సాక్షి, ఖమ్మం: ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ కోసం ఎదురుచూసిన అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. ఈ కౌన్సెలింగ్‌కు సప్రీంకోర్టు అనుమతి నిరాకరించడంతో జిల్లాలోని దాదాపు రెండువేల మంది విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లాలోని 14 కళాశాలలకు అనుమతి రాలేదు. వాటిపై ఆశలు పెట్టుకున్న విద్యార్థులు చివరకు డిగ్రీలో చేరదామనుకున్నా.. సమయం మించి పోవడంతో ఆ ఆశలూ గల్లంతయ్యాయి. ఇక చివరి ఆశగా ఆయా కళాశాలల యాజమాన్యాలు కౌన్సెలింగ్‌కు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
ఎంసెట్ అర్హత పరీక్ష పూర్తయ్యాక రాష్ట్ర విభజన ప్రక్రియతో అడ్మిషన్లలో గందరగోళం తలెత్తింది. సుప్రీంకోర్టు జోక్యంతో ఉన్నత విద్యామండలి గత నెల 14 నుంచి 23వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేయించింది. సీట్ల కేటాయింపు 31 వరకు పూర్తయింది. ఎంసెట్‌లో జిల్లాలో 7,500 మంది అర్హత సాధించారు. జిల్లాలోని 23 ఇంజనీరింగ్ కళాశాలల్లో 8,200 సీట్లు ఉన్నాయి. వసతులు సరిగా లేవన్న కారణంతో జేఎన్‌టీయూ 174 కళాశాలల్లో కౌన్సెలింగ్ నిర్వహణకు అనుమతి నిరాకరించింది. వీటిలో జిల్లాకు చెందిన14 కళాశాలలు ఉన్నాయి.
వెబ్ కౌన్సెలింగ్‌లో ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం కేంద్రాల్లో 5,600 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేయించుకున్నారు. వీరిలో జిల్లాలో కౌన్సెలింగ్‌కు అనుమతి ఇచ్చిన తొమ్మిది కాలేజీల్లో 2,500 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్‌తో సీట్లు పొందారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన మిగతా మూడువేల మంది విద్యార్థుల్లో సుమారు వెయ్యి మంది హైదరాబాద్‌లోని కళాశాలల్లో వెబ్‌ఆప్షన్ ఇచ్చారు. ఇక రెండు వేల మంది జిల్లాలోని కళాశాలల్లో కన్వీనర్ కోటాలో వెబ్ ఆప్షన్ ఇచ్చినా వారు ఆశించిన కోర్సుల్లో సీట్లు లేవు. వారంతా రెండో విడత కౌన్సెలింగ్‌పై ఆశలు పెట్టుకున్నారు. సుప్రీం తీర్పుతో ఏమి చేయాలో తెలియని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
మార్చుకుందామనుకొని..
అనుమతి లేని వాటిలో తమకు నచ్చిన కళాశాలలు కూడా ఉండటంతో కొందరు విద్యార్థులు రెండో దశ కౌన్సెలింగ్‌లో సీటు మార్చుకుందామనే ఉద్దేశంతో ఏదో కళాశాలను మొదటి విడతలో ఆప్షన్‌గా ఎంచుకున్నారు. విద్యార్థులు ఎంచుకున్న కళాశాలల్లో రిపోర్టు చేసేందుకు అధికారులు ఈనెల 5వ తేదీ తుది గడువు పెట్టారు. ఈలోపు రాష్ట్రవ్యాప్తంగా 174 కళాశాలలు హైకోర్టును ఆశ్రయించి షరతులతో కూడిన అనుమతి తెచ్చుకున్నాయి.
ఇందులో జిల్లాకు చెందిన మిగతా కళాశాలలు ఉన్నాయి. వెంటనే ఆయా కళాశాలలు తమ కాలేజీల్లో అడ్మిషన్లు పొందవచ్చంటూ.. రెండో కౌన్సెలింగ్‌లో అవకాశం ఉంటుందంటూ జోరుగా ప్రచారం చేశాయి. జిల్లాలో సుమారు 200 మంది విద్యార్థులు మొదటి కౌన్సెలింగ్‌లో ఎంచుకున్న కళాశాలల్లో రిపోర్టు చేయలేదు. వీరితోపాటు మరో రెండువేల మంది విద్యార్థులు రెండోదశ కౌన్సెలింగ్‌పై ఆశలు పెట్టుకున్నారు.
సుప్రీంకోర్టు రెండో విడత కౌన్సెలింగ్‌కు అనుమతి ఇవ్వకపోవడంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారు. నూతన ప్రవేశాలకు అవకాశం ఇవ్వకున్నా కనీసం కళాశాలల మార్పిడికైనా అనుమతించాలని కోరుతున్నారు. కొందరు విద్యార్థులు స్పష్టత కోసం కౌన్సెలింగ్ కేంద్రాల వద్దకు పరుగులు తీస్తున్నా...అక్కడ ఎలాంటి సమాచారం చెప్పేవారు లేక నిరాశతో వెనుదిరుగుతున్నారు.
డిగ్రీలో చేరే అవకాశం లేక..
కాలేజీలకు అనుమతి వస్తుందని భావించిన విద్యార్థులు చివరకు డిగ్రీలో చేరుదామనుకున్నా సమయం దాటి పోయింది. ఇప్పటికే డిగ్రీ బీఎస్సీ కోర్సులో సీట్లు భర్తీ అయ్యాయి. తొలి విడతలో జిల్లాలోని కాలేజీల్లో ఆప్షన్ ఇచ్చుకొని సీటు రాక, రెండో విడత కౌన్సెలింగ్ కోసం ఎదురుచూసిన విద్యార్థులు ఇప్పుడు డిగ్రీ కళాశాలల చుట్టూ సీటు కోసం తిరుగుతున్నారు.
డిమాండ్ ఉన్న కోర్సులు భర్తీ కావడం.. సిలబస్ 25 శాతం వరకు పూర్తి కావడంతో ఏం చేయాలో తెలియక త లపట్టుకుంటున్నారు. ఏ డిగ్రీ కాలేజీలోనైనా సీట్లు ఉన్నా ప్రాధాన్యత లేని కోర్సులే ఉన్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక చివరి ఆశ కోసం కౌన్సెలింగ్‌కు అనుమతికి ముస్లిం మైనారిటీ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఒకవేళ కౌన్సెలింగ్‌కు అనుమతి వచ్చినా జరగాల్సిన నష్టం జరిగిందని యాజమన్యాలు అభిప్రాయపడుతున్నాయి.
ఎంసెట్ అభ్యర్థులకు సుప్రీం షాక్
Published Mon, Sep 15 2014 1:18 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 PM
Advertisement
Advertisement