కర్నూలు(అర్బన్) : చదువుపైనే దృష్టి పెట్టాల్సిన విద్యార్థులు.. దురదృష్ణవశాత్తు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ సమస్య మరింత తీవ్రరూపం దాల్చింది. బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఇబ్బందిపడే పరిస్థితి నెలకొంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరి నెలన్నర గడుస్తున్నా విద్యార్థుల ప్రధాన సమస్య అయిన ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలపై దృష్టి సారించకపోవడం దురదృష్టకరం.
గత ఏడాదికి సంబంధించిన ఫీజులు, ఉపకార వేతనాలను ప్రభుత్వం నేటికీ విడుదల చేయకపోవడంతో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థులు అందోళనకు గురవుతున్నారు. విద్యా సంవత్సరం పూర్తి అయి కళాశాలలు పునః ప్రారంభమైనా, నేటికీ జిల్లాలోని ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీలకు చెందిన సుమారు 44 వేల మంది విద్యార్థులకు ప్రభుత్వం రూ.93 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలను బకాయి పడింది. ఫీజు విడుదలకు సంబంధించి రాష్ట్ర అర్థిక పరిస్థితిని పాలకవర్గాలు సాకుగా చూపిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఏటా జరుగుతున్నట్లే ఈ సారి కూడా ఫీజుల చెల్లింపు ప్రహసనంగా మారింది.
ఇప్పటికే ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, మెడికల్, ఇంజనీరింగ్ తదితర ఉన్నత చదువులతో పాటు ఐటీఐ, పాలిటెక్నిక్, నర్సింగ్, బీఈడీ తదితర వృత్తి కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు కూడా ఉపకార వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు. రెన్యూవల్ విద్యార్థులతో పాటు గత ఏడాది వివిధ కోర్సుల్లో చేరిన కొత్త విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ అందలేదు. అయితే జిల్లాలోని పలు కళాశాలలకు చెందిన ప్రిన్సిపాళ్లు కూడా విద్యార్థులకు సంబంధించిన హార్డ్‌కాపీలను పంపించడంలో చేస్తున్న జాప్యం వల్ల కూడా అర్హులైన విద్యార్థులకు ఫీజులు, ఉపకార వేతనాలు అందనట్లు తెలుస్తోంది.
దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, బడ్జెట్ విడుదల తదితర విషయాల్లో అధికార యంత్రాంగం చూపుతున్న నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారుతోంది. ఫీజు విడుదలలో జరుగుతున్న జాప్యం వల్ల ఆయా కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారికి సర్టిఫికెట్లను అందించడంలో పలు కళాశాలలకు చెందిన యాజమాన్యాలు ఫీజులను చెల్లించాలని ఒత్తిడి తీసుకువస్తున్నట్లు విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. మరికొన్ని యాజమాన్యాలు రెన్యూవల్ విద్యార్థులను ఫీజులు చెల్లించాలని, ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మళ్లీ వెనక్కు ఇస్తామని చెబుతున్నట్లు వారు ఆరోపిస్తున్నారు.
నేటికీ అందని ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు
Published Sat, Jul 19 2014 1:11 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement