భద్రాచలం : భద్రాచలం అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు ఈ ప్రాంత వాసులు మరో ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొదట భద్రాచలాన్నే కొత్తగా జిల్లా చేస్తారని ఇక్కడి వారు భావించారు. అయితే ప్రభుత్వం ఇటీవల పేర్కొన్న ఏడింటిలో భద్రాచలం లేకపోవడంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో భద్రాచలం, పాల్వంచ డివిజన్‌లలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించగా, దీనిపై పెద్దఎత్తున ఉద్యమాలు లేచాయి. అయినప్పటికీ భద్రాచలం డివిజన్‌లోని నాలుగు మండలాలు ఏపీకి వెళ్లిపోయాయి.
రామాలయాన్ని దృష్టిలో ఉంచుకొని భద్రాచలం రెవెన్యూ గ్రామాన్ని మాత్రమే తెలంగాణకు మినహాయిం చటంతో ఇది పట్టణ అభివృద్ధిపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. కేవలం 2040ఎకరాల పరిధిలో ఉన్న భద్రాచలం రెవెన్యూ గ్రామంలో ఇప్పటికే స్థిర నివాసాల కోసమని ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించారు. ఇక కొత్త నిర్మాణాలు చేపట్టాలంటే సెంటుభూమి కూడా అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాలు ఇప్పటికే భద్రాచలం పట్టణ అభివృద్ధిపై పడ్డాయి. వ్యాపార లావాదేవీలు పూర్తిగాతగ్గిపోయాయి. భూము ల ధరలూ పడిపోయాయి. భవిష్యత్‌లో భద్రాచలం పట్టణం అస్థిత్వం కోల్పోయే ప్రమాదం ఉందని భావించిన పట్టణ వాసు లు దీన్ని కాపాడుకునేందకు ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు.
అఖిలపక్షం కమిటీ ఏర్పాటు...: భద్రాచలాన్ని జిల్లా కేంద్రం గా చేయాలనే డిమాండ్‌తో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని స్థానికులు భావిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం భద్రాచలం జిల్లా అయ్యేలా చూడాలంటూ సీతారామచంద్రస్వామికి వినతిపత్రం అందజేశారు. ఆందోళన కార్యక్రమాల కోసం ఓ కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి కన్వీనర్‌గా కోడూరి సత్యనారాయణ, సభ్యులుగా పి.సత్యనారాయణ, డాక్టర్ ఎస్‌ఎల్ కాంతారావును ఎన్నికయ్యారు.
నేడు రౌండ్ టేబుల్ సమావేశం...: భవిష్యత్ ఉద్యమాలను చేపట్టేందుకు ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల వారు హాజరు కావాలని అఖిల పక్షం కన్వీనర్ సత్యనారాయణ కోరారు.
భద్రాద్రి కోసం మరో ఉద్యమం
Published Sun, Sep 14 2014 2:58 AM | Last Updated on Sat, Jun 2 2018 2:56 PM
Advertisement
Advertisement