దేవేందర్ ఎంపీ @ ఏపీ
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రాజ్యసభ సభ్యుడు టి.దేవేందర్‌గౌడ్ ఇకపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజ్యసభ సభ్యులను కూడా ఇరు రాష్ట్రాలకు కేటాయించారు. లాటరీ ప్రాతిపదికన రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ ఈ కేటాయింపులను జరిపారు. దీంతో మన జిల్లాకు చెందిన దేవేందర్ ఆంధ్ర కోటాలో చేరిపోయారు. అలాగే జిల్లాను ఎంపిక చేసుకున్న వై సుజనా చౌదరిని కూడా ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. తెలంగాణకు చెందిన వీరిరువురేగాకుండా మరికొందరు కూడా ఆంధ్రకు, అక్కడివారిలో కొందరు తెలంగాణకు లాట రీలో ఎంపికయ్యారు. అయితే, వేర్వేరు రాష్ట్రాలకు వీరిని కేటాయించినా.. నిధుల కేటాయింపు, నోడల్ జిల్లా ఎంపికలో వీరికి పూర్తి స్వేచ్ఛనివ్వడం ఊరట కలిగించే అంశం.