మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద జాతీయరహదారి వెంట ఖాళీగా ఉన్న భూములపై కబ్జాదారులు పంజా విసురుతున్నారు. నకిలీ పత్రాలు తయారుచేసి ఆ భూముల్ని అమ్మేస్తున్నారు. తాజాగా నకిలీ పత్రాలతో భూమి అమ్ముతున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై భూమి యజమాని పోలీసుల్ని ఆశ్రయించారు. నగరంలో జాతీయరహదారి వెంబడి ఉన్న శ్రీకృష్ణచైతన్య వృద్ధాశ్రమానికి దగ్గరలో 123/1 సర్వే నంబరులో 67 సెంట్ల భూమి కొన్నేళ్లుగా ఖాళీగా ఉంది.
సుమారు రూ.15 కోట్ల విలువైన ఈ భూమిపై మంగళగిరికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, టీడీపీ నాయకుల కన్ను పడింది. నగరానికి చెందిన చంద్రమౌళి పేరు మీద నకిలీ దస్తావేజులు సృష్టించి అమ్మకానికి పెట్టారు. రూ.4.50 కోట్లకు కొనుగోలు చేసిన టీడీపీ నాయకుడు విశాఖపట్నం కి చెందిన తన అనుచరుడు కోటేశ్వరరావు పేరిట అగ్రిమెంట్ రాయించారు. అగ్రిమెంట్ అయిన వెంటనే భూమిని చదును చేసి మట్టి తోలసాగారు. దీంతో మంగళగిరికి చెందిన సాంబశివరావు ఆ భూమిని తాను కొనుగోలు చేశానని, తనకు అగ్రిమెంట్ ఉందని బయటకొచ్చారు.
మొత్తం రూ.2.50 కోట్లు ఇస్తానని, భూమి ఖాళీ చేయాలని కోటేశ్వరరావుతో బేరాలాడసాగారు. ఈ విషయం తెలియడంతో ఆ భూమి అసలు యజమాని విజయవాడ వన్‌టౌన్‌కు చెందిన గిరీశ్ మంగళవారం రాత్రి ఆ భూమి వద్దకు చేరుకున్నారు. ఈ భూమి మీదేననే ఆధారాలు తీసుకురావాలని కోటేశ్వరరావు అనడంతో గిరీశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువర్గాలు ఆధారాలు తీసుకురావాలని పోలీసులు సూచించారు. తాను గురువారం రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నానని, తహసీల్దారుతోను, రిజిస్ట్రార్‌తోను మాట్లాడానని కోటేశ్వరరావు చెప్పారు.
ఈ విషయమై తహసీల్దారును, రిజిస్ట్రార్‌ను అడగగా.. తమను రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించలేదని తెలిపారు. దస్తావేజులు, లింకు దస్తావేజులు, రెవెన్యూ రికార్డులు పరిశీలించి, పోలీసులు విచారణ అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సీఐ అంకమ్మరావును అడగగా.. స్థల వివాదంపై ఫిర్యాదు అందిందని తెలిపారు. తాను సెలవులో ఉన్నానని, విధులకు వచ్చి న తరువాత విచారించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment