పోస్టుల పంపిణీ దాదాపు పూర్తి!
- రాష్ట్ర స్థాయి కేడర్‌లోని 76 శాఖల్లోనూ కొలిక్కి
- ఆంధ్రాకు 22,728 పోస్టులు, తెలంగాణకు 15,922 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో కీలకమైన రాష్ట్ర స్థాయి ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేసే అంశం కొలిక్కి వచ్చింది. మెజారిటీ శాఖలకు చెందిన పోస్టులను కమలనాథన్ కమిటీ ఇప్పటికే ఇరు రాష్ట్రాలకూ పంపిణీని పూర్తి చేసింది. మొత్తం 89 శాఖలకు చెందిన రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టుల్లో ఇప్పటి వరకు సచి వాలయంతో సహా 76 శాఖలకు చెందిన పోస్టులను జనాభా నిష్ప త్తి ఆధారంగా ఇటు తెలంగాణ, అటు ఏపీలకు పంపిణీ చేశారు.
ఈ పోస్టుల పంపిణీలో ఖాళీలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఖాళీలను కూడా కలపి ఇరు రాష్ట్రాలకు పంపిణీ పూర్తి చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అంతే కాకుండా పోస్టుల పంపిణీ పూర్తి చేసిన 76 శాఖలకుగాను ఇప్పటికే 51 శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆప్షన్లను కూడా ఇచ్చారు. మరో 25 శాఖలకు చెందిన ఆప్షన్లకు చెందిన ఫైళ్లు సర్కులేషన్‌లో ఉన్నాయి. ఈ నెల చివరి వారానికి ఇరు రాష్ట్రాల మధ్య పోస్టుల పంపిణీ పూర్తి అవుతుందని.. ఆప్షన్లు ఇచ్చిన శాఖల్లో ఉద్యోగుల పంపిణీ ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తామని కమలనాథన్ కమిటీ పేర్కొంది.
తగ్గిన ఉద్యోగులు..
ఇప్పటి వరకు సచివాలయంతో సహా 76 శాఖలకు చెందిన 38,650 రాష్ట్ర స్థాయి కేడర్ పోసులను ఏపీ, తెలంగాణలకు పంపిణీ చేశా రు. అయితే ఈ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు మాత్రం పోస్టుల కన్నా తక్కువగా ఉన్నారు. పంపిణీ చేసిన పోస్టులతో చూస్తే ఉద్యోగుల సంఖ్య మాత్రం 14,379 మంది తక్కువగా ఉన్నట్లు తేలింది. 76 శాఖల్లో 24,271 మంది ఉద్యోగులున్నట్లు కమలనాథన్ కమిటీ తేల్చింది. ఈ ఉద్యోగులనే ఇరు రాష్ట్రాల మధ్య నిబంధనల ఆధారంగా పంపిణీ చేశారు.
సచివాలయంలోని నాలుగో తరగతి ఉద్యోగులందరినీ తామే తీసుకుంటామని తెలంగాణ సీఎం కేసీఆర్ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘానికి హామీ ఇచ్చారు. తాజా పరిణామాల నేపథ్యం లో తాము తీసుకోబోమంటూ ఏపీ ప్రభుత్వానికి టీ సర్కార్ వెల్లడించింది.
అదే కారణమా?
ఏపీ విభజన చట్టంలోని 9వ షెడ్యూల్‌లో ఉన్న సంస్థల ఉద్యోగులను స్థానికత ఆధారంగా పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. అయితే, ఈ ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. జనాభా నిష్పత్తి ప్రకారమే ఉద్యోగుల పంపిణీ జరగాలని ఏపీ కోరుతోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం నాలుగో తరగతి ఉద్యోగుల విషయంలో మాట మార్చిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.