సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర విభజన అంశం జిల్లాలోని పోస్టుమెట్రిక్ విద్యార్థులకు కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టింది. శనివారం నాటితో సమైఖ్య రాష్ట్రానికి ఉన్న ఉమ్మడి ఖజానా ఖాతాకు గడువు ముగుస్తుంది. దీంతో ఈ పథకం అమలుతీరు విద్యార్థుల్లో వణుకు పుట్టిస్తోంది. 2013-14 విద్యాసంవత్సరానికి సంబంధించి జిల్లాలో ఫీజు రీయింబర్స్‌మెంటు, ఉపకారవేతనాలకు సంబంధించి కోట్ల రూపాయిలు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఉమ్మడి ఖజానా ఖాతాకు కాలం చెల్లనున్న నేపథ్యంలో ఈ బకాయిల చెల్లింపు ప్రక్రియ ఎలా ఉంటుందనే అంశం విద్యార్థులను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది.
జిల్లాలో 1,046 ఇంటర్మీడియట్, వృత్తివిద్యా కళాశాలలున్నాయి. వీటి పరిధిలో దాదాపు మూడులక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రాజధానికి చుట్టూ జిల్లా విస్తరించి ఉండడం, నగర శివారు ప్రాంతాల్లో అత్యధికంగా వృత్తి విద్యా కళాశాలలుండడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల విద్యార్థులంతా జిల్లాలో విద్యనభ్యసిస్తున్నారు. ఇందులో 40 శాతం విద్యార్థులు 2013-14 విద్యా సంవత్సరంలో కోర్సు పూర్తి చేయగా, మిగతా విద్యార్థులు కోర్సు మధ్య దశలో ఉన్నారు. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకారవేతనాలు పెద్దఎత్తున బకాయి పడ్డాయి. తాజాగా రాష్ట్ర విభజన ప్రక్రియతో ఉపకారవేతనాలు ఎలా అందుతాయనే అంశం విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తోంది.
బకాయిలు రూ.300 కోట్లకు పైమాటే..!
2013-14 విద్యాసంవత్సరానికి సంబంధించి జిల్లాలోని సంక్షేమశాఖలకు పూర్తిస్థాయి నిధులు అందలేదు. ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటికీ ఎన్నికలు, ఇతర రాజకీయ పరిణామాలు నిధుల విడుదలకు ఆటంకంగా మారాయి. రాష్ట్ర విభజన ప్రక్రియ వేగవంతంగా సాగినప్పటికీ.. విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలపై మాత్రం ఒకింత నిర్లక్ష్యం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గడిచిన విద్యాసంవత్సరంలో కోట్ల రూపాయలు బకాయిపడింది. జిల్లా బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 2.02లక్షల మంది విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయిం బర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాల్సి ఉండగా.. ఇందు లో సగం మందికి మాత్రమే ఇప్పటివరకు నిధులు విడుదలయ్యాయి. దీంతో బీసీ కేటగిరీలో రూ.169 కోట్ల రీయిం బర్స్‌మెంట్ నిధులు, రూ.39కోట్ల ఉపకారవేతనాలు బకాయిపడ్డాయి. ఈబీసీ కేటగిరీలో రూ.72 కోట్ల రీయింబర్స్‌మెంట్ బకాయి పడ్డాయి. ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖలకు సంబంధించి మరో రూ.20కోట్లు బకాయిలున్నాయి.
అధికారుల్లో అయోమయం..
ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకారవేతన నిధులపై అధికార వర్గాల్లోనూ అయోమయం నెలకొంది. ఈ రెండు పథకాల్లో భాగంగా రాష్ట్రంలోనే అత్యధిక నిధులు జిల్లాకు వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్న నేపథ్యంలో నిధులు ఎక్కువగా కేటాయించాల్సి వస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర విభజన ప్రక్రియ దాదాపు పూర్తికావడంతో బకాయిల అంశంపై అధికారుల్లో స్పష్టత కొరవడింది. మిగులు నిధులు జూన్ చివరికల్లా వస్తాయని అధికారులు చెబుతున్నారు. శనివారంతో ఉమ్మడి ఖాతా మూసివేస్తుండడంతో కొత్త రాష్ట్రంలో ఏర్పాటయ్యే ఖాతా ద్వారా నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. అయితే తెలంగాణ ప్రాంత విద్యార్థులకే నిధులు విడుదల చేస్తారా.. సీమాంధ్ర ప్రాంత విద్యార్థుల ఫీజులకు సంబంధించిన నిధులు కూడా విడుదల చేస్తారా.. లేక విద్యార్థులందరికీ లబ్ధి చేకూరుస్తారా అనే ప్రశ్నకు అధికారవర్గాల నుంచి సరైన సమాధానం రాకపోవడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
ఫీజు బకాయి.. ఎవరు కడ్తరు!
Published Fri, May 23 2014 11:54 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement
Advertisement