సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : వరుస ఎన్నికలు.. రాష్ట్ర విభజన ప్రక్రియ నేపథ్యంలో ఇన్నాళ్లూ కార్యాలయాలకే పరిమితమైన అధికారగణం ఇక పల్లెబాట పట్టనుంది. గ్రామాల్లో అవసరాలను, ప్రాధామ్యాలను మదింపు చేయనుంది. ప్రజలతో మమేకమై పల్లె సర్వోతముఖాభివృద్ధికి సరికొత్త ప్రణాళికలు రూపొందించేందుకు సిద్ధమవుతోంది. ‘మన ఊరు-మన ప్రణాళిక’ పేరున సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈనెల 17వ తేదీలోపు గ్రామాల ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించింది.
సోమవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్‌ఆర్‌డీ)లో జిల్లా కలెక్టర్లు, కీలకశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. దీనికి హాజరైన కలెక్టర్ ఎన్.శ్రీధర్ సమావేశ వివరాలను ‘సాక్షి’కి వివరించారు. ఈ నెల 12 నుంచి 17వ తేదీ వరకూ గ్రామాలవారీగా పర్యటించి ప్లాన్‌లు తయారుచేస్తామని చెప్పారు. 22వ తేదీలోపు మండల స్థాయి, 27వ తేదీలోపు జిల్లాస్థాయి ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించాలని సర్కారు ఆదేశించినట్లు తెలిపారు.
త్వరలో రాష్ట్ర స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తామని, దీనిపై ఆగస్టులో జరిగే శాసనసభ బడ్జెట్ సమావేశంలో చర్చించి నిధులు కేటాయించనున్నట్లు సీఎం స్పష్టం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామాల అవసరాలను ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారయంత్రాంగం చర్చించి ఐదేళ్ల కార్యాచరణ రూపొందించాలని సూచించినట్లు తెలిపారు. గతంలో నిధుల కేటాయింపునకు అనుగుణంగా ప్రణాళికలు తయారు చేసేవారమని, ఇకపై ప్రణాళికబద్ధంగా నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు శ్రీధర్ వివరిం చారు. జిల్లాలో ఆయా సంస్థలకు కేటాయించిన భూముల్లో 10,900 ఎకరాలు నిరుపయోగంగా ఉన్నట్లు గుర్తించామని, అలాగే మరో 8వేల ఎకరాల భూమి కూడా పరిశ్రమలకు తక్షణ కేటాయింపులకు వీలుగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలిపినట్లు శ్రీధర్ స్పష్టం చేశారు.
ఇక పల్లె ప్రణాళిక
Published Mon, Jul 7 2014 11:36 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement