బంజారాహిల్స్: రియల్ ఎస్టేట్ వ్యాపారి పుట్టా రాము హత్య కేసులో నిందితులైన తల్లీకూతుళ్లు హిమాంబీ, నసీమా లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తల్లీ కూతుళ్ల అరాచకాలకు చాలామంది బలికాగా, ప్రస్తుతం వ్యభిచార గృహం నిర్వహిస్తున్న నిందితురాలు హిమాంబీ ఆ ఇంటిని దౌర్జన్యంగా ఆక్రమించి యజమానిపై తప్పుడు కేసులు బనాయించింది. ఇటువైపు తొంగిచూస్తే తమపై అత్యాచారం చేశావంటూ కేసు పెడతానని బెదిరిస్తుండడంతో ఇంటి యజమాని అటువైపు తొంగి చూడడం లేదు. ఇదే అదనుగా హిమాంబీ, ఆమె కూతురు నసీమా ఇద్దరూ ఈ ఇంటిని వ్యభిచార కూపంగా మార్చారు.
జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని యూసుఫ్‌గూడ ఎల్‌ఎన్‌నగర్‌లో ఇటీవల రియల్టర్ పుట్టా రామును 11 మంది కత్తులతో దాడి చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. నసీమా హనీట్రాప్ చేసి రామును ఇంటికి పిలిపించి ఈ విషయాన్ని ప్రధాన నిందితుడు మణికంఠకు మెసేజ్ చేసి హత్య కుట్ర కారణమై జైలు పాలైంది. హిమాంబీపై ఇప్పటికే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మేడిపల్లి తదితర పోలీస్‌స్టేషన్లలో ఐదు ఎఫ్‌ఐఆర్‌లు నమోదై ఉన్నాయి.
బెయిల్‌పై వస్తూ..
2017 జూన్‌లో హిమాంబీ.. ఓ యువతితో వ్యభిచారం చేయిస్తూ బంజారాహిల్స్ పోలీసులకు పట్టుబడింది. 2018లో మరో అమ్మాయితోనూ వ్యభిచారం చేయిస్తూ అరెస్టయ్యింది. 2020లో జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరిలో వ్యభిచార గృహంపై దాడి చేయగా పోలీసులకు మరోసారి పట్టుబడింది. 2017లో విష్ణుకాంత్ అనే వ్యక్తి నుంచి బ్లాక్‌మెయిల్ చేసి రూ.3 లక్షలు వసూలు చేసింది. 2019లో తన కూతురు నసీమాను రాజు అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడంటూ తప్పుడు కేసు పెట్టింది. పోలీసులకు పట్టుబడిన ప్రతిసారీ బెయిల్‌పై వస్తూ.. కూతురు నసీమాను ఎరగా వేసి ఏడేళ్లుగా హిమాంబీ స్థానికంగా అరాచకాలకు, బ్లాక్‌మెయిల్ వ్యవహారాలకు, కుట్రలు, కుతంత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది.
కానిస్టేబుల్‌పైనే కేసులు పెట్టించి..
ఓ కానిస్టేబుల్‌కు చెందిన ఈ ఇంటిని అద్దెకు తీసుకుని అతడిపైనా తప్పుడు కేసులు పెట్టి బ్లాక్‌మెయిల్ చేసింది. ఇంటిని ఖాళీ చేయించాలంటూ కోర్టు ఆర్డర్ ఉన్నా హిమాంబీ పట్టించుకోకుండా పోలీసుల పైనే తిరగబడింది. మహిళ కావడంతో పోలీసులు కూడా ఆచితూచి వ్యవహరిస్తూ తమకెందుకులే అని పెద్దగా పట్టించుకోకపోవడంతో హిమాంబీ అరాచకాలు రోజురోజుకు పెరిగిపోయాయి. ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి కబ్జా చేసిన ఇంట్లోనే దర్జాగా వ్యభిచార గృహాన్ని నిర్వహించింది. పుట్టా రాము హత్యతో తల్లీకూతుళ్ల గుట్టు రట్టయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment