చిత్తూరు(జిల్లాపరిషత్), న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలోని ఉద్యోగులు ఈ నెల 21వ తేదీలోపు సమర్పించిన బిల్లులను పాస్ చేశారని, ఇంకా ఏమైనా బిల్లులు ఉంటే సోమవారం సాయంత్రానికి పాస్ చేయనున్నట్టు జిల్లా ఖజానాధికారి పాలేశ్వరరావు తెలిపారు. దీనికి సంబంధించి రాష్ట్ర ఖజానాశాఖ సంచాలకులు శనివారం ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. ప్రధానంగా ఉద్యోగులు, పెన్షన్‌దారులకు రావాల్సిన డీఏ బకాయిలు (జనవరి నుంచి ఏప్రిల్ వరకు), మే నెల జీతం, పెన్షన్, ఉద్యోగులకు జూన్ 1వ తేదీ జీతం బిల్లులను విడివిడిగా పాస్ చేసినట్టు ఆయన తెలిపారు.
శనివారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జూన్ 2వ తేదీ నుంచి ఉద్యోగులు, పెన్షన్‌దారులు కొత్త రాష్ట్రం పరిధిలోకి వస్తున్నందున గవర్నర్ ఆదేశాల మేరకు 24వ తేదీ నాటికి చెల్లించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించి ఖజానాలతో సంబంధం ఉన్న బ్యాంకులు శనివారం సాయంత్రం వరకు పనిచేశాయన్నారు. జిల్లా వ్యాప్తంగా చిత్తూరు, తిరుపతి, మదనపల్లెతో కలుపుకుని 18 ఖజానా కార్యాలయాల్లో 20 వేలకు పైగా బిల్లులను పాస్ చేసినట్టు పేర్కొన్నారు.
రిటైర్మెంట్ క్లెయిమ్‌లను 31లోపు సమర్పించాలి
జిల్లాలో పనిచేస్తూ గత నెలలో, ఈ నెల 31వ తేదీలోపు ఉద్యోగ విరమణ చేయనున్న ఉద్యోగులు వారికి రావాల్సిన సంపాదిత సెలవులు, గ్రాట్యుటీ, పీఎఫ్, సీపీఎస్ తదితర బిల్లులన్నింటినీ ఈ నెల 31వ తేదీ నాటికి సమర్పించాలని జిల్లా ఖజానాధికారి, డీడీ(ఉపసంచాలకులు) కోరారు. ఆ తరువాత సమర్పిస్తే అంగీకరించేది లేదన్నారు. లాంగ్ పెండింగ్ ఏసీ బిల్లు సబ్‌మిట్ చేసి డీసీ బిల్లు ఇవ్వని సంబంధిత డీడీవోలకు జీతాలు నిలిపివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు.
జీవో నం.94 ప్రకారం ఆర్థికశాఖ కేటాయించిన సొమ్ము పీడీ అకౌంట్‌లో ఉన్నందున దానిని తిరిగి ప్రభుత్వ ఖాతాకు బదిలీ చేయాలన్నారు. ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు ఇచ్చే చెక్కులు 31వతేదీ లోపు మాత్రమే చెల్లుబాటు అవుతాయని ఆయన పేర్కొన్నారు.
జీతాలు, పింఛను బిల్లుల చెల్లింపు
Published Sun, May 25 2014 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 7:48 AM
Advertisement