ఎకరాకే లేఅవుట్
భూ విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఇకపై లేఅవుట్లకు అనుమతినిచ్చే విషయమై హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) దృష్టి సారించింది. ఇందుకు అనుమతివ్వాలని కోరుతూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇందులో నియమ నిబంధనలు పాటిస్తూనే.. భూ విస్తీర్ణంతో సంబంధం లేకుండా అనుమతులు ఇవ్వడం వల్ల చిన్న రియల్టర్లు కూడా లే అవుట్స్ చేసుకొనే వెసులుబాటు కల్పించవచ్చని భావిస్తోంది.
దీనివల్ల హెచ్‌ఎండీఏకు అనుమతుల రూపంలో వచ్చే ఆదాయం పెరగడమేగాక సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలకు సొంత ఇంటి కల నెరవేర్చవచ్చునని ప్రతిపాదనల్లో పేర్కొంది. ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి ప్రాథమికంగా సానుకూలత వ్యక్తం చేయడంతో ప్రభుత్వ స్థాయిలో కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం.
- భూ విస్తీర్ణంతో సంబంధం లేకుండా అనుమతులు
- ప్రభుత్వ పరిశీలనలో హెచ్‌ఎండీఏ ప్రతిపాదన
- సాధ్యాసాధ్యాలపై ఉన్నతాధికారుల కసరత్తు
సాక్షి, హైదరాబాద్ హెచ్‌ఎండీఏ నిబంధనల ప్రకారం... ఒక ఓపెన్ లేఅవుట్‌ను అభివృద్ధి చేయాలంటే విధిగా 10 ఎకరాలు (4 హెక్టార్ల), ఆపైన భూ విస్తీర్ణం ఉండాలి. ఇందులో పార్కు, రోడ్లు, క్రీడా స్థలం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు (ఎమినిటీస్) 40శాతం భూమిని తప్పనిసరిగా కేటాయించాల్సి ఉంటుంది. దీంతో ప్లాటెడ్ ఏరియా సుమారు 55-60శాతం మాత్రమే ఉంటుంది. లేఅవుట్ నియమ నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే హెచ్‌ఎండీఏ స్వీకరిస్తుంది.
ఇందుకుగాను డెవలప్‌మెంట్ ఛార్జెస్ కింద చ.మీ. రూ.10ల చొప్పున ఎకరాకు సుమారు రూ.4లక్షలు ఫీజు వసూలు చేస్తున్నారు. నిర్ణీత ఫీజును చెల్లించేందుకు రియల్టర్లు ముందుకు వచ్చినా... లేఅవుట్ భూ విస్తీర్ణం 10ఎకరాలకు తక్కువ ఉన్న దరఖాస్తులను తిరస్కరిస్తుండడంతో హెచ్‌ఎండీఏకు అనుమతుల రూపంలో వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఇప్పుడు భూ విస్తీర్ణంతో సంబంధం లేకుండా కొత్త లేఅవుట్లకు అనుమతి ఇవ్వడం ద్వారా ఆర్థిక జవసత్వాలను కూడగట్టుకోవాలని సంస్థ ఆరాటపడుతోంది. అయితే... ఈ ప్రతిపాదనపై ప్రభుత్వ పెద్దలు ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. సాంకేతికంగా ఇందులో ఎదురయ్యే ఇబ్బందులు, సాధ్యాసాధ్యాలపై ఉన్నతస్థాయి అధికారులు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
ప్రయోజనాలివీ..
- చిన్నస్థాయి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా వెంచర్లు వేసే అవకాశం ఉండడంతో పోటీ పెరగడం వల్ల ధరలు తగ్గి సామాన్య, మధ్యతరగతి వర్గాల బడ్జెట్లో పాట్లు అందుబాటులోకి వస్తాయి.
- గ్రామపంచాయతీల్లో అక్రమ లేఅవుట్లకు అడ్డుకట్ట పడుతుంది. రియల్టర్లు హెచ్‌ఎండీఏ అనుమతి తీసుకోవడంతో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.
- హెచ్‌ఎండీఏ పరిధిలో లేని ప్రాంతాల్లో ప్రస్తుతం డెరైక్టరేట్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) ద్వారా 2 ఎకరాల విస్తీర్ణం ఉన్నా లేఅవుట్ అభివృద్ధికి అనుమతిస్తున్నారు. ఈ విధానాన్ని హెచ్‌ఎండీఏలో అమలు చేయడం వల్ల అక్రమ లేఅవుట్లు తగ్గుతాయి.
ఇబ్బందులివీ..
- చిన్నచిన్న లేఅవుట్లలో పార్కులు, ఆట స్థలం, ఇతర మౌలిక సౌకర్యాల కోసం 40శాతం మేర స్థలం కేటాయించడం సాధ్యం కాదు.
- చిన్న లేఅవుట్స్‌కు రోడ్ల అనుసంధానం కష్టమవుతుంది.
- జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ పరంగా వచ్చే సౌకర్యాలు చిన్న లేఅవుట్‌కు మంజూరు కావు.
- చిన్న ప్లాట్లలో పార్కుల ఏర్పాటుకు ఖాళీ స్థలం వదలడం సాధ్యం కాదు. కనుక ఇరుకైన నిర్మాణాలతో గజిబిజిగా మారుతుంది.