భద్రాచలం, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో.... జూన్ 2 తరువాత భద్రాచలం, పాల్వంచ డివిజన్‌లలోని 211 గ్రామాలను జిల్లా నుంచి వేరు చేసి అవశేష ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. కానీ ముంపు మండలాల్లో సరిహద్దుల ఏర్పాటు విషయంలో తలెత్తే సమస్యలపై అధికారుల నుంచి సరైన స్పష్టత లేకపోవటం తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. ముంపు గ్రామాలను జిల్లా నుంచి వేరుచేయటమే తమ పని అన్నట్లుగా అధికారులు నివేదికల తయారీలో నిమగ్నమయ్యారు. అయితే ముంపు ప్రాంత ప్రజానీకం, ఉద్యోగుల్లో తలెత్తే అనుమానాలను నివృత్తి చేసేవారు లేకపోవటంతో అంతటా అయోమయం నెలకొంది.
కొత్త చిక్కులు....
ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేసే క్రమంలో కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. ముంపు పరిధిలో ఉన్న గ్రామాలనే పరిగణలోకి తీసుకొని అధికారులు విభజన నివేదికలు తయారు చేస్తున్నారు. ఈ కారణంగా మధ్యలో మిగిలిపోతున్న గ్రామాలు తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి వస్తున్నాయి. అంటే చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామాలు ఉంటే మధ్యలో మాత్రం తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలు ఉంటాయి. ముంపు పరిధిలోకి వచ్చే ఏడు మండలాల్లో వీఆర్‌పురం, కూనవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వెళ్లిపోతున్నట్లుగానే అందరూ భావించారు.
కానీ వాస్తవంగా ఈ మండలాల్లో కూడా కొన్ని గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటాయి. కూనవరం మండలాన్నే పరిశీలిస్తే... వాస్తవంగా ఇక్కడ 56 రెవెన్యూ గ్రామాలు ఉండగా, ఇందులో 39 గ్రామాలు ముంపు పరిధిలోకి వస్తున్నాయి. ఈ మండలంలో 26,597 మంది జనాభా ఉంటే, ఇందులో 22,795 మందిని ఇక్కడ నుంచి వేరుచేస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ ప్రకటించిన జాబితాలో పేర్కొన్నారు. అంటే మరో 3,802 మంది తెలంగాణ రాష్ట్రంలోనే ఉండిపోతారు. ఇలా మిగిలిపోయిన జనాభా ఉన్న గ్రామాల చుట్టూ ఆంధ్ర ప్రదేశ్‌రాష్ట్రంలోకి వెళ్లే గ్రామాలు ఉంటాయి. వీరంతా గ్రామం నుంచి భద్రాచలం, జిల్లా కేంద్రమైన ఖమ్మం ప్రాంతాలకు రావాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామాల మీదుగా ప్రయాణించాల్సిందే. ముంపు పరిధిలో గల దాదాపు ఏడు మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.
గుట్ట దిగితే ఆంధ్ర...ఎక్కితే తెలంగాణ..!
ముంపు మండలాల్లో ఉన్న కొండరెడ్డి గ్రామాల పరిస్థితి మరింత గందరగోళంగా ఉంది. కూనవరం, వీఆర్‌పురం, వేలేరుపాడు మండలాల్లో గుట్టలపై ఉన్న కొండరెడ్డి గ్రామాలు ముంపు పరిధిలో రాకపోవటంతో ఈ గ్రామాలు తెలంగాణలోనే ఉంటాయి. ఇలా కూనవరం మండలంలో 10 గ్రామాలు, వేలేరుపాడులో ఒకటి, వీఆర్‌పురం మండ లంలో ఒక గ్రామం ఉంది. వీరు నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాలన్నా గుట్టలు దిగి రావాల్సిందే. ఉదాహరణకు కూనవరం మండలంలో గుట్టలపై ఉన్న గ్రామాల వారు కూటూరు వద్ద గుట్ట దిగుతారు. కానీ ప్రస్తుతం కూటూరు ముంపులో ఉన్నందున ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం అవుతుంది.దీంతో తెలంగాణలో ఉన్న గుట్టలపై నుంచి కింద ఉన్న ఆంధ్రప్రదే శ్ రాష్ట్రంలోని గ్రామాలకు రావాల్సిందే. ఈ కారణంగా అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు.
శరవేగంగా విభజన ఏర్పాట్లు
జూన్ 2 తరువాత ముంపు గ్రామాలకు అన్ని రకాల సేవలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే అందుతాయని ఉన్నతాధికారులు నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఇందుకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ముంపు గ్రామాల్లోని ప్రభుత్వ ఆస్తులు, స్థిర, చరాస్తులను ఆయా శాఖల ఆధ్వర్యంలో లెక్క గట్టి నివేదికలు సిద్ధం చేస్తున్నారు. అదే విధంగా ముంపు పరిధిలోకి ఎంత మంది సిబ్బంది వస్తున్నారనే దానిపై కూడా నివేదికలు రెడీ అవుతున్నాయి. మొత్తంగా... ప్రజానీకంలో నెలకొన్న అయోమయంపై సరైన స్పష్టత ఇవ్వకుండానే ముంపు గ్రామాలను విలీనం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తుండటంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.
రాష్ట్ర విభజన నేపథ్యం గందరగోళం
Published Tue, May 13 2014 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 7:16 AM
Advertisement
Advertisement