‘ఓసీ’తో మాయ చేసి.. | Misuse of Occupancy Certificates: Illegal Constructions Thrive in Hyderabad Gated Communities | Sakshi
Sakshi News home page

‘ఓసీ’తో మాయ చేసి..

Aug 22 2025 3:43 PM | Updated on Aug 22 2025 3:59 PM

Misuse of Occupancy Certificates: Illegal Constructions Thrive in Hyderabad Gated Communities

ఔటర్‌ చుట్టుపక్కల అక్రమ నిర్మాణాలు

హెచ్‌ఎండీఏ నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు

ఆ తర్వాత యథేచ్ఛగా ఉల్లంఘనలు

విల్లాలు, బహుళ అంతస్తుల భవనాలపై ఫిర్యాదులు

అక్రమాలపై కొరవడిన నిఘా, నియంత్రణ

హెచ్‌ఎండీఏ నిబంధనలు బేఖాతరు 
 

సాక్షి, సిటీబ్యూరో: అదో అతిపెద్ద గేటెడ్‌ కమ్యూనిటీ. హైద‌రాబాద్‌ నగర శివార్లలోని ఆ గేటెడ్‌ కమ్యూనిటీలో సుమారు వందల సంఖ్యలో విల్లాల నిర్మాణం చేపట్టారు. వాటిలో చాలావరకు పూర్తయ్యాయి. ఇంకా కొన్ని తుది దశ నిర్మాణంలో ఉన్నాయి.

హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు పూర్తి చేసిన భవనాలకు అధికారులు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను (ఓసీ) కూడా అందజేశారు. దీంతో అక్కడ చాలా మంది నివాసం ఉంటున్నారు. నిబంధనల మేరకు ఒకసారి ఓసీ తీసుకున్న తర్వాత ఎలాంటి అక్రమ నిర్మాణాలు, అడ్డగోలు కట్టడాలు చేపట్టడానికి అవకాశం లేదు. కానీ కొన్ని విల్లాలకు చెందిన యజమానులు ఇష్టారాజ్యంగా నిబంధనలను బేఖా తరు చేస్తూ అక్రమ కట్టడాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. 

ఈ మేరకు కొందరు స్థానికులు  హెచ్‌ఎండీఏకు సైతం ఫిర్యాదు చేశారు. కానీ ఇలాంటి అక్రమ నిర్మాణాలపై హెచ్‌ఎండీఏ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేకపోవడం గమ నార్హం. ఒక్క గేటెడ్‌ కమ్యూనిటీల్లో కాదు. అపార్ట్‌మెంట్లు, బహుళ అంతస్తుల భవనాలు తదితర అ న్ని నిర్మాణాల్లోనూ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు పొందిన తర్వాత ఉల్లంఘనలకు పాల్పడటం గమనార్హం.  

వెల్ఫేర్‌ సంఘాల పేరిట ఉల్లంఘన.. 
శ్రీశైలం రహదారికి సమీపంలోని మరో భారీ గేటెడ్‌ కమ్యూనిటీలో కొన్ని విలాసవంతమైన విల్లాలు (Luxury villas) ఉన్నాయి. రాజకీయ నాయకులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, సినీ తారలు, డైరెక్టర్లు, డాక్టర్లు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, వ్యాపారులు, ఎన్నారైలు తదితర వర్గాలకు చెందిన వారు విల్లాలను నిర్మించుకున్నారు.

కొంతమంది సామాన్యులు కూడా ఊళ్లల్లోని ఆస్తులను అమ్ముకుని పిల్లల చదువు కోసం ఇందులో ప్లాటు కొనుక్కొని నివసిస్తున్నారు. కమ్యూనిటీ అంతటికీ ప్రాతినిధ్యం వహించేందుకు ఏర్పడిన వెల్ఫేర్‌ అసోసియేషన్‌లు సొంత నియమ నిబంధనలను రూపొందించుకొని హెచ్‌ఎండీఏ నిబంధనలను నీరుగారుస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

కొత్తగా నిర్మించుకునే వాళ్లు హెచ్‌ఎండీఎ నిబంధనల ప్రకారం నిర్మాణాలను కొనసాగిస్తుండగా, ఇప్పటికే  భవనాలు పూర్తి చేసుకున్న వాళ్లు తమ పలుకుబడిని ఉపయోగించి అదనపు భవనాలను నిర్మిస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ‘అసోసియేషన్‌లకు ప్రాతినిధ్యం వహించేవారే హెచ్‌ఎండీఏ నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారం నిర్మాణాలు కొనసాగిస్తున్నారు’ అని హెచ్‌ఎండీఏ కమిషనర్‌కు అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అసోసియేషన్‌ నిబంధనల పేరిట 2 శాతం అక్రమ నిర్మాణాలకు  ప్రత్యేక అనుమతులు ఇవ్వడం గమనార్హం.

కొరవడిన నిఘా.. 
సాధారణంగా ఒకసారి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు (occupancy certificate) అందజేసిన తర్వాత ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా నియంత్రించాల్సిన బాధ్యత స్థానిక మున్సిపాలిటీలు లేదా గ్రామ పంచాయతీలు తదితర స్థానిక సంస్థల పరిధిలో ఉంటుంది.

ఇలాంటి ఫిర్యాదులపై హెచ్‌ఎండీఏ అధికారులు సైతం స్థానిక సంస్థలను  అప్రమత్తం చేసి అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంది. ఈ మేరకు హెచ్‌ఎండీఏకు చెందిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంతో పాటు, స్థానిక మున్సిపాలిటీలు, రెవెన్యూ అధికారులు, పోలీసులు సమన్వయంతో చర్యలు చేపట్టవచ్చు.

మియాపూర్, శంషాబాద్‌ తదితర భూముల పరిరక్షణలో హెచ్‌ఎండీఏ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం స్థానిక సంస్థలతో కలిసి చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వ హయాంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. హెచ్‌ఎండీఏతో పాటు స్థానిక సంస్థలు సమన్వయంతో పని చేశాయి. 500 గజాల నుంచి 1000 గజాల లోపు బహుళ అంతస్తుల భవనాల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు.

కొంతకాలంగా హెచ్‌ఎండీఏ (HMDA) విజిలెన్స్‌ వ్యవస్థ పూర్తిగా నిర్విర్యమైంది. హెచ్‌ఎండీఏకు చెందిన ప్లానింగ్, ఎస్టేట్‌ తదితర విభాగాలకు సహకరించేందుకు మాత్రమే పరిమితమైంది. ఈ క్రమంలో అన్ని చోట్ల ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు పొందిన తర్వాత యథావిధిగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ప్రణాళికా విభాగానికి చెందిన కొందరు అధికారులే ఈ మేరకు భవన యజమానులకు ఉచిత సలహాలు ఇస్తున్నట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. హెచ్‌ఎండీఏకు, స్థానిక సంస్థలకు మధ్య సమన్వయం లేకపోవడంతో అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకొనే వ్యవస్థలు పని చేయడం లేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement