కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు స్థానంలో తెరపైకి కాలేజ్ సర్వీస్ కమిషన్
కమిషన్ ఏర్పాటయ్యే వరకు నియామకాలు చేపట్టకూడదని భావిస్తున్న ప్రభుత్వం!
ఇప్పటివరకు ఖరారు కాని విధివిధానాలు
ఇప్పటికే వర్సిటీల్లో బోధన, బోధనేతర సిబ్బంది కలిపి 3 వేలకు పైగా ఖాళీలు
విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయంటున్న నిపుణులు
సాక్షి, హైదరాబాద్: కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు స్థానంలో కాలేజ్ సర్వీస్ కమిషన్ ఏర్పాటయ్యే వరకు వర్సిటీల్లో నియామకాలు చేపట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కమిషన్ ఏర్పాటు ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. ప్రభుత్వం త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీని విధివిధానాలపై ఇంకా పూర్తిస్థాయిలో స్పష్టత రాలేదు. కమిషన్ ఏర్పాటై, విధివిధానాలు ఖరారైన తర్వాతే బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల విషయంలో ముందుకెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో రిక్రూట్‌మెంట్‌ను వాయిదా వేయడానికే ఇలా చేస్తున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. కమిషన్ విషయంలో కొన్ని చట్టపరమైన సందేహాలు సైతం పలువురు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
నియామకాలెప్పుడో..?
కాలేజ్ సర్వీస్ కమిషన్ కొత్తదేం కాదు. ఉమ్మడి రాష్ట్రంలో 1985లోనే దీన్ని ఏర్పాటు చేశారు. వర్సిటీల వీసీలు, ఉన్నత విద్యారంగ నిపుణులతో ఇది ఏర్పడుతుంది. అయితే 2000 సంవత్సరం వరకు పనిచేసిన కమిషన్ అప్పట్లో ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకుల నియామకాలకే పరిమితమైంది. తర్వాత దీనిని పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో కలిపేశారు. విశ్వవిద్యాలయాల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు ఆయా వర్సిటీల వీసీల నేతృత్వంలో జరుగుతుండగా.. 2014–2022 మధ్య యూనివర్సిటీల్లో ఎలాంటి నియామకాలు చేపట్టలేదు.
దీంతో పెద్ద ఎత్తున ఖాళీలు ఏర్పడ్డాయి. అన్నివైపుల నుంచి ఒత్తిడి రావడంతో 2022 సెప్టెంబర్ 12న కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేశారు. ఏ వర్సిటీకి ఆ వర్సిటీ నియామకాలు చేపడుతుండటం వల్ల అవకతవకలు జరుగుతున్నాయని, అన్ని వర్సిటీలకు కలిపి బోర్డు నియామకాలు అప్పట్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ అప్పట్నుంచీ కూడా బోర్డు ఎలాంటి నియామకాలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే యూనివర్సిటీల్లో బోధన, బోధనేతర కలిపి 3 వేలకు పైగా పోస్టులు ఖాళీ అయ్యాయి. వీటిని భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తున్నా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. తాజాగా మళ్లీ కాలేజ్ సర్వీస్ కమిషన్ తెరపైకి రావడంతో నియామకాలు ఇప్పట్లో జరుగుతాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తేడా ఏంటి?
ప్రభుత్వ నిర్ణయంతో కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు, కాలేజ్ సర్వీస్ కమిషన్‌కు తేడా ఏంటనే చర్చ మొదలైంది. రెండు దశాబ్దాల క్రితం కాలం చెల్లిన కమిషన్‌ను ఎందుకు తెస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. బోర్డు నిబంధనల ప్రకారం నియామకాలు చేపట్టాలంటే..తొలుత వర్సిటీలు ఖాళీలను వెల్లడిస్తాయి. అన్ని వర్సిటీలకు కలిపి బోర్డు ఉమ్మడిగా పరీక్ష నిర్వహిస్తుంది. మెరిట్ ఆధారంగా బోధన, బోధనేతర సిబ్బందిని ఎంపిక చేసి వర్సిటీలకు సిఫారసు చేస్తుంది. ఇందులో వీసీల ప్రమేయం ఏమాత్రం ఉండదు. ఇక సర్వీస్ కమిషన్‌కు వచ్చేసరికి ఖాళీలను కమిషనే గుర్తిస్తుంది. ఎందుకంటే ప్రతి యూనివర్సిటీ వీసీ ఇందులో సభ్యులుగా ఉంటారు. నియామకాల ప్యానెల్‌లోనూ వీసీ ఉంటారు. కాబట్టి వీసీల పెత్తనానికి అవకాశం ఉంటుంది. అయితే వీసీలు అవినీతికి పాల్పడుతున్నారని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో వీసీ పెత్తనానికి అవకాశం ఉన్న కాలేజ్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చర్చనీయాంశమవుతోంది.
కమిషన్ ఎలా చెల్లుతుంది?
కాలేజ్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసేటప్పుడు చట్టపరమైన సమస్యలను పరిశీలించాలి. వర్సిటీలు యూజీసీ పరిధిలో ఉంటాయి. యూజీసీ అనుమతి లేకుండా, కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయకుండా కమిషన్ ద్వారా వర్సిటీల అధ్యాపకులను నియమించడం చట్టపరంగా ఎలా చెల్లుతుంది? – ప్రొఫెసర్ గట్టు సత్యనారాయణ (పూర్వ కాలేజ్ కమిషన్ సభ్యుడు)
ఏదో ఒక సాకుతో జాప్యం సరికాదు
బోర్డును రద్దు చేస్తారో..కాలేజ్ సర్వీస్ కమిషన్‌ను తెస్తారో..ఏదో ఒకటి చేసి తక్షణం యూనివర్సిటీల్లో నియామకాలు చేపట్టాలి. ఏ విధానంలోనైనా లోపాలు ఉంటాయి. వాటిని సరిచేసుకుని వెళ్ళాలి. ఏదో ఒక సాకుతో నియామకాల్లో జాప్యం సరికాదు. – ప్రొఫెసర్ వీఎస్ ప్రసాద్ (న్యాక్ మాజీ డైరెక్టర్, అంబేడ్కర్ వర్సిటీ మాజీ వీసీ)
నియామకాలు చేపట్టకపోతే కష్టం
వర్సిటీల్లో పోస్టులు భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. ఇది విద్యా ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బోర్డును రద్దు చేసి, కమిషన్ తీసుకొచ్చినా ఇబ్బంది లేదుగానీ, తక్షణమే నియామకాలు చేపట్టకపోతే వర్సిటీల మనుగడకే ప్రమాదం. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి (ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్)
Comments
Please login to add a commentAdd a comment