Hyderabad Real Estate: Check These List Of Documents Required To Buy A Property - Sakshi
Sakshi News home page

Hyderabad Real Estate: ఎవరు రియల్‌ డెవలపర్

Published Sat, Apr 17 2021 4:08 PM | Last Updated on Sat, Apr 17 2021 4:46 PM

Hyderabad Real Estate: Check These Documents Before Buying A Property - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఒకవైపు రోజువారీ నిత్యావసర ఖర్చులు మోస్తూనే.. మరోవైపు జీఎస్‌టీ, స్టాంప్‌ డ్యూటీ, ఆదాయ పన్నులను భరించి ఇంటి కొనుగోలు నిర్ణయం తీసుకోవటం కొనుగోలుదారులకు కష్టమే. ఆకాశాన్నంటిన భూముల ధరలు, నిర్మాణ అనుమతులు, బ్యాంక్‌ వడ్డీలు, ఆఫీస్‌ నిర్వహణ ఖర్చులు, రోజురోజుకూ పెరుగుతున్న నిర్మాణ సామగ్రి ధరలు, స్థానిక నాయకుల ఒత్తిళ్లు.. వీటన్నింటినీ దాటుకొని ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం డెవలపర్‌కు సవాలే... ఇలా నిజమైన కొనుగోలుదారులు, డెవలపర్లకు మధ్యలో రాత్రికి రాత్రే ప్రాజెక్ట్‌లను ప్రారంభించేసి.. అడ్డదారిలో విక్రయాలు చేస్తూ రియల్టీ మార్కెట్‌లో కృత్రిమ డిమాండ్‌ను సృష్టిస్తున్నారు కొందరు తాత్కాలిక బిల్డర్లు. 

సాక్షి, హైదరాబాద్‌: బూమ్‌ ఉందంటే చాలు ఇన్వెస్టర్లే కాదు డాక్టర్లు, యాక్టర్లు, లాయర్లు, బ్యూరోక్రాట్స్, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరూ పెట్టుబడులు పెట్టి మార్కెట్‌లో డిమాండ్‌ను సృష్టిస్తుంటారు. ప్రతి ఏటా 15–20 శాతం ధరలు పెరగడం ఆరోగ్యకరమైన వృద్ధి. అలాకాకుండా అబ్‌నార్మల్‌గా పెరిగితే మాత్రం అది బూమ్‌. ఇది ప్రభుత్వ అభివృద్ధి ప్రకటనలు, భవిష్యత్తు ప్రాజెక్ట్‌లను, ప్రాంతాలను బట్టి పెరుగుతుంటుంది. రియల్టీ బూమ్‌ ఇన్వెస్టర్లు ఉన్నంత కాలమే ఉంటుంది.. ఒక్కసారి ఇన్వెస్టర్లు పక్కకు తప్పుకోగానే బద్దలైపోతుంది. ఇదేమీ కొత్తకాదు. 2008లో వచ్చిన రియల్టీ బూమ్‌ ఇలాంటిదే. 2015–16 వరకు కోలుకోలేదు. ఇలాంటి సంక్షోభ సమయంలోనూ హైదరాబాద్‌ డెవలపర్లు ధైర్యంగా, బలంగా నిలబడటానికి కారణం నిజమైన కొనుగోలుదారులు తోడుగా నిలవటమే. ప్రతి సంవత్సరం నగరంలో 25 వేల గృహాలు విక్రయం అవుతుంటాయి. ఇదే స్థాయిలో లాంచింగ్స్‌ కూడా ఉంటాయి. కొనేవాళ్లు ఏ స్థాయిలో ఉన్నారో.. గృహాల సప్లయి కూడా అదే స్థాయిలో ఉంటుంది. 


పొలిప్రెన్యూర్‌ అయితేనే..  
పొలిటికల్, ఎకనామికల్, సోషల్, టెక్నలాజికల్, ఎన్విరాన్‌మెంటల్, లీగల్‌... ఈ వ్యాపారం చేయాలన్నా ఉండాల్సిన ప్రధాన అంశాలివే. ఆయా అంశాలలో తెలంగాణ బలంగా ఉండటం వల్లే కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు హైదరాబాద్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌లా కాకుండా పొలిప్రెన్యూర్‌గా ఉంటేనే రాణించగలమని కిస్మత్‌పూర్‌కు చెందిన ఓ డెవలపర్‌ తెలిపారు. పొలిటికల్‌ కనెక్షన్స్‌ బాగా ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్‌ను పొలిప్రెన్యూర్స్‌ అంటారు. సాధారణ డెవలపర్లు చెప్పులు అరిగేలా తిరిగినా పరిష్కారంకాని సమస్యలన్నీ పొలిప్రెన్యూర్స్‌కు మాత్రం కూర్చున్న చోటే పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. భూమి అగ్రిమెంట్‌ చేసుకున్న రోజు నుంచి ప్రాజెక్ట్‌ను మార్కెట్‌లోకి తెచ్చే వరకు సుమారు మూడేళ్ల సమయం పడుతుంది. ఈ కాలంలో వడ్డీ భారం డెవలపర్లదే. తీరా లాంచింగ్‌ చేశాక మార్కెట్‌ ప్రతికూలంలో ఉంటే మరింత భారమే. 


డెవలపర్లలో పోటీ భయం నెలకొంది.. 
రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో ఇప్పుడు కొనకపోతే ముందుముందు కొనలేమనే భయం ఎలాగైతే కొనుగోలుదారుల్లో ఉందో.. అలాగే కొత్త డెవలపర్లే పెద్ద ప్రాజెక్ట్‌లు చేసి మార్కెట్‌ను క్యాష్‌ చేసుకుంటుంటే మనం వదలుకుంటున్నామనే భయం సీనియర్‌ డెవలపర్లలో నెలకొంది. ప్రీలాంచ్‌లో విక్రయాలు, యూడీఎస్‌ బుకింగ్స్‌ చేస్తూ అడ్డదారులలో కొందరు డెవలపర్లు మార్కెట్‌ను పాడు చేస్తుంటే.. న్యాయబద్ధంగా వ్యాపారం చేస్తూ, కొనుగోలుదారులు సొంతిల్లు కలను నిజం చేస్తున్న డెవలపర్లకు సమస్యలు వస్తున్నాయి. దీంతో డెవలపర్లు మానసికంగా నలిగిపోతున్నారని గిరిధారి కన్‌స్ట్రక్షన్స్‌ ఎండీ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. 


కొనేముందు ఇవి చూడాలి.. 
► ఎంపిక చేసిన ప్రాజెక్ట్‌ గురించి న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలి. 
► ఎన్ని బ్యాంక్‌ల నుంచి ప్రాజెక్ట్‌లోన్‌ తీసుకున్నారు. 
► హెచ్‌ఎండీఏ, లోకల్‌ బాడీ, ఫైర్, ఎన్విరాన్‌మెంటల్, ఎయిర్‌పోర్ట్‌ వంటి ప్రభుత్వ విభాగాల అనుమతులున్నాయా? లేవా? రెరాలో నమోదు చేశారా లేదా చూసుకోవాలి. 

► ప్రాజెక్ట్‌ను కట్టే ఆర్థిక స్తోమత నిర్మాణ సంస్థకు ఉందా? లేదా? 
► బిల్డర్‌కు నిర్మాణ రంగంలో సాంకేతిక అనుభవం ఉందా లేదా చూసుకోవాలి. 
► నిర్మాణ సంస్థ విలువలు,  డెవలపర్‌ గత చరిత్ర గురించి ఆరా తీయాలి. 

► ప్రాజెక్ట్‌ నాణ్యత, గడువులోగా పూర్తవుతుందా లేదా పరిశీలించాలి. 
► ప్రాజెక్ట్‌ ఉన్న ప్రాంతంలో అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి? సోషల్‌ ఇన్‌ఫ్రా ఎలా ఉందో గమనించాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement