ఫైల్ ఫోటో
సాక్షి, సిటీబ్యూరో: స్థిరాస్తి రంగంలో మరింత దూకుడు ప్రదర్శించాలని హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) నిర్ణయించింది. కోకా పేట భూ వేలంతో ఊపు మీద ఉన్న హెచ్‌ఎండీఏ..ఉప్పల్ భగాయత్ తరహాలో మరిన్ని ప్రయోగాలు చేయాలని భావిస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వ భూముల అభివృద్ధి, లేఅవుట్‌ల ఏర్పాటు, ప్లాట్‌ల విక్రయాలకు పరిమితమైన ఆ సంస్థ..ఇకపై రైతుల భాగస్వామ్యంతో లేఅవుట్లను అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తోంది.
ఉప్పల్ భగాయత్ ప్రయోగంతో ఊపు..
► ఉప్పల్ భగాయత్‌లో ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేసిన లేఅవుట్ కాసుల వర్షం కురిపించడంతో ఈ విధానాన్ని మరింత విస్తరించాలని హెచ్‌ఎండీఏ నిర్ణయించింది.
► ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లేమూరు, కొత్తూరు మండలం ఇన్మూల్ నర్వా గ్రామాలను ఎంపిక చేసిన యంత్రాంగం.. ఇక్కడ రైతుల నుంచి సేకరించిన భూములను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తోంది.
► వారం, పది రోజుల్లో ఈ ప్రాజెక్టులకు కార్యరూపం ఇచ్చేలా ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు తెలిపారు.
నగరం నలువైపులా..
ఉప్పల్ భగాయత్ తరహాలో నగరానికి నలువైపులా మినీటౌన్‌షిప్‌లను ఏర్పాటు చేసేందుకు గతేడాదే ఈ ప్రక్రియను చేపట్టారు. చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురం, కీసర మండలంలోని బోగారం, కందుకూరు మండలంలోని లేమూరు, కొత్తూరు మండలంలోని ఇన్మూల్ నర్వా గ్రామాలను ఎంపిక చేశారు. హెచ్‌ఎండీఏ అధికారులు ఈ గ్రామాల్లో పలుమార్లు పర్యటించి భూములను పరిశీలించారు. భూముల అప్పగింతకు ముందుకు వచ్చిన రైతులతో ఒప్పందాలు చేసుకున్నారు. కానీ అప్పట్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం వల్ల ప్రాజెక్టు ముందుకు సాగలేదు. దండు మల్కాపురంలో సుమారు 300 ఎకరాలు, బోగారంలో 110 ఎకరాలు రైతుల నుంచి సేకరించి అభివృద్ధి చేసేందుకు రైతులతో డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ కూడా పూర్తి చేసుకున్నారు. కానీ కొంతమంది రైతుల భూముల్లో వేరే వ్యక్తులు పొజీషన్‌లో ఉండడంతో దండుమల్కాపురం, బోగారంలలో భూసేకరణ ఆగిపోయింది. లేమూరు, ఇన్మూల్‌లలో ఎలాంటి వివాదాలు లేకపోవడంతో రైతులతో అభివృద్ధి ఒప్పందం కూడా పూర్తయింది. లే అవుట్ ముసాయిదా కూడా పూర్తయిందని హెచ్‌ఎండీఏ అధికారి ఒకరు తెలిపారు.
రైతులకు 60 శాతం వాటా...
► ల్యాండ్‌పూలింగ్ పథకం కింద అభివృద్ధిచేసే భూ ముల్లో 60 శాతం వాటా రైతులకు చెందనుంది.
► గతంలో 50 శాతం ఉండగా, దీనిని ప్రస్తుతం 60 శాతానికి పెంచారు. తమ వాటా స్థలాలను రైతులు అమ్ముకోవచ్చు. లేదా లీజుకు ఇచ్చుకోవచ్చు.
► ఈ భూముల అభివృద్ధికి అయ్యే నాలా చార్జీలను, రిజిస్ట్రేషన్ ఫీజులు, భూ వినియోగ మార్పిడి ఫీజులను హెచ్‌ఎండీఏనే భరించనుంది.
► ఈ పథకం కింద భూములిచ్చే రైతులకు పూర్తి స్థాయి భద్రత లభిస్తుంది. జోన్ల నిబంధనలు పాటిస్తూ తమ వాటాలను నివాసిత, వాణిజ్య ప్లాట్లుగా విక్రయించుకోవచ్చు. ఐటీ కార్యాలయాలకు విక్రయించవచ్చు. లేదా లీజుకు ఇవ్వొచ్చు.
► హెచ్‌ఎండీఏ లే అవుట్ డ్రాఫ్ట్ అప్రూవల్ అయిన నాటి నుంచి మూడు నెలల్లోపు భూ యజమానులకు ప్లాట్లు కేటాయిస్తారు.
చదవండి : Naresh Tumda: రోజుకూలీగా మారిన క్రికెట్ వరల్డ్ కప్ విన్నర్
Comments
Please login to add a commentAdd a comment