవాదినేని చెబుతూనే పదవిని పట్టుకుని వేలాడుతూ వచ్చారు. ప్రస్తుత పరిస్థితిలో ఆయన సీఎం కిరణ్‌తో కలిసి తన పదవికి రాజీనామా చేసి రాజకీయ భవిష్యత్ కోసం వ్యూహాలు రచించే పనిలో పడ్డారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే దిరిశం పద్మజ్యోతి పార్టీ సభ్యత్వానికి రాజీనామా ప్రకటించి మరో పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
అధికార భాషా సంఘం చైర్మన్ మండలి బుద్ధప్రసాద్, మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ, గన్నవరం మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వారి రాజీనామాలు ఆమోదించాల్సి ఉంది. జిల్లాలో మిగిలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, డీవై దాసు తమ రాజకీయ భవితపై మేధోమథనం చేస్తున్నారు. పలువురు కీలక నేతలు సైతం ఇదే పార్టీలో ఉంటే తమ రాజకీయ భవితవ్యం ఇక ముగిసిపోయినట్టేననే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేశారన్న అపవాదును మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో దాదాపు నూకలు చెల్లిపోయినట్టేనని, ఇటువంటి తరుణంలో ఎన్నికలను ఎదుర్కోవడం పార్టీకి ఇబ్బందేనని ఆ పార్టీ వర్గాలే ఆందోళన చెందుతున్నాయి.
పారని ఎత్తులు.. పొడవని పొత్తులు
రెండు కళ్ల సిద్ధాంతంతో రెండు ప్రాంతాల్లోను వేగం పుంజుకుంటుందనుకున్న సైకిల్ రెండు చక్రాలకు గాలిపోయే పరిస్థితి వచ్చిందని టీడీపీ శ్రేణులు కలవరపడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీకి కూడా ఇప్పుడు ఎన్నికల భయం వెంటాడుతోంది. విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి తెలంగాణలో ఒకమాట, సీమాంధ్రలో మరోమాట చెబుతూ వచ్చిన చంద్రబాబు ఎత్తులు ఈసారి ఎన్నికల్లో బెడిసికొట్టే ప్రమాదం ఉందని ఆ పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. మోడీ ఇమేజ్‌ను చూసి బీజేపీతో పొత్తు పెట్టుకుని లబ్ధి పొందుదామనుకున్న టీడీపీకి పొత్తుల పొద్దు బెడిసికొట్టేలా ఉంది.
బీజేపీతో పొత్తు వల్ల ముస్లిం మైనార్టీల ఓట్లు పోగొట్టుకోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్న తరుణంలో విభజనకు కాంగ్రెస్‌తో కుమ్మక్కైన బీజేపీతో చెలిమి మరింత ముంచుతుందని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. టీడీపీ మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు లోక్‌సభలో గుండెపోటుకు గురికావడం, ముంబైలోని ఆస్పత్రిలో బైపాస్ సర్జరీ చేయడంతో ఆయన వాణి జిల్లాలో వినిపించడానికి మరికొద్ది రోజులు పడుతుంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావును ఇప్పటికే వర్గవిభేదాలు చుట్టుముట్టాయి.
ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేశారు. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు తన పదవికి రాజీనామా ప్రకటించారు. మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు అంబటి శ్రీహరిప్రసాద్ (అవనిగడ్డ), శ్రీరాం తాతయ్య (జగ్గయ్యపేట), జయమంగళ వెంకటరమణ (కైకలూరు) తమ రాజకీయ భవిష్యత్‌పై మల్లగుల్లాలు పడుతున్నారు.
పట్టు పెంచిన వైఎస్సార్‌సీపీ
తొలి నుంచి తమ నినాదం సమైక్యమేనని తేటతెల్లం చేస్తూ వచ్చిన వైఎస్సార్‌సీపీ జిల్లాలో మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఓట్లు, సీట్లు గురించి ఆలోచించకుండా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమైక్య చాంపియన్‌గా నిలిచారు. జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుతో ఎప్పటికప్పుడు సమైక్య ఉద్యమాన్ని నడపడంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు వైఎస్ కుటుంబానికి అండగా ఉండేందుకు గతంలోనే టీడీపీ నుంచి కొడాలి నాని, కాంగ్రెస్ నుంచి పేర్ని నాని, జోగి రమేష్‌లు వైఎస్సార్‌సీపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికలు ఎప్పుడు జరిగినా అన్ని నియోజకవర్గాల్లోను సత్తా చాటుతామని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఉత్సాహంగా కదులుతున్నాయి.