Real Estate Traders
-
Hyderabad: తవ్వినకొద్దీ తల్లీకూతుళ్ల లీలలు
బంజారాహిల్స్: రియల్ ఎస్టేట్ వ్యాపారి పుట్టా రాము హత్య కేసులో నిందితులైన తల్లీకూతుళ్లు హిమాంబీ, నసీమా లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తల్లీ కూతుళ్ల అరాచకాలకు చాలామంది బలికాగా, ప్రస్తుతం వ్యభిచార గృహం నిర్వహిస్తున్న నిందితురాలు హిమాంబీ ఆ ఇంటిని దౌర్జన్యంగా ఆక్రమించి యజమానిపై తప్పుడు కేసులు బనాయించింది. ఇటువైపు తొంగిచూస్తే తమపై అత్యాచారం చేశావంటూ కేసు పెడతానని బెదిరిస్తుండడంతో ఇంటి యజమాని అటువైపు తొంగి చూడడం లేదు. ఇదే అదనుగా హిమాంబీ, ఆమె కూతురు నసీమా ఇద్దరూ ఈ ఇంటిని వ్యభిచార కూపంగా మార్చారు. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని యూసుఫ్‌గూడ ఎల్‌ఎన్‌నగర్‌లో ఇటీవల రియల్టర్ పుట్టా రామును 11 మంది కత్తులతో దాడి చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. నసీమా హనీట్రాప్ చేసి రామును ఇంటికి పిలిపించి ఈ విషయాన్ని ప్రధాన నిందితుడు మణికంఠకు మెసేజ్ చేసి హత్య కుట్ర కారణమై జైలు పాలైంది. హిమాంబీపై ఇప్పటికే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మేడిపల్లి తదితర పోలీస్స్టేషన్లలో ఐదు ఎఫ్ఐఆర్లు నమోదై ఉన్నాయి. బెయిల్‌పై వస్తూ.. 2017 జూన్‌లో హిమాంబీ.. ఓ యువతితో వ్యభిచారం చేయిస్తూ బంజారాహిల్స్ పోలీసులకు పట్టుబడింది. 2018లో మరో అమ్మాయితోనూ వ్యభిచారం చేయిస్తూ అరెస్టయ్యింది. 2020లో జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరిలో వ్యభిచార గృహంపై దాడి చేయగా పోలీసులకు మరోసారి పట్టుబడింది. 2017లో విష్ణుకాంత్ అనే వ్యక్తి నుంచి బ్లాక్మెయిల్ చేసి రూ.3 లక్షలు వసూలు చేసింది. 2019లో తన కూతురు నసీమాను రాజు అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడంటూ తప్పుడు కేసు పెట్టింది. పోలీసులకు పట్టుబడిన ప్రతిసారీ బెయిల్‌పై వస్తూ.. కూతురు నసీమాను ఎరగా వేసి ఏడేళ్లుగా హిమాంబీ స్థానికంగా అరాచకాలకు, బ్లాక్మెయిల్ వ్యవహారాలకు, కుట్రలు, కుతంత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. కానిస్టేబుల్‌పైనే కేసులు పెట్టించి.. ఓ కానిస్టేబుల్‌కు చెందిన ఈ ఇంటిని అద్దెకు తీసుకుని అతడిపైనా తప్పుడు కేసులు పెట్టి బ్లాక్మెయిల్ చేసింది. ఇంటిని ఖాళీ చేయించాలంటూ కోర్టు ఆర్డర్ ఉన్నా హిమాంబీ పట్టించుకోకుండా పోలీసుల పైనే తిరగబడింది. మహిళ కావడంతో పోలీసులు కూడా ఆచితూచి వ్యవహరిస్తూ తమకెందుకులే అని పెద్దగా పట్టించుకోకపోవడంతో హిమాంబీ అరాచకాలు రోజురోజుకు పెరిగిపోయాయి. ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి కబ్జా చేసిన ఇంట్లోనే దర్జాగా వ్యభిచార గృహాన్ని నిర్వహించింది. పుట్టా రాము హత్యతో తల్లీకూతుళ్ల గుట్టు రట్టయ్యింది. -
రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య
కరీంనగర్: రామగుండం ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్ పరిధి, కార్పొరేషన్ 39వ డివిజన్ ఖాజీపల్లికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మేకల లింగయ్య సోమవారం రాత్రి దారుణహత్యకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. లింగయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని సమస్యాత్మక భూములను కొంటూ.. వాటిని పరిష్కరించి.. విక్రయాలు చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలోని ఓ భూమి విషయంలో లింగయ్యకు.. మరికొందరికి వివాదం తలెత్తినట్లు సమాచారం. ఈ క్రమంలో లింగయ్య రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయంలో పెంపుడు కుక్కతో ప్రధాన రహదారి నుంచి పవర్‌ప్లాంట్‌కు వెళ్లే దారిలో వాకింగ్ చేస్తున్నారు. అప్పటికే మాటువేసిన దుండగులు లింగయ్యపై వేట కొడవళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న గోదావరిఖని ఏసీపీ తుల శ్రీనివాస్, రామగుండం సీఐ చంద్రశేఖర్ గౌడ్, ఎన్టీపీసీ ఎస్సై జీవన్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కృష్ణాష్టమి రోజే హత్యకు ప్లాన్..? లింగయ్యను హత్య చేసేందుకు నిందితులు కృష్ణాష్టమి రోజే ప్రత్యర్థులు ప్రయత్నించి విఫలమైనట్లు తెలుస్తోంది. అనంతరం వినాయక చవితి పండుగపూట రోడ్లపై ఎవరూ ఉండరని, హత్యకు అదే అనువైన సమయమని దుండగులు భావించినట్లు సమాచారం. సుమారు 12 రోజులపాటు గస్తీ నిర్వహించి.. వాకింగ్‌కు వెళ్లే సమయం అనుకూలమని నిందితులు నిర్ధారించుకుని పక్కా ప్లాన్ ప్రకారమే రాత్రి సమయంలో లింగయ్య వాకింగ్ చేస్తుండగా.. వేట కొడవళ్లతో దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. నాడు అన్న.. నేడు తమ్ముడు ఖాజీపల్లికి చెందిన మేకల లింగయ్యతో కలిపి ఐదుగురు అన్నదమ్ములు. లింగయ్య అన్న రాజయ్య 1991 ఏప్రిల్ 4న పొలం పనులకు వెళ్లి ఇంటికొస్తుండగా ఇంటి సమీపంలోనే ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేశారు. కుటుంబంలో చిన్నవాడైన మేకల లింగయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. తాజాగా అతడి హత్య జరిగిన 32 ఏళ్ల తర్వాత లింగయ్యను కూడా అలాగే హతమార్చడం స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీస్ పహారా మధ్య ఖాజీపల్లి లింగయ్య హత్యలో ఓ అనుమానితుడి ఇంటి ప్రహరీని లింగయ్య కుటుంబసభ్యులు కూల్చివేశారు. దీంతో ఖాజీపల్లిలో పోలీసులు భారీగా మోహరించారు. లింగయ్య అంత్యక్రియల సమయంలోనూ గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పహారా కొనసాగించారు. డాగ్‌స్క్వాడ్‌తో దర్యాప్తు చేస్తున్నారు. భూ వివాదాలే హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. బాధితుడి కూతురు మేకల సుప్రజ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితుల కోసం ప్రత్యేక బలగాలు గాలింపు చేపడుతున్నట్టు పోలీసులు తెలిపారు. -
మంగళగిరిలో భూకబ్జా.. రూ.15 కోట్ల భూమిపై రియల్టర్లు, టీడీపీ నాయకుల కన్ను
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద జాతీయరహదారి వెంట ఖాళీగా ఉన్న భూములపై కబ్జాదారులు పంజా విసురుతున్నారు. నకిలీ పత్రాలు తయారుచేసి ఆ భూముల్ని అమ్మేస్తున్నారు. తాజాగా నకిలీ పత్రాలతో భూమి అమ్ముతున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై భూమి యజమాని పోలీసుల్ని ఆశ్రయించారు. నగరంలో జాతీయరహదారి వెంబడి ఉన్న శ్రీకృష్ణచైతన్య వృద్ధాశ్రమానికి దగ్గరలో 123/1 సర్వే నంబరులో 67 సెంట్ల భూమి కొన్నేళ్లుగా ఖాళీగా ఉంది. సుమారు రూ.15 కోట్ల విలువైన ఈ భూమిపై మంగళగిరికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, టీడీపీ నాయకుల కన్ను పడింది. నగరానికి చెందిన చంద్రమౌళి పేరు మీద నకిలీ దస్తావేజులు సృష్టించి అమ్మకానికి పెట్టారు. రూ.4.50 కోట్లకు కొనుగోలు చేసిన టీడీపీ నాయకుడు విశాఖపట్నం కి చెందిన తన అనుచరుడు కోటేశ్వరరావు పేరిట అగ్రిమెంట్ రాయించారు. అగ్రిమెంట్ అయిన వెంటనే భూమిని చదును చేసి మట్టి తోలసాగారు. దీంతో మంగళగిరికి చెందిన సాంబశివరావు ఆ భూమిని తాను కొనుగోలు చేశానని, తనకు అగ్రిమెంట్ ఉందని బయటకొచ్చారు. మొత్తం రూ.2.50 కోట్లు ఇస్తానని, భూమి ఖాళీ చేయాలని కోటేశ్వరరావుతో బేరాలాడసాగారు. ఈ విషయం తెలియడంతో ఆ భూమి అసలు యజమాని విజయవాడ వన్‌టౌన్‌కు చెందిన గిరీశ్ మంగళవారం రాత్రి ఆ భూమి వద్దకు చేరుకున్నారు. ఈ భూమి మీదేననే ఆధారాలు తీసుకురావాలని కోటేశ్వరరావు అనడంతో గిరీశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువర్గాలు ఆధారాలు తీసుకురావాలని పోలీసులు సూచించారు. తాను గురువారం రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నానని, తహసీల్దారుతోను, రిజిస్ట్రార్‌తోను మాట్లాడానని కోటేశ్వరరావు చెప్పారు. ఈ విషయమై తహసీల్దారును, రిజిస్ట్రార్‌ను అడగగా.. తమను రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించలేదని తెలిపారు. దస్తావేజులు, లింకు దస్తావేజులు, రెవెన్యూ రికార్డులు పరిశీలించి, పోలీసులు విచారణ అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సీఐ అంకమ్మరావును అడగగా.. స్థల వివాదంపై ఫిర్యాదు అందిందని తెలిపారు. తాను సెలవులో ఉన్నానని, విధులకు వచ్చి న తరువాత విచారించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
స్నేహితుడి వంచన... మందు కొట్టి మరీ రూ. 75 లక్షలు చోరీ
మలక్‌పేట: అర్థరాత్రి వరకు కలిసి మద్యం తాగి స్నేహితుని ఇంట్లో రూ. 75 లక్షల నగదు దోచుకెళ్లాడు ఓవ్యక్తి. ఈ సంఘటన శనివారం మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. రియల్ ఎస్టేట్ వ్యాపారి సాయిప్రకాశ్‌రెడ్డి మూసారంబాగ్ డివిజన్ సలీంనగర్ పద్మావతి రెసిడెన్సీలో ఉంటున్నాడు. గోవాలో ఉంటున్న అతని ఫ్రెండ్ ఫిరోజ్ ఈనెల 29న సలీంనగర్‌కు వచ్చాడు. ఇద్దరూ కలిసి ఇంట్లో మద్యం సేవించారు. తరువాత ఫిరోజ్ పబ్‌కి వెళ్దామని అంటే రాత్రి 10 గంటలకు కొత్తపేటలోని ఓ పబ్‌కి వెళ్ళారు. పబ్‌లో పాత ఫ్రెండ్ రాజేష్ కలిశాడు. రాత్రి 1.30 గంటలకు సాయిప్రకాశ్‌రెడ్డి, ఫిరోజ్, రాజేష్, రాజేష్ స్నేహితుడు నలుగురు కలిసి మద్యం తాగడానికి సలీంనగర్‌కు వచ్చారు. ఫిరోజ్ ఒక గదిలో పడుకున్నాడు. మిగిలిన ముగ్గురూ కలిసి హాల్లో మద్యం తాగుతుండగా.. రాజేష్ నిద్రవస్తుందని చెబితే సాయిప్రకాశ్‌రెడ్డి అతనిని మరొగదిలోకి తీసుకెళ్లి పడుకోమని చెప్పి వాష్‌రూమ్‌కు వెళ్లాడు. వాష్ రూమ్ నుంచి బయటికి వచ్చేసరికి మంచంపై ఖాళీ బ్యాగు పడి ఉండటాన్ని గమనించాడు. రాజేష్, అతని ఫ్రెండ్ ఇంట్లో లేరు. ఇంట్లో పెట్టిన రూ. 75 లక్షల నగదు ఉన్న బ్యాగ్ కన్పించలేదు. వెంటనే కిందకి వెళ్లి చూడగా రాజేష్ కనిపించాడు. అతన్ని ఆపి అడుగుతుండగా గేట్ దూకిపారిపోయాడు. భూమి అమ్మిన రూ.75 లక్షలు నల్లరంగు బ్యాగులో ఉండగా రాజేష రాజేష్ ఫ్రెండ్ దొంగతనం చేశారని బాధితుడు సాయిప్రకాశ్‌రెడ్డి శనివారం మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. (చదవండి: కళాశాల విద్యార్థికి ఉగ్రవాదులతో లింక్!) -
నిర్మల్‌లో రియల్టర్ కిడ్నాప్ కలకలం
నిర్మల్: నిర్మల్‌లో రియల్టర్ కిడ్నాప్ ఘటన ఆదివారం కలకలం సృష్టించింది. మంచిర్యాల రోడ్డులోని తన్వి అపార్ట్మెంట్ నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారిని కొందరు బలవంతంగా ఎత్తుకెళ్లగా నిర్మల్ పోలీసులు గంటల వ్యవధిలోనే కిడ్నాపర్ల ఆటకట్టించారు. సమస్యాత్మక భూములు, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే ఘటన జరిగినట్లు తెలుస్తోంది. నిర్మల్ డీఎస్పీ ఉపేంద్రరెడ్డి, పట్టణ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్‌లోని తన్వి అపార్ట్మెంట్లో ఉంటున్న విజయ్‌చందర్‌రావు దేశ్‌పాండే రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయన కుటుంబం హైదరాబాద్‌లో ఉంటుండగా, ఇక్కడ తల్లి వసుంధరరాణితో కలిసి ఉంటున్నారు. ఆయన ఉండే అపార్ట్‌మెంట్‌కు ఆదివారం ఉదయం 7.30 సమయంలో ఐదుగురు దుండగులు రెండు కార్లలో వచ్చారు. ఫ్లాట్‌నంబర్ 408లో ఉంటున్న విజయ్ను బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. పక్కఫ్లాట్లో ఉండే శ్రీకాంత్‌రావు అటకాయించగా, దుండగుల్లో ఒకరు ‘నా పేరు కృష్ణారావు, మాది సంగారెడ్డి. విజయ్ డబ్బులివ్వాలి. అందుకే తీసుకెళ్తున్నాం’అని చెప్పాడు. అనంతరం విజయ్ను బలవంతంగా తీసుకెళ్లి కారులో ఎక్కించుకుపోయారు. వెంబడించి పట్టుకుని.. బాధితుడి కుటుంబసభ్యుల ద్వారా సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాస్ సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు. టీఎస్15ఎఫ్బీ 1226, టీఎస్07హెచ్‌పీ 6365 నంబర్ల కార్లలో కిడ్నాపర్లు హైదరాబాద్ రోడ్డులో వెళ్తున్నట్లు తెలుసుకుని.. మెదక్ జిల్లా తూప్రాన్ సీఐకి సమాచారమిచ్చారు. అక్కడి పోలీసులు 44వ నంబర్ హైవే టోల్‌ప్లాజా వద్ద ఆపి కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. నిర్మల్ పోలీసులు అక్కడికి చేరుకున్నాక బాధితుడిని, దుండగులను అప్పగించారు. కృష్ణారావు, గన్ని కృష్ణ, సయ్యద్ అబ్దుల్‌ఖాదర్, యూసఫ్ సయ్యద్, మహమ్మద్ అబ్బాస్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వివరించారు. -
ఎకరాకే లేఅవుట్
భూ విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఇకపై లేఅవుట్లకు అనుమతినిచ్చే విషయమై హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) దృష్టి సారించింది. ఇందుకు అనుమతివ్వాలని కోరుతూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇందులో నియమ నిబంధనలు పాటిస్తూనే.. భూ విస్తీర్ణంతో సంబంధం లేకుండా అనుమతులు ఇవ్వడం వల్ల చిన్న రియల్టర్లు కూడా లే అవుట్స్ చేసుకొనే వెసులుబాటు కల్పించవచ్చని భావిస్తోంది. దీనివల్ల హెచ్ఎండీఏకు అనుమతుల రూపంలో వచ్చే ఆదాయం పెరగడమేగాక సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలకు సొంత ఇంటి కల నెరవేర్చవచ్చునని ప్రతిపాదనల్లో పేర్కొంది. ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి ప్రాథమికంగా సానుకూలత వ్యక్తం చేయడంతో ప్రభుత్వ స్థాయిలో కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. - భూ విస్తీర్ణంతో సంబంధం లేకుండా అనుమతులు - ప్రభుత్వ పరిశీలనలో హెచ్ఎండీఏ ప్రతిపాదన - సాధ్యాసాధ్యాలపై ఉన్నతాధికారుల కసరత్తు సాక్షి, హైదరాబాద్ హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం... ఒక ఓపెన్ లేఅవుట్‌ను అభివృద్ధి చేయాలంటే విధిగా 10 ఎకరాలు (4 హెక్టార్ల), ఆపైన భూ విస్తీర్ణం ఉండాలి. ఇందులో పార్కు, రోడ్లు, క్రీడా స్థలం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు (ఎమినిటీస్) 40శాతం భూమిని తప్పనిసరిగా కేటాయించాల్సి ఉంటుంది. దీంతో ప్లాటెడ్ ఏరియా సుమారు 55-60శాతం మాత్రమే ఉంటుంది. లేఅవుట్ నియమ నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే హెచ్ఎండీఏ స్వీకరిస్తుంది. ఇందుకుగాను డెవలప్మెంట్ ఛార్జెస్ కింద చ.మీ. రూ.10ల చొప్పున ఎకరాకు సుమారు రూ.4లక్షలు ఫీజు వసూలు చేస్తున్నారు. నిర్ణీత ఫీజును చెల్లించేందుకు రియల్టర్లు ముందుకు వచ్చినా... లేఅవుట్ భూ విస్తీర్ణం 10ఎకరాలకు తక్కువ ఉన్న దరఖాస్తులను తిరస్కరిస్తుండడంతో హెచ్ఎండీఏకు అనుమతుల రూపంలో వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఇప్పుడు భూ విస్తీర్ణంతో సంబంధం లేకుండా కొత్త లేఅవుట్లకు అనుమతి ఇవ్వడం ద్వారా ఆర్థిక జవసత్వాలను కూడగట్టుకోవాలని సంస్థ ఆరాటపడుతోంది. అయితే... ఈ ప్రతిపాదనపై ప్రభుత్వ పెద్దలు ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. సాంకేతికంగా ఇందులో ఎదురయ్యే ఇబ్బందులు, సాధ్యాసాధ్యాలపై ఉన్నతస్థాయి అధికారులు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ప్రయోజనాలివీ.. - చిన్నస్థాయి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా వెంచర్లు వేసే అవకాశం ఉండడంతో పోటీ పెరగడం వల్ల ధరలు తగ్గి సామాన్య, మధ్యతరగతి వర్గాల బడ్జెట్లో పాట్లు అందుబాటులోకి వస్తాయి. - గ్రామపంచాయతీల్లో అక్రమ లేఅవుట్లకు అడ్డుకట్ట పడుతుంది. రియల్టర్లు హెచ్ఎండీఏ అనుమతి తీసుకోవడంతో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. - హెచ్ఎండీఏ పరిధిలో లేని ప్రాంతాల్లో ప్రస్తుతం డెరైక్టరేట్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) ద్వారా 2 ఎకరాల విస్తీర్ణం ఉన్నా లేఅవుట్ అభివృద్ధికి అనుమతిస్తున్నారు. ఈ విధానాన్ని హెచ్ఎండీఏలో అమలు చేయడం వల్ల అక్రమ లేఅవుట్లు తగ్గుతాయి. ఇబ్బందులివీ.. - చిన్నచిన్న లేఅవుట్లలో పార్కులు, ఆట స్థలం, ఇతర మౌలిక సౌకర్యాల కోసం 40శాతం మేర స్థలం కేటాయించడం సాధ్యం కాదు. - చిన్న లేఅవుట్స్‌కు రోడ్ల అనుసంధానం కష్టమవుతుంది. - జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ పరంగా వచ్చే సౌకర్యాలు చిన్న లేఅవుట్‌కు మంజూరు కావు. - చిన్న ప్లాట్లలో పార్కుల ఏర్పాటుకు ఖాళీ స్థలం వదలడం సాధ్యం కాదు. కనుక ఇరుకైన నిర్మాణాలతో గజిబిజిగా మారుతుంది. -
రియల్ఎస్టేట్ నేల చూపులు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: స్థిరాస్తి రంగంపై రాష్ట్ర విభజన అంశం తీవ్ర ప్రభావం చూపింది. భూముల క్రయ విక్రయాలు, బహుళ అంతస్తుల నిర్మాణాలతో వెలుగువెలిగిన జిల్లా ప్రస్తుతం వెలవెలబోతోంది. రియల్ఎస్టేట్ వ్యాపారులు, కొనుగోలుదారులతో కళకళలాడిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కూడా బోసిపోయి కనిపిస్తున్నాయి. తెలంగాణ బిల్లు అంశం తెరమీదకు వచ్చిందే తడవు జిల్లాలో రియల్టీ రంగం పల్టీలు కొట్టడం ప్రారంభమైంది. ప్రత్యేక రాష్ర్ట ఉద్యమం నేపథ్యంలో 2005 నుంచి ఆనేక ఒడిదొడుకులను ఎదుర్కొన్న స్థిరాస్తి వ్యాపారం.. 2013 ఆరంభంలో కొంత పుంజుకుంది. ఊహించనిరీతిలో యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజనకు మొగ్గు చూపడమే తరువాయి మళ్లీ రియల్ బూమ్ ఢామ్ అయ్యింది. రాష్ర్ట ఖజానాకు ఆదాయార్జన శాఖల్లో ఒక్కటైన రిజిస్ట్రేషన్ల శాఖ... భూముల క్రయవిక్రయాలు తగ్గిపోవడంతో నిర్దేశిత లక్ష్యాల సాధనలో చతికిలపడింది. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో రియల్టీ రంగం పూర్వవైభవం సాధించడం కష్టంగానే కనిపిస్తోంది. ఐటీ కంపెనీలు, బహుళ జాతి సంస్థల రాకతో గతంలో నగర శివార్లలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇదే క్రమంలో బడా బిల్డర్లు కూడా కొత్త ప్రాజెక్టులను నగర శివార్లలో చేపట్టేందుకు మొగ్గు చూపారు. దీంతో స్థలాల విలువ అనూహ్యంగా పెరిగింది. సొంతింటి కలలు కన్న సామాన్య, వేతన జీవుల ఆశలపై ఆకాశాన్నంటిన భూములు, ఫ్లాట్ల ధరలు నీళ్లు జల్లాయి. ఈ క్రమంలోనే గతేడాది జూన్‌లో తెలంగాణ బిల్లును కేంద్రం కదిలించేదే తడువు... రిజిస్ట్రేషన్ల సంఖ్య దారుణంగా పడిపోయింది. కాగా ఆదిబట్ల, అప్పా, నార్సింగి జంక్షన్లు సహా ఐటీఐఆర్ ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రాంతాల్లో మాత్రం కొద్దిమేర స్థలాల కొనుగోళ్లు సాగుతున్నాయి. భవిష్యత్తులో ఇక్కడ ఐటీ కంపెనీలు వచ్చే అవకాశాలు మెండుగా ఉండడంతో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. మిగతా ప్రాంతాల్లో మాత్రం రియల్ రంగం ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. ఈ ఏడాది ఢామ్! జిల్లాలో గతేడాది జనవరి-ఏప్రిల్ వరకు 1,02,714 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా.. రూ.698.31 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది ఇదే కాలానికి 62,106 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా...రూ.425.05 కోట్ల రాబడి మాత్రమే వచ్చింది. అంటే 2013 తొలి నాలుగు నెలలతో పోలిస్తే 39.13 శాతం ఆదాయం తగ్గిపోయిందన్నమాట. జిల్లాలోని రంగారెడ్డి, రంగారెడ్డి తూర్పు రిజిస్ట్రేషన్ శాఖల్లో 2013 జనవరి కంటే ఈ సారి 24.05 శాతం రాబడి పడిపోయింది. అలాగే ఫిబ్రవరిలో 21.99 శాతం తగ్గింది. ఇదే నెలలో తెలంగాణ బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర వేయడంతో దీని ప్రభావం మార్చి నెలపై స్పష్టంగా కనిపించింది. గత ఏడాది మార్చిలో రూ.313.84 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది మార్చిలో కేవలం రూ.121.12 కోట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ల శాఖ ఆర్జించింది. కేవలం ఈ ఒక్కనెలలోనే 61.40 శాతం రాబడిలో తేడా రావడం గమనార్హం. రాష్ర్ట విభజన ప్రక్రియ దాదాపుగా పూర్తికావడం, అపాయింటెడ్ డే కూడా సమీపిస్తుండడంతో స్థిరాస్తి రంగం మరింత కుదేలయ్యే అవకాశంలేకపోలేదు. వాస్తవానికి నగర శివార్లలో అత్యధికంగా తెలంగాణేతరులే ప్లాట్లను కొనుగోలు చేశారు. దీంట్లో వ్యాపారవేత్తలు, ఉద్యోగులేగాకుండా.. వివిధ రంగాల్లో స్థిరపడ్డ ఆనేకులు ఇక్కడ భూముల్లో పెట్టుబడులు పెట్టారు. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లాలో రియల్టీ రంగం మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరించింది. దీంతో జిల్లాలో చాలామంది రియల్టర్లుగా, బ్రోకర్లుగా అవతారమెత్తారు. వారి జీవన ప్రమాణాల్లో మార్పులు వచ్చాయి. తాజాగా ఈ రంగం ఢమాల్ అనడంతో వీరు దిగాలు చెందుతున్నారు. అయితే, సామాన్యులు మాత్రం పెరిగిన ధరల్లో స్థిరత్వం వస్తుందనే భరోసాతో ఉన్నారు. మరోవైపు రియల్ ఎస్టేట్ రంగానికి జవసత్వాలు కల్పించి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో కొంత భరోసా కలుగుతున్నా... సీమాంధ్ర రాజధానిలో పెట్టుబడులు పెట్టే దిశగా వ్యాపారవేత్తలు ఆలోచనలు సాగిస్తుండడం ఇక్కడి రియల్టర్లను కలవరపరుస్తోంది. -
నేడే మున్సిపోల్స్ ఫలితాలు
ఆర్మూర్, న్యూస్‌లైన్ : మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు ఓటములపై ఆర్మూర్‌లో జోరుగా బెట్టింగ్ కాస్తున్నారు. మున్సి‘పోల్స్’ అనంతరం 43 రోజుల తర్వాత సోమవారం జిల్లాకేంద్రంలో నిర్వహించనున్న కౌంటింగ్‌లో అభ్యర్థుల గెలుపు ఓటములు తేలనున్నాయి. దీనిపై పలువురు జూదం కాస్తున్నారు. రాజకీయ నాయకులు, పట్టణంలోని వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, యువకులు బెట్టింగ్‌లో పాలు పంచుకుంటున్నారు. పట్టణంలోని ప్రధాన వీధులైన కొత్తబస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, పాతబస్టాండ్, గోల్‌బంగ్లాల వద్ద గల అడ్డాలలో బెట్టింగ్ జోరుగా సాగుతోంది. ఐదు వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు బెట్టింగ్ కాస్తున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ బెట్టింగ్‌లా చైన్ పద్ధతిలో కాకుండా వ్యక్తిగతంగా డబ్బుల పంపకం నిర్వహిస్తున్నారు. కొన్ని స్థానాల్లో అభ్యర్థుల గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న వారి మిత్రులు, ఎవరైనా తనతో బెట్టింగ్ కాస్తే ఒకటికి మూడు ఇస్తానంటూ ఆఫర్లు ఇస్తున్నారు. దీంతో పలువురు బెట్టింగ్ వైపు ఆకర్షితులవుతున్నారు. ఓడిపోతే చిన్న మొత్తమే పోతుంది.. గెలిస్తే మూడు రెట్ల డబ్బు వస్తుందనే ఆశతో బెట్టింగ్‌లో పాల్గొంటున్నారు. మెజార్టీ స్థానాలలో కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొనడంతో బెట్టింగ్ ఆయా పార్టీల అభ్యర్థులపైనే కాస్తున్నారు. చైర్పర్సన్ పీఠం సైతం ఈ రెండు పార్టీలకు సంబంధించిన వారిలో ఎవరు ఎక్కువ స్థానాలు గెలుచుకుంటే వారే కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠం జనరల్ మహిళకు రిజర్వు కావడంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలలో చైర్పర్సన్ అభ్యర్థులపైనే ప్రధానంగా బెట్టింగ్‌కు ఆసక్తి చూపుతున్నారు. ప్రధాన కూడళ్లలో నలుగురు కలిసి కూర్చుంటే చాలు ఎన్నికల గెలుపు ఓటములపైనే ప్రధానంగా చర్చించుకుంటున్నారు.