Post-matric students
-
ఫీజు చెల్లింపులకు రెండు పద్దులు
సాక్షి, హైదరాబాద్: పోస్టు మెట్రిక్ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ పంపిణీలో కొత్త విధానం అమల్లోకి రానుంది. ప్రస్తుతం ప్రాధాన్యత క్రమంలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ.. ఇకపై రెండు కేటగిరీల్లో ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణంగా ఫీజు రీయింబర్స్మెంట్ కింద ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత ప్రాధాన్యత క్రమంలో తొలుత ఫైనలియర్ విద్యార్థులకు ఫీజులు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో అధిక మొత్తంలో నిధులు వృత్తి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకే చెల్లించా ల్సి వస్తోంది. దీంతో అధిక సంఖ్యలో ఉన్న జనరల్ విద్యార్థులకు వచ్చేసరికి అరకొరగా నిధులుండటంతో వాటినే సర్దుబాటు చేస్తున్నారు. దీంతో జనరల్ కేటగిరీలకు ఫీజుల పంపిణీలో జాప్యం నెలకొంటోంది. ఈ పరిస్థితి తలెత్తకుండా జనరల్, టెక్నికల్ విద్యార్థులకు సమానంగా ఫీజులివ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండు పద్దులుగా విభజన ప్రస్తుతం ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల నిధులను ప్రభుత్వం ఒకే పద్దు కింద సంక్షేమ శాఖలకు విడుదల చేస్తోంది. వీటిని జిల్లాల వారీగా విడుదల చేస్తూ అక్క డి నుంచి విద్యార్థులకు అందజేస్తున్నారు. తాజాగా కొత్త విధానాన్ని అమలు చేయనుండటంతో ప్రభుత్వం సంక్షేమ శాఖలకు రెండు పద్దులు ఏర్పాటు చేయనుంది. ప్రతి శాఖలో జనరల్ కేటగిరీగా ఏ, వృత్తివిద్య కేటగిరీగా ‘బి’పేరుతో రెండు పద్దులను విభజించి నిర్వహించనున్నారు. ‘ఏ’ కేటగిరీలో ఇంటర్, జనరల్ డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్, పాలిటెక్నిక్ కోర్సులుంటాయి. కేటగిరీ ‘బి’లో ఇంజనీరింగ్, ఎంటెక్‌తోపాటు వృత్తి విద్యకు సంబంధించిన ఇతర కేటగిరీలుంటాయి. 63 శాతం విద్యార్థులు.. 44శాతం నిధులు ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల కింద ఏటా 13 లక్షల దరఖాస్తులు వస్తున్నా యి. దీనికి ప్రభుత్వం ఏటా రూ.2,250 కోట్లు ఖర్చు చేస్తోంది. వీటిలో ‘ఏ’ కేటగిరీకి సంబంధించి 63 శాతం విద్యార్థులుండగా.. బడ్జెట్లో మాత్రం 44 శాతమే వీరికి వినియోగిస్తున్నారు. వృత్తి విద్యావిభాగంలో 37% విద్యార్థులకు ఏకంగా 56 శాతం బడ్జెట్ వినియోగిస్తున్నారు. దీంతో జనరల్ కోటా చెల్లిం పులకు తదుపరి విడుదలయ్యే నిధులపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ క్రమంలో జూనియర్, డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు ఫీజుల పంపిణీలో అన్యాయం జరుగుతోందంటూ ఎస్సీ అభివృద్ధి శాఖ వద్ద పలుమార్లు మొర పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకుడు కరుణాకర్ కొత్త విధానానికి సంబంధించిన కార్యాచరణను ప్రభుత్వానికి పంపారు. మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల కమిటీ ఈ విధానంపై చర్చించి ప్రత్యేక ప్రధాన కార్య దర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఆధ్వర్యంలో ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శులతో మరో కమిటీని ఏర్పాటు చేసింది. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన ఈ కమిటీ.. రెండు పద్దుల విధానాన్ని ఆమోదం తెలుపుతూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ప్రభుత్వం త్రైమాసికాల వారీగా విడుదల చేసిన నిధులను రెండు పద్దులకు సమానంగా కేటాయిస్తారు. అక్టోబర్ నుంచి అమలు ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల పంపిణీలో కొత్త విధానం అక్టోబర్ నుంచి అమలు కానుంది. ఆలోపు పద్దుల విభజన.. కేటాయింపుల ప్రక్రియ పూర్తి కానుంది. 2014–15, 2015–16 విద్యా సంవత్సరాలకు సంబంధించి 99 శాతం పంపిణీ పూర్తయింది. అలాగే 2016–17 విద్యా సంవత్సరానికి సంబంధించి 89.31 శాతం నిధులు విడుదలయ్యాయి. 2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించి 40 శాతం విద్యార్థులకు ఇప్పటికే పంపిణీ చేశారు. ప్రస్తుతం వార్షిక సంవత్సరంలో రెండు త్రైమాసికాలకు సంబంధించి నిధులు విడుదల కాగా.. పరిశీలన పూర్తయిన దరఖాస్తు లకు సంబంధించి నిధులు రిలీజ్ చేస్తున్నారు. మూడో త్రైమాసికం అక్టోబర్ నుంచి ప్రారంభం కానుండగా.. అప్పటి నుంచి కొత్త విధానాన్ని అమలు చేస్తామని, ఆలోపు క్షేత్రస్థాయిలో సంక్షేమాధికారులకు అవగాహన కల్పిస్తామని కరుణాకర్ ‘సాక్షి’కి తెలిపారు. -
ఎస్సీ విద్యార్థుల ఫీజు గడువును పెంచండి
న్యూఢిల్లీ: పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలను అందుకునే ఎస్సీ విద్యార్థులకు ఫీజు చెల్లింపు గడువును పెంచేలా ఆయా విద్యాసంస్థలకు ఉత్తర్వులు జారీచేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ ఆదేశించింది. విద్యార్థుల ఖాతాల్లోకి ఫీజుతో పాటు ఉపకార వేతనం నగదు జమఅయ్యేంత వరకూ ఈ గడువును పెంచాలని కోరింది.. ఫీజు చెల్లింపులు ఆలస్యమవుతున్నాయన్న కారణంతో పలు విద్యాసంస్థలు ఎస్సీ విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు మార్గదర్శకాలను జారీచేసింది. బ్యాంక్ ఖాతాలో ఫీజు డిపాజిట్ కాగానే వెంటనే చెల్లిస్తామని విద్యార్థుల నుంచి కాలేజీలు హమీపత్రం తీసుకోవాలని సూచించింది. -
ఫీజు బకాయి.. ఎవరు కడ్తరు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర విభజన అంశం జిల్లాలోని పోస్టుమెట్రిక్ విద్యార్థులకు కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టింది. శనివారం నాటితో సమైఖ్య రాష్ట్రానికి ఉన్న ఉమ్మడి ఖజానా ఖాతాకు గడువు ముగుస్తుంది. దీంతో ఈ పథకం అమలుతీరు విద్యార్థుల్లో వణుకు పుట్టిస్తోంది. 2013-14 విద్యాసంవత్సరానికి సంబంధించి జిల్లాలో ఫీజు రీయింబర్స్‌మెంటు, ఉపకారవేతనాలకు సంబంధించి కోట్ల రూపాయిలు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఉమ్మడి ఖజానా ఖాతాకు కాలం చెల్లనున్న నేపథ్యంలో ఈ బకాయిల చెల్లింపు ప్రక్రియ ఎలా ఉంటుందనే అంశం విద్యార్థులను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. జిల్లాలో 1,046 ఇంటర్మీడియట్, వృత్తివిద్యా కళాశాలలున్నాయి. వీటి పరిధిలో దాదాపు మూడులక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రాజధానికి చుట్టూ జిల్లా విస్తరించి ఉండడం, నగర శివారు ప్రాంతాల్లో అత్యధికంగా వృత్తి విద్యా కళాశాలలుండడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల విద్యార్థులంతా జిల్లాలో విద్యనభ్యసిస్తున్నారు. ఇందులో 40 శాతం విద్యార్థులు 2013-14 విద్యా సంవత్సరంలో కోర్సు పూర్తి చేయగా, మిగతా విద్యార్థులు కోర్సు మధ్య దశలో ఉన్నారు. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతనాలు పెద్దఎత్తున బకాయి పడ్డాయి. తాజాగా రాష్ట్ర విభజన ప్రక్రియతో ఉపకారవేతనాలు ఎలా అందుతాయనే అంశం విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తోంది. బకాయిలు రూ.300 కోట్లకు పైమాటే..! 2013-14 విద్యాసంవత్సరానికి సంబంధించి జిల్లాలోని సంక్షేమశాఖలకు పూర్తిస్థాయి నిధులు అందలేదు. ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటికీ ఎన్నికలు, ఇతర రాజకీయ పరిణామాలు నిధుల విడుదలకు ఆటంకంగా మారాయి. రాష్ట్ర విభజన ప్రక్రియ వేగవంతంగా సాగినప్పటికీ.. విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలపై మాత్రం ఒకింత నిర్లక్ష్యం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గడిచిన విద్యాసంవత్సరంలో కోట్ల రూపాయలు బకాయిపడింది. జిల్లా బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 2.02లక్షల మంది విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయిం బర్స్మెంట్ నిధులు విడుదల చేయాల్సి ఉండగా.. ఇందు లో సగం మందికి మాత్రమే ఇప్పటివరకు నిధులు విడుదలయ్యాయి. దీంతో బీసీ కేటగిరీలో రూ.169 కోట్ల రీయిం బర్స్మెంట్ నిధులు, రూ.39కోట్ల ఉపకారవేతనాలు బకాయిపడ్డాయి. ఈబీసీ కేటగిరీలో రూ.72 కోట్ల రీయింబర్స్మెంట్ బకాయి పడ్డాయి. ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖలకు సంబంధించి మరో రూ.20కోట్లు బకాయిలున్నాయి. అధికారుల్లో అయోమయం.. ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతన నిధులపై అధికార వర్గాల్లోనూ అయోమయం నెలకొంది. ఈ రెండు పథకాల్లో భాగంగా రాష్ట్రంలోనే అత్యధిక నిధులు జిల్లాకు వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్న నేపథ్యంలో నిధులు ఎక్కువగా కేటాయించాల్సి వస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర విభజన ప్రక్రియ దాదాపు పూర్తికావడంతో బకాయిల అంశంపై అధికారుల్లో స్పష్టత కొరవడింది. మిగులు నిధులు జూన్ చివరికల్లా వస్తాయని అధికారులు చెబుతున్నారు. శనివారంతో ఉమ్మడి ఖాతా మూసివేస్తుండడంతో కొత్త రాష్ట్రంలో ఏర్పాటయ్యే ఖాతా ద్వారా నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. అయితే తెలంగాణ ప్రాంత విద్యార్థులకే నిధులు విడుదల చేస్తారా.. సీమాంధ్ర ప్రాంత విద్యార్థుల ఫీజులకు సంబంధించిన నిధులు కూడా విడుదల చేస్తారా.. లేక విద్యార్థులందరికీ లబ్ధి చేకూరుస్తారా అనే ప్రశ్నకు అధికారవర్గాల నుంచి సరైన సమాధానం రాకపోవడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.