రియల్‌ఎస్టేట్ నేల చూపులు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: స్థిరాస్తి రంగంపై రాష్ట్ర విభజన అంశం తీవ్ర ప్రభావం చూపింది. భూముల క్రయ విక్రయాలు, బహుళ అంతస్తుల నిర్మాణాలతో వెలుగువెలిగిన జిల్లా ప్రస్తుతం వెలవెలబోతోంది. రియల్‌ఎస్టేట్ వ్యాపారులు, కొనుగోలుదారులతో కళకళలాడిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కూడా బోసిపోయి కనిపిస్తున్నాయి. తెలంగాణ బిల్లు అంశం తెరమీదకు వచ్చిందే తడవు జిల్లాలో రియల్టీ రంగం పల్టీలు కొట్టడం ప్రారంభమైంది. ప్రత్యేక రాష్ర్ట ఉద్యమం నేపథ్యంలో 2005 నుంచి ఆనేక ఒడిదొడుకులను ఎదుర్కొన్న స్థిరాస్తి వ్యాపారం.. 2013 ఆరంభంలో కొంత పుంజుకుంది. ఊహించనిరీతిలో యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజనకు మొగ్గు చూపడమే తరువాయి మళ్లీ రియల్ బూమ్ ఢామ్ అయ్యింది.
రాష్ర్ట ఖజానాకు ఆదాయార్జన శాఖల్లో ఒక్కటైన రిజిస్ట్రేషన్ల శాఖ... భూముల క్రయవిక్రయాలు తగ్గిపోవడంతో నిర్దేశిత లక్ష్యాల సాధనలో చతికిలపడింది. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో రియల్టీ రంగం పూర్వవైభవం సాధించడం కష్టంగానే కనిపిస్తోంది. ఐటీ కంపెనీలు, బహుళ జాతి సంస్థల రాకతో గతంలో నగర శివార్లలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇదే క్రమంలో బడా బిల్డర్లు కూడా కొత్త ప్రాజెక్టులను నగర శివార్లలో చేపట్టేందుకు మొగ్గు చూపారు. దీంతో స్థలాల విలువ అనూహ్యంగా పెరిగింది. సొంతింటి కలలు కన్న సామాన్య, వేతన జీవుల ఆశలపై ఆకాశాన్నంటిన భూములు, ఫ్లాట్‌ల ధరలు నీళ్లు జల్లాయి. ఈ క్రమంలోనే గతేడాది జూన్‌లో తెలంగాణ బిల్లును కేంద్రం కదిలించేదే తడువు... రిజిస్ట్రేషన్ల సంఖ్య దారుణంగా పడిపోయింది.
కాగా ఆదిబట్ల, అప్పా, నార్సింగి జంక్షన్లు సహా ఐటీఐఆర్ ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రాంతాల్లో మాత్రం కొద్దిమేర స్థలాల కొనుగోళ్లు సాగుతున్నాయి. భవిష్యత్తులో ఇక్కడ ఐటీ కంపెనీలు వచ్చే అవకాశాలు మెండుగా ఉండడంతో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. మిగతా ప్రాంతాల్లో మాత్రం రియల్ రంగం ఆటుపోట్లను ఎదుర్కొంటోంది.
ఈ ఏడాది ఢామ్!
జిల్లాలో గతేడాది జనవరి-ఏప్రిల్ వరకు 1,02,714 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా.. రూ.698.31 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది ఇదే కాలానికి 62,106 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా...రూ.425.05 కోట్ల రాబడి మాత్రమే వచ్చింది. అంటే 2013 తొలి నాలుగు నెలలతో పోలిస్తే 39.13 శాతం ఆదాయం తగ్గిపోయిందన్నమాట. జిల్లాలోని రంగారెడ్డి, రంగారెడ్డి తూర్పు రిజిస్ట్రేషన్ శాఖల్లో 2013 జనవరి కంటే ఈ సారి 24.05 శాతం రాబడి పడిపోయింది. అలాగే ఫిబ్రవరిలో 21.99 శాతం తగ్గింది. ఇదే నెలలో తెలంగాణ బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర వేయడంతో దీని ప్రభావం మార్చి నెలపై స్పష్టంగా కనిపించింది. గత ఏడాది మార్చిలో రూ.313.84 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది మార్చిలో కేవలం రూ.121.12 కోట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ల శాఖ ఆర్జించింది.
కేవలం ఈ ఒక్కనెలలోనే 61.40 శాతం రాబడిలో తేడా రావడం గమనార్హం. రాష్ర్ట విభజన ప్రక్రియ దాదాపుగా పూర్తికావడం, అపాయింటెడ్ డే కూడా సమీపిస్తుండడంతో స్థిరాస్తి రంగం మరింత కుదేలయ్యే అవకాశంలేకపోలేదు. వాస్తవానికి నగర శివార్లలో అత్యధికంగా తెలంగాణేతరులే ప్లాట్లను కొనుగోలు చేశారు.
దీంట్లో వ్యాపారవేత్తలు, ఉద్యోగులేగాకుండా.. వివిధ రంగాల్లో స్థిరపడ్డ ఆనేకులు ఇక్కడ భూముల్లో పెట్టుబడులు పెట్టారు. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లాలో రియల్టీ రంగం మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరించింది. దీంతో జిల్లాలో చాలామంది రియల్టర్లుగా, బ్రోకర్లుగా అవతారమెత్తారు. వారి జీవన ప్రమాణాల్లో మార్పులు వచ్చాయి. తాజాగా ఈ రంగం ఢమాల్ అనడంతో వీరు దిగాలు చెందుతున్నారు.
అయితే, సామాన్యులు మాత్రం పెరిగిన ధరల్లో స్థిరత్వం వస్తుందనే భరోసాతో ఉన్నారు. మరోవైపు రియల్ ఎస్టేట్ రంగానికి జవసత్వాలు కల్పించి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని టీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో కొంత భరోసా కలుగుతున్నా... సీమాంధ్ర రాజధానిలో పెట్టుబడులు పెట్టే దిశగా వ్యాపారవేత్తలు ఆలోచనలు సాగిస్తుండడం ఇక్కడి రియల్టర్లను కలవరపరుస్తోంది.