ఆర్మూర్, న్యూస్‌లైన్ : మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు ఓటములపై ఆర్మూర్‌లో జోరుగా బెట్టింగ్ కాస్తున్నారు. మున్సి‘పోల్స్’ అనంతరం 43 రోజుల తర్వాత సోమవారం జిల్లాకేంద్రంలో నిర్వహించనున్న కౌంటింగ్‌లో అభ్యర్థుల గెలుపు ఓటములు తేలనున్నాయి. దీనిపై పలువురు జూదం కాస్తున్నారు. రాజకీయ నాయకులు, పట్టణంలోని వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, యువకులు బెట్టింగ్‌లో పాలు పంచుకుంటున్నారు. పట్టణంలోని ప్రధాన వీధులైన కొత్తబస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, పాతబస్టాండ్, గోల్‌బంగ్లాల వద్ద గల అడ్డాలలో బెట్టింగ్ జోరుగా సాగుతోంది.
ఐదు వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు బెట్టింగ్ కాస్తున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ బెట్టింగ్‌లా చైన్ పద్ధతిలో కాకుండా వ్యక్తిగతంగా డబ్బుల పంపకం నిర్వహిస్తున్నారు. కొన్ని స్థానాల్లో అభ్యర్థుల గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న వారి మిత్రులు, ఎవరైనా తనతో బెట్టింగ్ కాస్తే ఒకటికి మూడు ఇస్తానంటూ ఆఫర్‌లు ఇస్తున్నారు. దీంతో పలువురు బెట్టింగ్ వైపు ఆకర్షితులవుతున్నారు. ఓడిపోతే చిన్న మొత్తమే పోతుంది.. గెలిస్తే మూడు రెట్ల డబ్బు వస్తుందనే ఆశతో బెట్టింగ్‌లో పాల్గొంటున్నారు.
మెజార్టీ స్థానాలలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొనడంతో బెట్టింగ్ ఆయా పార్టీల అభ్యర్థులపైనే కాస్తున్నారు. చైర్‌పర్సన్ పీఠం సైతం ఈ రెండు పార్టీలకు సంబంధించిన వారిలో ఎవరు ఎక్కువ స్థానాలు గెలుచుకుంటే వారే కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఆర్మూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠం జనరల్ మహిళకు రిజర్వు కావడంతో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలలో చైర్‌పర్సన్ అభ్యర్థులపైనే ప్రధానంగా బెట్టింగ్‌కు ఆసక్తి చూపుతున్నారు. ప్రధాన కూడళ్లలో నలుగురు కలిసి కూర్చుంటే చాలు ఎన్నికల గెలుపు ఓటములపైనే ప్రధానంగా చర్చించుకుంటున్నారు.
నేడే మున్సిపోల్స్ ఫలితాలు
Published Mon, May 12 2014 2:00 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement