సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: భూముల విలువల పెంపుపై ప్రభుత్వం పునరాలోచన చేస్తోంది. స్థిరాస్తిరంగం ఒడిదొడుకులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచాలనే నిర్ణయంపై వెనక్కి తగ్గుతోంది. రాష్ట్ర విభజన అనంతరం జిల్లా లో భూముల క్రయవిక్రయాలు మందగించాయి. ముఖ్యంగా నగర శివార్లలో దీని ప్రభావం గణ నీయంగా ఉంది. కేవలం ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు మాత్రమే నమోదవుతున్నాయి. దీంతో గత ఏడాదితో పోలిస్తే ఈ సారి రిజిస్ట్రేషన్ల సంఖ్య బాగా పడిపోయింది. 2013 జనవరి -ఏప్రిల్ వరకు 1,02,714 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా.. రూ.698.31 కోట్ల ఆదాయం సమకూరింది.
ఈ ఏడాది ఇదే కాలానికి 62,106 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా.. రూ.425.05 కోట్ల రాబడి మాత్రమే వచ్చింది. తెలంగాణ బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర వేయడంతో దాని ప్రభావం రిజిస్ట్రేషన్లపై కనిపించింది. అయితే, సాధారణంగా ప్రతి ఆగస్టులో భూముల ధరలను ప్రభుత్వం సవరిస్తోంది. ఈ నే పథ్యంలోనే ఈసారి కూడా ఈ కసరత్తును పూర్తి చేసింది. కాస్తో కూస్తో రియల్ బూమ్ ఉన్న ప్రాంతాల్లో 15 నుంచి 20శాతం మేర విలువలను హెచ్చింపు చేసేలా జిల్లా రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదనలు రూపొందించింది.
మారుమూల ప్రదేశాల్లో ధరలు పెంపు జోలికి వెళ్లకుండా ఆదిబట్ల, ఘట్‌కేసర్, మంచిరేవుల, నార్సింగి, శంషాబాద్, మహేశ్వరం ప్రాంతాల్లో కనిష్టంగా విలువను పెంచాలనే నిర్ణయానికి వచ్చింది. స్థలాలు ముఖ్యంగా ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు ఎక్కువగా రిజిస్టర్ అవుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో కొంత మేర ధరలను సవరించాలని జిల్లా యంత్రాంగం భావించింది.
ఈ మేరకు ఇటీవల జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీ దాదాపుగా నిర్ణయం కూడా తీసుకుంది. అయితే, రాష్ట్ర విభజన అనంతరం రియల్‌రంగంలో ప్రతిష్టంభన నెలకొన్న తరుణంలో భూముల విలువలు పెంచడం సరికాదనే భావనకు సర్కారు వచ్చినట్లు తెలుస్తోంది. మార్కెట్ కుదుటపడేవరకు రిజిస్ట్రేషన్ చార్జీల హెచ్చింపు జోలికి వెళ్లకపోవడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చింది. ఇదే అంశాన్ని రిజిస్ట్రేషన్ల శాఖకు స్పష్టం చేసింది. దీంతో ఈసారి భూముల విలువ వడ్డింపు ఉండకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది.
భూముల విలువ పెంపుపై పునరాలోచిస్తున్న సర్కారు
Published Thu, Jul 24 2014 11:54 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement