ఆర్‌టీసీ సర్వీసులకు బ్రేక్! | rtc bus cancelled to telangana areas | Sakshi
Sakshi News home page

ఆర్‌టీసీ సర్వీసులకు బ్రేక్!

Published Wed, Jun 4 2014 1:55 AM | Last Updated on Sat, Sep 2 2017 8:16 AM

rtc bus cancelled to telangana areas

కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్:  రాష్ట్ర విభజన నేపథ్యంలో కర్నూలుతో తెలంగాణ ప్రాంత గ్రామాలకు ఉన్న బస్సు బంధ తెగనుంది. ముఖ్యంగా జిల్లా కేంద్రం కర్నూలుకు ఆనుకొని ఉన్న పల్లెలకు రవాణా వ్యవస్థ మందగించనుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో రాబోవు రోజుల్లో ఆర్టీసీ కూడా రెండు ముక్కలు కానుంది. ఈనేపథ్యంలో ఆప్రాంత గ్రామాలకు సర్వీసులు తిప్పలేమని స్థానిక అధికారులు ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. ఒక వేళ బస్సులు తిప్పాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ట్యాక్స్, పర్మిట్లకు డబ్బు చెల్లించాల్సి వస్తుందని, ఇది సంస్థకు భారం కానుందని మొరపెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆ రాష్ట్ర ప్రయాణికుల  అవసరాలకు తగ్గట్టు ఆ ప్రభుత్వమే తమ బస్సులు నడుపుకోవచ్చని సూచించారు.  అమలుచేస్తే తెలంగాణ ప్రాంతంలోని గ్రామాలకు తిరిగే 51 బస్సుల వరకు ఆగిపోనున్నాయి.

 ప్రస్తుతం తిరుగుతున్న సర్వీసులు:
 తెలంగాణ అంచున ఉన్న కర్నూలు జిల్లాకు ఆప్రాంతం గ్రామాలతో మంచి అనుబంధం ఉంది. రోజూ వేలాది మంది కర్నూలు రీజియన్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. రాజధాని హైదరాబాద్‌తోపాటు కొల్లాపూరు, అయిజా, రాజోలి మీదుగా రాయచూరు తదితర ప్రాంతాలకు రోజూ 131 బస్సులు తిరుగుతున్నాయి. ఇందులో కేవలం హైదరాబాదుకే 100 సర్వీసులు కాగా కొల్లాపూరుకు 7, అలంపూరు, భీమవరం, పల్లెపాడు, మారమునగాల, చెన్నుపాడు, మానపాడు, శింగవరం, గొందిమల్ల గ్రామాలకు 14 బస్సులు, అయిజ, మినిపాడు, రాజోళి తదితర గ్రామాలకు మరో 6 బస్సులు తిరుగుతున్నాయి.  

 రద్దుకు ప్రతిపాదించిన సర్వీసులు:
 రాష్ట్ర విభజన నేపథ్యంలో మొదటి విడతగా 51 సర్వీసులను రద్దు చేసేందుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు.    అనుమతులు వస్తే హైదరాబాద్‌కు తిరిగే 20 బస్సులను రద్దు చేసి విజయవాడ, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు తదితర రూట్లలో తిప్పనున్నారు. కర్నూలు-1 డిపో నుంచి తిరిగే 20 సర్వీసులను రద్దు చేసి గడివేముల, వెల్దూర్తి, బేతంచెర్ల, పత్తికొండ, ఎమ్మిగనూరు (గూడూరు మీదుగా) తిప్పనున్నారు.

ఇందులో కాలం చెల్లిన పాత బస్సులను స్క్రాప్ యార్డుకు పంపనున్నారు. ఆత్మకూరు డిపోకు చెందిన 11 బస్సులు మహబూబ్ నగర్ జిల్లా కోల్లాపూరుకు తిరుగుతున్నాయి. వీటన్నింటినీ రద్దు చేయనున్నారు. ఇందులోని 6 అద్దె బస్సులను కర్నూలు, ఆత్మకూరు మధ్య తిప్పి మిగిలిన సర్వీసులను ఎమ్మిగనూరు నుంచి బళ్లారి, కర్నూలు నుంచి సుంకేసుల మీదుగా మంత్రాలయంకు , డోన్ నుంచి బేతంచెర్ల మీదుగా నంద్యాలకు, ఆళ్లగడ్డ- ప్రొద్దుటూరు, నంద్యాల - రుద్రవరం, నందికొట్కూరు నుంచి గడివేముల మీదుగా నంద్యాలకు, బనగానపల్లె - నంద్యాల మధ్య నడపనున్నారు.

 విద్యార్థులకు తప్పని కష్టాలు:
 తెలంగాణ ప్రాంత పల్లెల నుంచి ప్రతిరోజూ వేలాది మంది విద్యార్థులు ఇక్కడి విద్యాసంస్థల్లో చదువుకునేందుకు వచ్చిపోతుంటారు. వీరంతా ప్రభుత్వం ఇచ్చిన రాయితీ బస్సు పాసులు తీసుకొని రాకపోకలు సాగిస్తున్నారు. వీరిలో 1000 మందికి పైగా ఉచిత పాసులు, 1500 మందికి పైగా రాయితీ పాసులు పొందిన వారున్నారు. ఈ విద్యార్థులంతా ప్రస్తుతం కొత్త బస్టాండ్‌లోని కర్నూలు-1డిపోలో పాసులు పొందుతున్నారు. ఒక వేళ సర్వీసుల రద్దయితే తెలంగాణ డిపోల బస్సులు తిప్పుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రస్తుతం కర్నూలుకు చేరువలో ఉన్న గద్వాల, వనపర్తి డిపోలకు వెళ్లి పాసులు పొందాలి. దీంతో విద్యార్థులకు ప్రయాణ కష్టాలు మొదలైతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement