సాక్షి, హైదరాబాద్: పోస్టు మెట్రిక్ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ పంపిణీలో కొత్త విధానం అమల్లోకి రానుంది. ప్రస్తుతం ప్రాధాన్యత క్రమంలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ.. ఇకపై రెండు కేటగిరీల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత ప్రాధాన్యత క్రమంలో తొలుత ఫైనలియర్ విద్యార్థులకు ఫీజులు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో అధిక మొత్తంలో నిధులు వృత్తి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకే చెల్లించా ల్సి వస్తోంది. దీంతో అధిక సంఖ్యలో ఉన్న జనరల్ విద్యార్థులకు వచ్చేసరికి అరకొరగా నిధులుండటంతో వాటినే సర్దుబాటు చేస్తున్నారు. దీంతో జనరల్ కేటగిరీలకు ఫీజుల పంపిణీలో జాప్యం నెలకొంటోంది. ఈ పరిస్థితి తలెత్తకుండా జనరల్, టెక్నికల్ విద్యార్థులకు సమానంగా ఫీజులివ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రెండు పద్దులుగా విభజన
ప్రస్తుతం ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల నిధులను ప్రభుత్వం ఒకే పద్దు కింద సంక్షేమ శాఖలకు విడుదల చేస్తోంది. వీటిని జిల్లాల వారీగా విడుదల చేస్తూ అక్క డి నుంచి విద్యార్థులకు అందజేస్తున్నారు. తాజాగా కొత్త విధానాన్ని అమలు చేయనుండటంతో ప్రభుత్వం సంక్షేమ శాఖలకు రెండు పద్దులు ఏర్పాటు చేయనుంది. ప్రతి శాఖలో జనరల్ కేటగిరీగా ఏ, వృత్తివిద్య కేటగిరీగా ‘బి’పేరుతో రెండు పద్దులను విభజించి నిర్వహించనున్నారు. ‘ఏ’ కేటగిరీలో ఇంటర్, జనరల్ డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్, పాలిటెక్నిక్ కోర్సులుంటాయి. కేటగిరీ ‘బి’లో ఇంజనీరింగ్, ఎంటెక్‌తోపాటు వృత్తి విద్యకు సంబంధించిన ఇతర కేటగిరీలుంటాయి.
63 శాతం విద్యార్థులు.. 44శాతం నిధులు
ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల కింద ఏటా 13 లక్షల దరఖాస్తులు వస్తున్నా యి. దీనికి ప్రభుత్వం ఏటా రూ.2,250 కోట్లు ఖర్చు చేస్తోంది. వీటిలో ‘ఏ’ కేటగిరీకి సంబంధించి 63 శాతం విద్యార్థులుండగా.. బడ్జెట్‌లో మాత్రం 44 శాతమే వీరికి వినియోగిస్తున్నారు. వృత్తి విద్యావిభాగంలో 37% విద్యార్థులకు ఏకంగా 56 శాతం బడ్జెట్ వినియోగిస్తున్నారు. దీంతో జనరల్ కోటా చెల్లిం పులకు తదుపరి విడుదలయ్యే నిధులపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ క్రమంలో జూనియర్, డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు ఫీజుల పంపిణీలో అన్యాయం జరుగుతోందంటూ ఎస్సీ అభివృద్ధి శాఖ వద్ద పలుమార్లు మొర పెట్టుకున్నాయి.
ఈ నేపథ్యంలో స్పందించిన ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకుడు కరుణాకర్ కొత్త విధానానికి సంబంధించిన కార్యాచరణను ప్రభుత్వానికి పంపారు. మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల కమిటీ ఈ విధానంపై చర్చించి ప్రత్యేక ప్రధాన కార్య దర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఆధ్వర్యంలో ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శులతో మరో కమిటీని ఏర్పాటు చేసింది. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన ఈ కమిటీ.. రెండు పద్దుల విధానాన్ని ఆమోదం తెలుపుతూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ప్రభుత్వం త్రైమాసికాల వారీగా విడుదల చేసిన నిధులను రెండు పద్దులకు సమానంగా కేటాయిస్తారు.
అక్టోబర్ నుంచి అమలు
ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల పంపిణీలో కొత్త విధానం అక్టోబర్ నుంచి అమలు కానుంది. ఆలోపు పద్దుల విభజన.. కేటాయింపుల ప్రక్రియ పూర్తి కానుంది. 2014–15, 2015–16 విద్యా సంవత్సరాలకు సంబంధించి 99 శాతం పంపిణీ పూర్తయింది. అలాగే 2016–17 విద్యా సంవత్సరానికి సంబంధించి 89.31 శాతం నిధులు విడుదలయ్యాయి. 2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించి 40 శాతం విద్యార్థులకు ఇప్పటికే పంపిణీ చేశారు. ప్రస్తుతం వార్షిక సంవత్సరంలో రెండు త్రైమాసికాలకు సంబంధించి నిధులు విడుదల కాగా.. పరిశీలన పూర్తయిన దరఖాస్తు లకు సంబంధించి నిధులు రిలీజ్ చేస్తున్నారు. మూడో త్రైమాసికం అక్టోబర్ నుంచి ప్రారంభం కానుండగా.. అప్పటి నుంచి కొత్త విధానాన్ని అమలు చేస్తామని, ఆలోపు క్షేత్రస్థాయిలో సంక్షేమాధికారులకు అవగాహన కల్పిస్తామని కరుణాకర్ ‘సాక్షి’కి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment