అక్రమ లేఅవుట్ల రిజిస్ట్రేషన్లకు నో!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) అనుమతి లేకుండా వెలసిన లేఅవుట్లలోని ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని సంస్థ పాలకవర్గం నిర్ణయించింది. అక్రమ లేఅవుట్లను నిరోధించడానికి రిజిస్ట్రేషన్ల నిలిపివేతే మార్గమని సమావేశం అభిప్రాయపడింది. భారత రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్-22ఏ కింద అక్రమ లేఅవుట్లను అడ్డుకొనేందుకు వాటిలోని ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయకుండా నిషేధం విధించాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదించాలని పాలకవర్గం మూకుమ్మడిగా నిర్ణయించింది.
హెచ్‌ఎండీఏ కమిషనర్ శాలిని మిశ్రా ఆధ్వర్యంలో శనివారం తార్నాకలోని కేంద్ర కార్యాలయంలో హెచ్‌ఎండీఏ 20వ పాలకవర్గ సమావేశం జరిగింది. అనుమతి (అప్రూవల్) ఉన్న లేఅవుట్లలోని ప్లాట్లకే రిజిస్ట్రేషన్ చేయాలనీ... లేదంటే నిలిపివేయాలన్న నిబంధనను పాటించాలని రిజిస్ట్రేషన్ శాఖను ఆదేశించేలా ప్రభుత్వాన్ని కోరాలని పాలకవర్గం అభిప్రాయపడింది. ప్రధానంగా 1,000 చ.మీ. విస్తీర్ణం, 10 మీటర్ల ఎత్తుకు లోబడిన భవనాలకు అదీకూడా... హెచ్‌ఎండీఏ అనుమతి ఇచ్చిన లేఅవుట్‌లోని ప్లాట్లకే అనుమతిచ్చే అధికారం గ్రామపంచాయతీలకు ఉంది.
అయితే... ఆ నిబంధన లేవీ పాటించకుండా ఇష్టారీతిన అనుమతులిస్తుండటం వల్ల శివారు ప్రాంతాల్లో లెక్కకు మించి అక్రమ నిర్మాణాలు వెలిశాయని, ప్రభుత్వానికి రావలసిన ఆదాయం కూడా రాకుండా పోతోందని సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అక్రమ నిర్మాణాలు, లేఅవుట్లకు పాత తేదీలతో అనుమతులిస్తూ ప్రోత్సహిస్తున్నాయని, అందుకే గ్రామ, నగర పంచాయతీలకున్న అధికారాల (డెలిగేషన్ పవర్స్)ను పూర్తిగా రద్దుచేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించాలని సమావేశం నిర్ణయించింది. ఈ సమావేశంలో మొత్తం 14 అంశాలపై పాలకవర్గం చర్చించి ఆమోదం తెలిపింది.
ఉప్పల్ భగత్ రైతులకు వెయ్యి చ.గ. ప్లాట్
ఉప్పల్ భగత్‌లో రైతుల నుంచి సేకరించిన భూమికి పరిహారంగా (జీవో నం.36 ప్రకారం) ఎకరానికి 1,000 చ.గ. ప్లాట్‌ను అభివృద్ధి చేసిన లేఅవుట్‌లో ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అయితే... ఇక్కడి గడ్డిభూముల్లో మధ్యలో అక్కడక్కడ బిట్స్‌గా మిగిలి ఉన్న 13.30 ఎకరాల భూమిని మొత్తం 61 మంది రైతుల నుంచి హెచ్‌ఎండీఏ సేకరించి మెగా లేఅవుట్‌ను అభివృద్ధి చేసింది.
ఆయా రైతులకు కూడా ప్లాట్లు ఇచ్చేందుకు పాలకవర్గం ఆమోదం తెలిపింది. బేగంపేటలోని పైగా ప్యాలెస్‌ను హెచ్‌ఎండీఏకు ఇవ్వాలని, లేనిపక్షంలో కొత్త భవనం నిర్మాణానికి ప్రభుత్వం అనుమతివ్వాలని కోరుతూ సమావేశంలో పెట్టిన అంశానికి కమిటీ ఆమోదం తెలిపింది. అలాగే సమావేశంలో ఐటీ బకాయిలపై లోతుగా చర్చ సాగింది. ట్యాక్స్ కన్సల్టెంట్‌గా ఆర్.సుబ్రహ్మణ్యం అండ్ కంపెనీకి చెందిన ఆర్.సుబ్బారావును, ఐటీ సెల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌గా ఎస్.లక్ష్మిని ఏడాది పాటు కాంట్రాక్టు ప్రాతిపదికన నియమిస్తూ కమిటీ నిర్ణయం తీసుకొంది. హెచ్‌ఎండీఏలో రివైజ్డ్ పే స్కేల్స్‌ను, రివైజ్డ్ పెన్షన్స్ అమలు చేసేందుకు పాలకవర్గం ఆమోదం తెలిపింది. పెన్షన్ ఫండ్ కింద ఎల్‌ఐసీకి చెల్లించాల్సిన రూ.16 కోట్లకు గాను ఒక వాయిదాలో రూ.4 కోట్లు చెల్లించారు, ఇక మిగిలిన రూ.12 కోట్లు వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు కమిటీ సుముఖత వ్యక్తం చేసింది.
సిటీ ఐటీఎస్, హెచ్‌ఆర్‌ఎం ప్రాజెక్టులకు ఓకే
హెచ్‌జీసీఎల్ ఆధ్వర్యంలో రూ.162కోట్ల వ్యయంతో తలపెట్టిన సిటీ ఐటీఎస్ ప్రాజెక్టుకు, రూ.14.5 లక్షల వ్యయంతో తలపెట్టిన హెచ్‌ఆర్‌ఎం ప్రాజెక్టుకు కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2013-14 యాన్యువల్ అకౌంట్స్‌ను, 2015-16 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రభుత్వానికి ప్రతిపాదించిన రూ.304.37 కోట్ల బడ్జెట్‌కు పాలకవర్గం ఆమోదం తెలిపింది. హుస్సేన్‌సాగర్ పరీవాహక ప్రాంత అభివృద్ధి పథకం కింద ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి, ఇందుకోసం వెచ్చించిన రూ.258 కోట్లు, చేపట్టాల్సిన పనులపై సమావేశంలో చర్చించారు.
కిస్మత్‌పూర్ వద్ద ఈసీ నదిపై రూ.6.58 కోట్ల వ్యయంతో తలపెట్టిన వంతెన నిర్మాణానికి కమిటీ ఆమోద ముద్రవేసింది. హెచ్‌ఎండీఏ పెండింగ్ కేసుల (2,462 కేసులు) వివరాలను ఎప్పటికప్పుడు అందించేందుకు ప్రత్యేకంగా లీగల్ అడ్వయిజర్‌ను నియమించాలని కమిటీ నిర్ణయించింది.