కరీంనగర్: రామగుండం ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్ పరిధి, కార్పొరేషన్ 39వ డివిజన్ ఖాజీపల్లికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మేకల లింగయ్య సోమవారం రాత్రి దారుణహత్యకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. లింగయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని సమస్యాత్మక భూములను కొంటూ.. వాటిని పరిష్కరించి.. విక్రయాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో గ్రామంలోని ఓ భూమి విషయంలో లింగయ్యకు.. మరికొందరికి వివాదం తలెత్తినట్లు సమాచారం. ఈ క్రమంలో లింగయ్య రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయంలో పెంపుడు కుక్కతో ప్రధాన రహదారి నుంచి పవర్‌ప్లాంట్‌కు వెళ్లే దారిలో వాకింగ్ చేస్తున్నారు. అప్పటికే మాటువేసిన దుండగులు లింగయ్యపై వేట కొడవళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న గోదావరిఖని ఏసీపీ తుల శ్రీనివాస్, రామగుండం సీఐ చంద్రశేఖర్ గౌడ్, ఎన్టీపీసీ ఎస్సై జీవన్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
కృష్ణాష్టమి రోజే హత్యకు ప్లాన్..?
లింగయ్యను హత్య చేసేందుకు నిందితులు కృష్ణాష్టమి రోజే ప్రత్యర్థులు ప్రయత్నించి విఫలమైనట్లు తెలుస్తోంది. అనంతరం వినాయక చవితి పండుగపూట రోడ్లపై ఎవరూ ఉండరని, హత్యకు అదే అనువైన సమయమని దుండగులు భావించినట్లు సమాచారం. సుమారు 12 రోజులపాటు గస్తీ నిర్వహించి.. వాకింగ్‌కు వెళ్లే సమయం అనుకూలమని నిందితులు నిర్ధారించుకుని పక్కా ప్లాన్ ప్రకారమే రాత్రి సమయంలో లింగయ్య వాకింగ్ చేస్తుండగా.. వేట కొడవళ్లతో దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేసినట్లు తెలుస్తోంది.
నాడు అన్న.. నేడు తమ్ముడు
ఖాజీపల్లికి చెందిన మేకల లింగయ్యతో కలిపి ఐదుగురు అన్నదమ్ములు. లింగయ్య అన్న రాజయ్య 1991 ఏప్రిల్ 4న పొలం పనులకు వెళ్లి ఇంటికొస్తుండగా ఇంటి సమీపంలోనే ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేశారు. కుటుంబంలో చిన్నవాడైన మేకల లింగయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. తాజాగా అతడి హత్య జరిగిన 32 ఏళ్ల తర్వాత లింగయ్యను కూడా అలాగే హతమార్చడం స్థానికంగా సంచలనం సృష్టించింది.
పోలీస్ పహారా మధ్య ఖాజీపల్లి
లింగయ్య హత్యలో ఓ అనుమానితుడి ఇంటి ప్రహరీని లింగయ్య కుటుంబసభ్యులు కూల్చివేశారు. దీంతో ఖాజీపల్లిలో పోలీసులు భారీగా మోహరించారు. లింగయ్య అంత్యక్రియల సమయంలోనూ గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పహారా కొనసాగించారు. డాగ్‌స్క్వాడ్‌తో దర్యాప్తు చేస్తున్నారు. భూ వివాదాలే హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. బాధితుడి కూతురు మేకల సుప్రజ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితుల కోసం ప్రత్యేక బలగాలు గాలింపు చేపడుతున్నట్టు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment